Thursday, April 7, 2011

హైటెక్‌ తాయిలాలు

`
ఘనత వహించిన గణతంత్రంలో ఇదో వింత! ఎన్నికలు దాటాక ఎందుకూ కొరగాని సామాన్యుడు ఎన్నికల వేళ మాత్రం రారాజు. చూపుకు అందని నాయకులు ఇంటి చుట్టూ ప్రదక్షిణలు, స్తోత్రాలు, వాగ్దానాలు ఒక నాటి మాట. ఈ విషయంలో తమిళనాడు రూటే మొదటి నుండీ సపరేటు. దండలూ దండాలు, కానుకలే కాదు ఇప్పుడు ఓటరు దేవుళ్ల ఫోనుబిల్లులు, కరెంటు బిల్లులు చెల్లించటం; టీవీలూ ఫ్రిజ్జులూ సమకూర్చటం; టిడిహెచ్‌ కనెక్షన్లు ఉచితంగా అమర్చటం; నేరుగా బ్యాంకు ఖాతాలకు సొమ్ము వేయడం వంటి చెప్పన్న మార్గాలు అనుసరిస్తున్నాయట అక్కడి పార్టీలు.

గత ఎన్నికల్లో ఒక పార్టీవారు టీవీలిస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చాక ఎంచక్కా ప్రభుత్వ సొమ్ముతో టీవీలిచ్చారు. టీవీ ప్రభుత్వానికి కేబుల్‌ కనెక్షన్‌ రాజకీయ నాయకులది. ప్రభుత్వ సొమ్ముతో వ్యాపారం చేసుకోవడం ఎలాగో వారి నుంచే నేర్చుకోవాలి మరి.
ఒకరు టీవీలిస్తామన్నారు. మరొకరు ఆడపిల్ల పెళ్లికి మంగళ సూత్రం చేయిస్తామన్నారు. మరి మీరేమిస్తారని మార్క్సిస్టు పార్టీ అభ్యర్థులను అడిగారట అక్కడ గత ఎన్నికల్లో. టీవీ తెచ్చుకోండి మంగళ సూత్రం తెచ్చుకోండి. పెళ్లికి మేము అక్షింతలు, ఆశీర్వాదాలు తెస్తాం. మాకు ఓటేయండి అని చెప్పారట సిపిఎం అభ్యర్థులు. జీవితాల్నే పేదల కోసం అప్పగించిన పేద అభ్యర్థులు అంతకంటే ఏం చేయగలరు పాపం. డబ్బుతో గెలిచాం అనుకునేవాళ్లకు ఆ తరువాత డబ్బే సర్వస్వం అవుతుంది. స్వాహా యావే తప్ప- ప్రజాసేవ గుర్తుండదు.
`
రాజావారిని చూశాంగా. ఒకటా రెండా లక్షా డెబ్భై ఆరు వేల కోట్లు నొక్కేసి ప్రస్తుతం కృష్ణ జన్మస్థానంలో వున్నారు. ఆ పాపంలో భాగం పంచుకొన్నవాళ్లు ఎన్నికల బరిలో వున్నారు. 'మళ్లీ గెలిపించండి. ఇంకెన్ని కోట్లు మింగేస్తామో చూడండి...' లోలోపల అనుకొంటూ కాలికి బలపం కట్టుకొని మరీ తిరుగుతున్నారు .

No comments:

Post a Comment