పిల్లలంటే ఎవరికి మాత్రం ముద్దుండదు? పిల్లల ఆటపాటల్లో మైమరచిపోని వారెవ్వరు? పిల్లల ముద్దుమురిపాల్లో తేలిపోనివారెందరు? పెళ్లయ్యింది మొదలు భార్యాభర్తలు మాత్రమే కాదు, అత్తమామలు, బంధుమిత్రులు అంతా పుట్టబోయే బిడ్డ గురించే కబుర్లు చెబుతుంటారు. కలలు కంటుంటారు. ఎప్పుడెప్పుడు కొత్త అతిథి తమ ముంగిట్లో ఆడుకుంటాడా అని ఆత్రంగా ఎదురుచూస్తుంటారు................రజని గర్భవతి. కానీ, ఆ మొహంలో ఆ సంతోషంతాలూకు ఛాయలేమీ కనపడటంలేదు. కారణం, ఆమె గర్భవతి అని తెలియగానే అత్తగారింట ఎవరూ స్పందించలేదు. పైపెచ్చు 'ఏమంత కట్నకానుకలు తీసుకొచ్చావని మళ్లీ ఇంకొకరిని మా నెత్తిమీద కూర్చోపెట్టబోతున్నావ్' అనే దెప్పుళ్లు! భర్త విసుర్లు, అత్త కసుర్లు... వీటన్నింటిమధ్యా రజని నలిగిపోతోంది. అలాగని రజని కట్నకానుకలు ఇవ్వలేదా అంటే ఇచ్చింది. చదువుకోలేదా అంటే చదువుకుంది. అయినా ఆమె చేయని తప్పుకు బలైపోతోంది. ఆత్మన్యూనతాభావంతో నలిగిపోతోంది.
రజని డిగ్రీ చదువుకుంది. మధ్య తరగతిలో పెరిగిన అమ్మాయి. అణకువ, నిరాడంబరత ఆమెకు పుట్టుకతోనే అబ్బాయి. వివాహ విషయంలోనూ తల్లిదండ్రుల అభీష్టానికే ఓటేసింది. ఎవరిని తీసుకొస్తే వారినే చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదంది. తల్లిదండ్రులు చూసిన ప్రభాకర్‌ను రజని మనసారా ఇష్టపడింది. ఇరువురికీ నచ్చినంత మాత్రాన పెళ్లి కుదిరిపోదుగా! లోపలి గదిలో రజని వింటుండగానే కట్నకానుకల గురించిన చర్చ జరిగింది. అన్ని బేరసారాలు కుదిరిన మీదటనే పెళ్లి తారీఖు కుదిరింది. రజని అత్తింటివారి గొంతెమ్మ కోర్కెలు తీర్చడంకోసం రజని తండ్రి అప్పుచేయక తప్పలేదు. మొత్తానికి ఏ లోటూలేకుండా అమ్మాయిని అత్తవారింటికి పంపగలిగామని తృప్తిపడ్డారు.
అత్తవారింట అడుగుపెట్టిన రజని భర్త ప్రేమ, అత్తమామల ఆదరణను ఆశించడమే అత్యాశ అయిపోయింది. రజని అంటే వారి దృష్టిలో పనిచేయడానికి పైకం ఎదురిచ్చి మరీ వచ్చిన పనిమనిషి. ఇది ప్రతి ఇల్లాలికీ తప్పనిదే అనుకుని సంతృప్తి పడదామన్నా కుదురుగా ఉండనీయని వ్యక్తులు అక్కడ కొలువుతీరారు. తినీతినకా, ఓపికలేకపోయినా ఎవరికి తగ్గ ఏర్పాట్లు వారికి చేయాల్సిందే! ఈ సమయంలో రజని గర్భవతైంది. వారినుండి ఆనందం ఆశించడం సరే, కనీస మానవత్వాన్ని సైతం పొందలేకపోయింది. కడుపుతో ఉందని ఏదైనా తినమనడం వగైరాలేమీ లేవు. చివరికి ఏది మిగిలితే అది తిని కడుపు నింపుకోవడమే!
అలా రజని ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఏడాది గడవకముందే మరోసారి రజని గర్భందాల్చింది. 'వంశాన్ని ఉద్ధరించాల్సిన కొడుకు' ఎలాగూ పుట్టేశాడు కనుక మరో బిడ్డను కనాల్సిన పనిలేదనేది ప్రభాకర్ అభిప్రాయం. అందుకని ఇప్పుడు అర్జెంటుగా హాస్పటల్‌కెళ్లి రజనికి అబార్షన్ చేయించేయాలని హడావుడిపడ్డాడు. మరో బిడ్డ వద్దనుకున్నప్పుడు ఆ జాగ్రత్తేదో ముందే తీసుకోవాలి కదా అని రజని బాధపడింది. పుట్టబోయే బిడ్డను భ్రూణహత్య చేసేకన్నా ముందు ఎందుకు ఆలోచించలేదని ఆమె ఆవేదన. అయినా ప్రభాకర్ పట్టించుకోలేదు. రజని నిరాకరించినందుకు ప్రభాకర్ ఆగ్రహించాడు. రజనిని కొట్టడంతో సరిపుచ్చక కోపంతో టివి పగులకొట్టాడు. రజని చిగురుటాకులా కంపించింది. తన ఇష్టానికి ఎన్నడూ ప్రాధాన్యత లేదని తెలిసినా, బిడ్డను నిలుపుకోవాలని ఆశపడటం అవివేకమనుకుంది.
కానీ, ఇలా ఎన్నాళ్లు? ఎంతకాలం ఇలా అత్తింటి ఆరళ్లు భరించాలి? తనవాళ్లనుకున్న అత్తవారి చేతుల్లో ఈ బాధలు ఎన్నాళ్లు సహించాలి? అందుకే రజని ఒప్పుకోకపోయినా ఆమె తల్లిదండ్రులు 'ఐద్వా లీగల్‌సెల్'కు వచ్చి విషయం చెప్పారు. రజని అత్తింటివారిని పిలిపించి మాట్లాడదామని సభ్యులు వారికి భరోసానిచ్చారు.
No comments:
Post a Comment