కలసిమెలసి అన్యోన్యంగా... నవ్వుతూ తుళ్లుతూ ఆనందంగా... పిల్లల కేరింతలు, భార్యాభర్తల అనురాగాల మధ్య... సరదాలు, సందళ్లూ సాక్షిగా సంసారం సాగిపోవాలనే ఎవరైనా కోరుకునేది. పెళ్లి చేసినందుకు పెద్దలు, చేసుకున్నందుకు....................కుసుమ ఆ ఇంట ఏకైక పుత్రిక. లేకలేక కలిగిన సంతానం. దాంతో తల్లిదండ్రుల గారాబం మిన్నంటింది. డబ్బుకు లోటులేదు. ఇక చెప్పేదేముంది? కుసుమ కోరింది మరుక్షణంలో ప్రత్యక్షం కావాల్సిందే! కుసుమ తమ వరపుత్రికనీ, ఆమె ఏదైనా అడిగితే లేదు, కాదు అని చెప్పకూడదనీ, ఆమె కంట కన్నీరు ఒలకడమన్నది కలలో కూడా చూడకూదనేది ఆమె తల్లిదండ్రుల ప్రతిజ్ఞ. అది నెరవేర్చుకోడానికి వారు చేయని ప్రయత్నంలేదు. తల్లిదండ్రుల గారాబంలో కుసుమ యువరాణిలా పెరిగింది. రంగు, రూపుసైతం రాజకుమారిలానే! చుక్కల్లో చంద్రవంక అనాలి. వీటన్నింటితోపాటూ అహంకారం, అతిశయం కుసుమకు పెట్టని ఆభరణాలుగా మారాయి. వాటి పర్యవసానాలేంటో ఆమె తల్లిదండ్రులు ఊహించలేదు. అయినా, ప్రేమతో నిండిపోయిన కళ్లు కూతురిలోని లోపాలు చూడటానికి ఇష్టపడవుగా! అదే జరిగింది కుసుమ విషయంలో!
ఇంత గారాబంగా పెంచిన కూతురికి పెళ్లి చేయాలంటే సామాన్యమైన విషయమా? కుసుమ తల్లిదండ్రులు లోకమంతా జల్లెడపట్టారు. దొరికిన ప్రతి ఒక్కరినీ ఆరాతీశారు. ఎట్టకేలకు తమ కూతురికి తగినవాడు అనుకున్న విక్రమ్‌ను తగిన వరునిగా నిర్ణయించారు. అటు విక్రమ్ కుటుంబమూ కుసుమను తమ ఇంటికి కోడలిగా ఆహ్వానించడానికి సంతోషంగా సిద్ధపడ్డారు. అంగరంగవైభోగంగా పెళ్లి జరిగింది. కొత్తకాపురంలో ఆ దంపతులు ఎన్నో మధురానుభూతులను మూటకట్టుకున్నారు.
మెల్లమెల్లగా కుసుమకు అత్తవారింట్లో కొత్త తాలూకు బిడియం, బెరుకు పోయాయి. క్రమంగా కుసుమలోని సహజ లక్షణాలు పెల్లుబికడం మొదలయ్యాయి. కొత్త పెళ్లికూతురికి పనులు చెప్పకూడదు అనుకున్న విక్రమ్ తల్లికి తరువాత కూడా కుసుమ గదివిడిచి బయటకు రాకపోవడం విడ్డూరమనిపించేది. తినడానికి, షికార్లకు వెళ్లేటప్పుడు మాత్రమే కుసుమ కనిపించేది. అత్తగారితో, ఆడబడుచుతో కలవడానికి ప్రయత్నమే చేయలేదు. ఆడబడుచు సరదాపడి పలకరించబోయినా, కబుర్లు చెప్పబోయినా పట్టించుకునేదికాదు. కుసుమ దృష్టిలో విక్రమ్‌తప్ప మిగతావారంతా పరాయివారే! ఇది పద్ధతికాదని చూచాయగా చెప్పబోయినందుకు కుసుమ చేసిన రభస అంతాయింతా కాదు. తిరిగి ఆమెను మామూలుగా చేయడానికి విక్రమ్ చాలా బ్రతిమలాడాల్సి వచ్చింది. విక్రమ్‌కు అందరూ కావాలి. కానీ కుసుమకు ఆ అవసరమే కనిపించేది కాదు. విడికాపురం పెట్టేదాకా తాను ఇంట్లో ఉండే ప్రసక్తిలేదంటూ పుట్టింటికి వెళ్లిపోయింది.
ఈ అలజడి గమనించిన విక్రమ్ తల్లిదండ్రులు విడికాపురం పెట్టమని కొడుక్కి నచ్చచెప్పారు. పంతాలకుపోయి కాపురంలో కలతలు సృష్టించుకోవద్దన్నారు. తల్లిదండ్రుల కోరికమేరకు విక్రమ్ విడికాపురం పెట్టాడు. కుసుమను తిరిగి తీసుకొచ్చాడు. అయితే, సమస్యలు చక్కబడలేదు. కుసుమలో మొండితనం, పొగరు తగ్గనపుడు సమస్యలెలా తీరతాయి? ఆ భార్యాభర్తల మధ్యా రోజూ చిరాకులు, పరాకులే! విక్రమ్ సర్దుకుపోదామని ప్రయత్నించినా సాధ్యమయ్యేది కాదు. ఏ లోటూ లేకున్నా కుసుమకు ఏదో ఒక లోటు కనిపించేది. ఎన్ని సమకూర్చినా కుసుమకు అందులో తేడా అనిపించేది. ఏదో ఒక కారణం చూపి, రంధ్రాన్వేషణచేసి మరీ భర్తను బాధపెట్టేది. ఈ క్రమంలోనే వారికి ఓ కొడుకు పుట్టాడు. ఇప్పటికైనా పంతాలు మాని, సవ్యంగా ఉండమని విక్రమ్ నేర్పుగా చెప్పేవాడు. అయినా ఫలితం లేదు. విక్రమ్ తనవల్లకాదని విషయం కుసుమ తల్లిదండ్రులకు చెప్పాడు. కూతురికి నచ్చచెప్పాల్సింది పోయి వాళ్లు కూతురినే సమర్థించారు. కుసుమ తిరిగి బిడ్డతో పుట్టింటికి చేరింది.
స్నేహితునిద్వారా విక్రమ్ 'ఐద్వా లీగల్‌సెల్'కు వచ్చాడు. పసివాడికోసమైనా తమ కాపురం చక్కబడేలా చేయమని కోరాడు. కుసుమ మొండితనం పోతే చాలని, ఆమెలో మార్పు తీసుకురమ్మని కోరాడు. వచ్చేవారమే కుసుమను పిలిచి మాట్లాడదామని సభ్యులు విక్రమ్‌కు చెప్పారు.
No comments:
Post a Comment