Friday, April 8, 2011

బీట్‌ ది హీట్‌

అవును! ఎండలు ముంచుకొస్తున్నాయి. చెట్లను నరికెయ్యడం, కర్మాగారాలు వగైరా స్వార్థపూరిత ప్రయోజనాల ఫలితమే ఈ భరించలేని వేడి. కాలుష్యం, గ్లోబల్‌ వార్మింగ్‌, ధృవాల్లో మంచు కరిగిపోవడం, ఓజోన్‌ పొరకు గాయం... ఇవన్నీ కోరి తెచ్చుకున్న నిర్లక్ష్యం ఫలాలే! పాపం! 

 ప్రకృతి మాత్రం ఎంతకని ఓర్చుకుంటుంది? నన్ను సంరక్షిస్తే అది మిమ్మల్ని సంరక్షించుకోవడమేనర్రా అని మొత్తుకుంటున్నా మన గోల మనదే గానీ పట్టించుకుంటేనా?! 'కూర్చున్న కొమ్మను నరుక్కోవడమంత బుర్ర తక్కువ పని మరోటి లేదు' అని పెద్దలు చెప్పినా తలకెక్కదయ్యే! ఎవరు చేసిన ఖర్మ వారు అనుభవించక తప్పదుగా! సో, ఈ వేసవితాపాన్ని భరించక తప్పదు. కానీ ఎండ బారినుండి కాపాడుకోవడానికి మార్గాలు అన్వేషిస్తాలిగా! అందుకే ఈ జాగ్రత్తలు...
* వేసవిలో నీరు చాలా అవసరమని మనకు తెలుసుగా! (ఆ మాటకొస్తే నీటి అవసరం లేనిదెన్నడు?) అందుకే బైటకు వెళ్లేటప్పుడు వాటర్‌బాటిల్‌ తప్పనిసరి! డీహైడ్రేషన్‌కు గురవకుండా వీలైనంత ఎక్కువ నీరు తాగాలి. ఆ నీరుదేముంది, 'ఎక్కడైనా' కొనుక్కోవచ్చులే అనుకోవద్దు. బాటిల్స్‌, ప్యాకెట్‌లలో అమ్మే నీటి శుభ్రత అనుమానమే. అలాగే నోరు పిడచగట్టుకుపోతుంటే చల్లచల్లగా గొంతు తడుపుకోడానికి కూల్‌డ్రింకులున్నాయిగా అనుకోవద్దు. అవన్నీ రసాయనాల సమ్మిళితం. అనారోగ్యభరితం. సో, బీ కేర్‌ఫుల్‌! ఈ తిప్పలన్నీ ఎందుకు, కొద్దిగా భారమైనా ఓ చిన్న మంచినీళ్ల బాటిల్‌ హ్యాండ్‌బ్యాగ్‌లో వేసుకోరాదా?!
* బైటకెళ్లే ముందే నీరు, మజ్జిగ, పళ్లు, రాగి జావ వంటివి తాగి వెళ్లాలి. ఈ జాగ్రత్త తిరిగి ఇంటికొచ్చేవరకూ మనల్ని కాపాడుతుంది.
* ఎండ సమయంలో బైటికి వెళ్లకపోవడమే ఉత్తమం.
* తగని తప్పని పనులైతే గొడుగు, కళ్లజోడు, స్కార్ఫ్‌లు తప్పనిసరి.
* వేసవిలో దొరికే పళ్లు తప్పక తినాలి. ఖరీదెక్కువ అనుకోవద్దు. ఐస్‌క్రీములు, కూల్‌డ్రింకులకు పెట్టే డబ్బులు ఇటు పెడితే చాలు, ఆరోగ్యం... చల్లదనం!
* దాహం వేసింది కదాని రోడ్లపై కనిపించే పళ్లరసాల పని పట్టకండి! అక్కడేమాత్రం
శుభ్రంగా ఉందో ఓసారి కళ్లారా పరికించండి!
* చెరుకురసం మంచిదే! కానీ అందులో వేసే ఐస్‌ మాత్రం అస్సలు మంచిది కాదు. ఐస్‌ లేకుండా తాగుతున్నారా? అయితే ఓకే!
* బైటకు వెళ్లేప్పుడు సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవడం మరవద్దు.
* మామిడి పండు ఎందుకు మాజా ఉండగ అనుకుంటుంటే మామిడి గుజ్జులో కాలేసినట్లే! రసాయనాలు రంగరించి, దానికి ప్రకటనల రసికత మేళవించినంత మాత్రాన అది 'నేచురల్‌' కాదు. దానికంటే ప్రకృతి వరం, పోషకాల నిలయమైన మామిడిపండు భేషైన ఎంపిక!
* అనకూడదు కానీ, మన తత్వం ఎలాంటిదంటే... పసుపు, చందనం ఒంటికి రాసుకోండిరా చల్లదనం అని పెద్దలు చెపితే వినం. కానీ... పసుపూ, చందనాల మిశ్రమం అంటూ అభిమాన తార హొయలు పోతూ చెపితే చాలు... అసలుకు మూడింతలు ధర చెల్లించి ఆ సబ్బు కొంటాం. సబ్బనే కాదు, ప్రకృతిసిద్ధంగా కళ్లముందు కనపడేవి వదిలేసి రసాయనాలు వాడటమే ఫ్యాషన్‌ అనుకోబట్టే వారికి కోట్లు, మనకు ఎలర్జీలు. వేసవికి చల్లదనాన్నిచ్చే వస్తువులు వంటింట్లో ఏమున్నాయో కాస్త దృష్టి సారించండి. హమ్మయ్య! దొరికాయా? మరికనేం, ప్రొసీడ్‌!
ఈ జాగ్రత్తలకు తోడు మల్లెల సౌరభం, సెలవుల్లో పిల్లల సందడి... వీటిమధ్య వేసవి తుర్రుమనడం ఎంతసేపు?!

1 comment:

  1. వేసవిలో పన్నీటి జల్లులు

    ReplyDelete