భార్య అంటే ఇంట్లో తక్కిన వస్తువుల్లానే భావించే పురుషులు నేటికీ ఉన్నారు. భార్య అంటే వారికి జీతంలేని ఇంటి పనిమనిషి. పిల్లల్ని కనే యంత్రం. ఉల్లాసాన్నిచ్చే(తనకు మాత్రమే) జడపదార్థం. ఆమెను సహచరిణిగా గుర్తించడం మాట తర్వాత ముందు మనిషిగానే గుర్తించరు. ఎన్ని బాధ్యతలు పంచుకున్నా, ఎన్ని ఒడిదుడుకుల్లో బాసటగా నిల్చినా ఆమెకు అర్థాంగిగా విలువే లేదు. ఆమె పోయినందువల్ల నష్టమే లేదని, వీరు కాకుంటే మరొకరని అనుకోవడం కద్దు. అందుకే భార్యను 'వదిలించుకోవడానికి' మరో ఆలోచన లేకుండా సిద్ధపడతారు.రమ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువతి. ఉన్నదాంట్లో సర్దుకుపోవడం, సంతృప్తి చెందడం ఆమెకు అలవాటే. కోరికలకు, ఆశలకు కళ్లెంవేసి ఆపడం ఆమెకు బాల్యంనుండీ అలవడిన విద్య. అందని దానికి అర్రులుచాచడం ఎన్నడూ లేదు.
అందుకే ఇంతకంటే ఎక్కువ చదివితే అంతకన్నా ఎక్కువ చదివిన వరుడ్ని వెతకాలి. ఇక ఆపేయమ్మా అనగానే ఇంటర్‌తో చదువు మానేసింది. కుట్టుపని నేర్చుకోవడం, ఇంట్లో తల్లికి సాయపడటం... ఇలా రోజులు నడుస్తుండగా రమ తండ్రి ఓ సంబంధం తీసుకొచ్చాడు. వరుడు శ్యామ్. చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లాన్ని పోషించగల స్థోమత ఉంది. కట్నం రమ తండ్రికి అందుబాటులో ఉంది. దాంతో మరో ఆలోచనలేకుండా శ్యామ్‌తో కూతురి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాడు. తండ్రి చెప్పిన విషయాల్లో అభ్యంతరపెట్టేదేమీ కనపడలేదు రమకు. మౌనంగా తలూపి తన అంగీకారం తెలిపింది. మరో రెండు నెలలకే శ్యామ్ భార్యగా అత్తవారింట్లో అడుగుపెట్టింది.
సగటు మధ్య తరగతి జీవనంలో ప్రత్యేకతలు ఏముంటాయి? సామాన్యంగానే ఆమె జీవితం గడుస్తోంది. కాలక్రమంలో ఇద్దరు పిల్లలు కలిగారు. ఉన్నంతలో సంతృప్తిపడటం రమకు మరింత అలవాటైపోయింది. ఇంతలో అనుకోని ఉత్పాతం వచ్చిపడింది. శ్యామ్ కిడ్నీ ఒకటి పాడైంది. దానికి ఆపరేషన్ చేయించుకోవడంతో వెంటనే నయమైంది. ఆ తర్వాత శ్యామ్‌కు ఏం బుద్ధిపుట్టిందో ఏమో భార్యను వదిలించుకోవాలని యత్నాలు ప్రారంభించాడు. ఏంటీ అని ఆరాతీస్తే, అతనిలో పెరిగిన ఆత్మన్యూనతాభావమే కారణమని తేలింది. ఎందుకూ అంటే, ఒక కిడ్నీ లేదు కనుక శ్యామ్‌కు ఇక భార్యను సంతృప్తి పరచలేననే అనుమానం పెరిగింది. ఒకవేళ అదే కనుక జరిగితే ఆమె దృష్టిలో తానంటే విలువ తగ్గిపోతుందనే దుగ్థ అంతకంతకూ వటవృక్షమై కూర్చుంది. దీనిబదులు రమనే ఇంటినుండి వెళ్లగొడితే?! ఏ గొడవా ఉండదుగా అనుకున్నాడు. అప్పటినుండీ రమను అకారణంగా వేధించడం, సాధించడం మొదలెట్టాడు.
అవి చాలవన్నట్లు శ్యామ్ మరిన్ని పోకడలు పోయాడు. ఏ భర్తా చేయని సాహసం చేశాడు. గల్ఫ్‌లో ఉండే రమ సోదర సమానుని నుండి వచ్చిన బహుమతిని ఆధారం చేసుకుని ఆమె శీలంపై నిందవేశాడు. అతనితో రమకు వివాహేతర సంబంధముందంటూ ప్రచారంచేశాడు. అప్పటిదాకా శారీరకంగా, మానసికంగా హింసించినా ఊరుకున్న రమ దీన్ని భరించలేకపోయింది. ఇన్నాళ్ల తన సహనానికి, ఓర్పుకూ ఫలితంగా భర్త చూపిస్తున్న 'ఆదరణ'కు విస్తుబోయింది. ఇదేం పద్ధతంటూ కన్నీరుపెట్టింది. తప్పు తెలుసుకుని మన్నించమని అడగాల్సింది పోయి శ్యామ్ రమను పుట్టింటికి పొమ్మన్నాడు. మళ్లీ పిల్లలిద్దరూ అతనికి కావాలిట! వారిద్దరినీ తనతోనే ఉంచుకుంటాడట! కానీ వారిని అందించిన ఇల్లాలు మాత్రం తక్షణం ఇల్లొదిలి పోవాలిట! దీనికి రమ ససేమిరా అంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ బిడ్డల్ని వదిలి పోనని చెప్పేసింది. భర్త తీరుతెన్నుల్ని ప్రశ్నించేవాళ్లు'ఐద్వా లీగల్‌సెల్' వాళ్లేనని బయల్దేరి అక్కడికొచ్చింది. తన ఆవేదనంతా నివేదించింది. అతనిలో రేగిన అనుమాన భూతానికి తనను బలిచేస్తోంది చాలక, కన్నబిడ్డలను తననుండి దూరంచేయడాన్ని సహించబోనంది. ఎలాగైనా తన బిడ్డలను తనకు అప్పగించమంది. అతనితో కలిసి ఉండటమంటే నిప్పుతో కలిసి ఉండటమేనని, ఏనాటికైనా తగలబడిపోవడం తప్ప ప్రయోజనం లేదని కంటతడి పెట్టింది. ఆమె స్థితికి సభ్యులందరూ చలించిపోయారు. గుండె బరువై ఒక్క క్షణం మాట్లాడలేకపోయారు.తరువాత బిడ్డలకోసం, న్యాయంకోసం లీగల్‌గా ప్రొసీడవడం మంచిదని సలహా ఇచ్చారు. ఆ ప్రకారంగానే రమ ముందడుగు వేసింది.
No comments:
Post a Comment