Tuesday, November 22, 2011

'ఒకరికోసం ఒకరు'


దంపతులెవరైనా వెనవేల ఆశలతోనే దాంపత్యజీవితంలోకి అడుగుపెడతారు. ఆశలన్నీ ఒకరికి మరొకరు అనుసంధానించుకుంటారు. భావాలన్నీ పెనవేసుకుంటారు. 'ఒకరికోసం ఒకరు' అన్నమాట భార్యభర్తల తారకమంత్రం. నమ్మకం వారు నమ్మే మార్గం..............
మాటలు, అభిప్రాయాలు, సంప్రదింపులు, నిర్ణయాలు అన్నీ కలిసికట్టుగానే! అలాంటివారి వివాహబంధం నిండుకుండ. అయితే, 'ఇగో'ల పేరిట అర్థంలేని తగాదాలు, అవసరంలేని మాట పట్టింపులు... సంసారంలో సరిగమలు కాస్తా కర్ణకఠోరమైన రాగాలవుతాయి.. అవిచాలు, పచ్చని కాపురం బీడులా మారడానికి! పున్నాగపూల పరిమళాలు క్షణాల్లో ఇగిరిపోవడానికి!


నీరజ అలిగి కూర్చుంది. పొద్దున్నుండీ పచ్చిగంగైనా ముట్టలేదు. ఆకలివేయడం లేదా అంటే వేస్తోంది. కానీ, తిందామంటే భర్త ప్రసాద్‌ముందు చులకనైపోదూ! ఇదంతా ప్రసాద్‌ గమనిస్తూనేవున్నాడు. అతనికీ ఆకలి దంచుతోంది. అలాగని నీరజను బతిమాలలేడు. ఇప్పుడు కనుక మాట్లాడితే నీరజ 'చెట్టెక్కి కూర్చుంటుంది' అంటోంది మనోగతం. 'మగాడ్ని, నేను ముందు లొంగిపోవడమేంటి' అంటూ ఆత్మప్రబోధం. వెరసి ఇద్దరూ ఆకలితో మాడిపోతున్నారు. ఇది మొదటిసారి కాదు. వారేమీ బలవంతంగా కట్టబెట్టిన దంపతులు కాదు. ఒకరినొకరు ఇష్టపడి, ప్రేమించుకుని, ఈ బంధంలోకి అడుగుపెట్టారు. మరిప్పుడీ తగాదాలేంటీ అని అడిగితే... వారు చెప్పే సమాధానాలు చిన్నపిల్లల కీచులాటలను తలపిస్తాయి.
నీరజ, ప్రసాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు. చదువులు, ఆదాయాలు సమతూకంగా ఉన్నాయి. అభిరుచులు, అలవాట్లూ పోటీపడి ఏకాభిప్రాయాన్ని తెచ్చుకున్నాయి. ఈ సమఉజ్జీలకు ఏకంకావాలనే ఆలోచన రావడంలో ఆశ్చర్యమేముంది? అదే అనుకున్నారు నీరజ, ప్రసాద్‌. వెంటనే పెద్దలను సంప్రదించారు. వంక పెట్టడానికి ఏమీ లేదు కనుక ఇరుపక్షాలూ సై అన్నాయి. రెండునెలల్లో వారిద్దరూ జంటగా మారారు. ఉద్యోగంలో సహచరులు కాస్తా జీవితంలోనూ సహచరులయ్యారు.కానీ, అలవాట్లు కలిసినంత సులువుగా అభిప్రాయాలు కలవలేదు. అన్నిటా సమానులు కావడమే వారికి పెద్ద ఆటంకమైపోయింది. కేవలం అర్థంచేసుకోకపోవడం మూలంగా కాపురం వారిద్దరికీ కొండనెక్కినంత కష్టమైపోయింది. 'ఎందుకు సర్దుకుపోవాలి? నాకేం తక్కువ? నేనే ఎందుకు వంటచేయాలి?' అని నీరజ అంటే, 'మగాడ్ని, నేను వంటచేయడమేంటి, నాన్సెన్స్‌!' అనేది ప్రసాద్‌ గింజులాట! 'ఏడాదికి లక్షలు తీసుకొస్తున్నాను. నాకేం అవసరం' అంటుంది నీరజ. 'నీతో నాకు వాదనేంటి? ఛస్తే నేను వంటగదిలోకి రాను. ఏం చేసుకుంటావో చేసుకో' అని ప్రసాద్‌ అంటే, 'మానెయ్యండి' అంటూ వంట జోలికే పోదు నీరజ. సినిమాకెళ్లాలన్నా, షాపింగుకెళ్లాలన్నా, ఏం కొనాలన్నా తమ ఇష్టమే సాగాలంటూ చిన్నపాటి రణరంగం. ఇలా ఒకటనేల సర్వం గొడవలమయమే!
ఈ అల్లిబిల్లి గిల్లికజ్జాలతో కొత్తకాపురం తాలూకు మధురిమలన్నీ ఆవిరైపోతున్నాయి. అప్పుడే 'విడిపోయినా హాయిగా బతకగలం. అలాంటప్పుడు సర్దుకుపోయి బతకాల్సిన అవసరమేంటి?' అన్న ఆలోచన ఇద్దరిలోనూ పొడసూపింది. చదువు, ఉద్యోగం పెంచిన ఆత్మవిశ్వాసం అత్యుత్సాహంగా మరింది. దీనిముందు పెళ్లి, దాని ఆవశ్యకత, ఆ సర్దుబాట్లలో ఉండే ఆనందం... ఇవేవీ వారి తలకెక్కడంలేదు. అయితే, పెద్దవాళ్ల బలవంతంమీద 'ఐద్వా లీగల్‌సెల్‌'కు వచ్చారు. సభ్యులు 'అసలు భార్యాభర్తల్లో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువేంటి? కలిసి జీవించాల్సినవాళ్లు. లొంగిపోవడం అన్న ప్రశ్న ఎందుకొస్తోంది? ప్రేమికులుగా ఎన్నోసార్లు ఎన్నో విషయాలకు సర్దుకుపోయుంటారే. మరి, భార్యాభర్తలుగా ఎందుకు విఫలమవుతున్నారు? కలిసి జీవించడంకన్నా అహం తృప్తిపరచుకోవడంలోనే ఆనందం దొరుకుతుందా? ఇదేనా మీరు కలలు కన్న భవిష్యత్తు? దీనికోసమేనా మీరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నది? మీ తొందరపాటు నిర్ణయాలతో భవిష్యత్తును నాశనంచేసుకోకండి' అని మందలించారు. నీరజకు, ప్రసాద్‌కు తప్పు ఎక్కడ జరుగుతుందో అర్థమైంది. అహంకారపు పొరలు విడిపోవడమే కాదు, అపార్థాల కారుమబ్బులూ తొలిగిపోయాయి. ఇక ప్రతినిత్యమూ వారి ఇంట పండువెన్నెల వెండివానలా కురుస్తోంది!!

No comments:

Post a Comment