Monday, April 18, 2011

ధగ ధగ... భగ భగ...

'ఆ ధగధగలు చూసి ఎవరైనా మనసు పారేసుకుంటారు. మైమరచిపోతారు. ఆ మైమరపులో చప్పున తాకితే మాత్రం భగ భగ మండుతుంది. చెయ్యి కాలుతుంది. బర్నాల్‌ రాసుకున్నా ప్రయోజనం ఉండదు. ఇంతకీ ఆ ధగధగలు ఎవరివి? ఆ చెయ్యి ఎవరిది?' అని ఇవాళా రేపూ ఏదైనా రియాల్టీ షోలో అడిగినా అడగొచ్చు. ఆలోచించుకునే అవకాశం ఇవ్వరు యాంకర్లు. లొడలొడా మాట్లాడేస్తుంటారు. స్విచ్‌ వేస్తే బల్బు వెలిగినంత వేగంగా చెప్పాలి! లేకపోతే పాయింట్లు పక్కవారికి వెళ్లిపోతాయి. ఇంతకీ ఆ ధగధగలు ఎవరివి? వెండీబంగారాలవండీ బాబూ. ఆ చెయ్యి ఎవరిదో ప్రత్యేకంగా చెప్పాలా?! మనదే!

బంగారం అన్న మాట వినబడితే చాలు! కళ్లల్లో మెరుపుల్‌ తళుకుల్‌. కొనబోతే మాత్రం కరెంటు షాక్‌ కొట్టినట్టవుతుంది. పది గ్రాముల పుత్తడి ధర దగ్గర దగ్గరగా 22 వేల రూపాయలు, కేజీ వెండి 62 వేల రూపాయలు. పప్పూ, బియ్యం ధరలూ ఆకాశాన్నంటాయి. బంగారం రేటూ చుక్కలనంటుతోంది. అన్నీ కలిసి పాల్గొంటున్న ఈ రన్నింగ్‌ రేసులో గెలుపెవరిదైనా! ఓటమి మాత్రం సామాన్యులదే. 'కలి కాలం' కాదు కానీ 'కాలే కాలం' అని సరిదిద్దుకోవాలిమరి! ఇంత ఖరీదైన బంగారానికి భద్రత ఎక్కడుంది? పట్టపగలే ప్రాణాలు తీసి మరీ నగలు దోచుకుంటున్నారు. తాళం వేసిన ఇంటిని తిరిగి తెరచి చూసుకునే దాకా గుండె దడే. ఒకవేళ దొంగ దొరికినా పోయినదంతా వస్తుందన్న గ్యారెంటీ లేదు. ఎవరి వాటాలు వారికుంటాయిమరి. బంగారం భయపెడుతోందని ముంగిట్లోకొచ్చిన పెళ్లిళ్ల సీజన్‌ వెనుదిరగదు. పెళ్లిచూపులూ ఆగిపోవు. పిల్ల బంగారంలా వుందంటారు. నగదుతోపాటు నగానట్రా అలంకరించి పంపమంటారు. వెనకాముందూ చూసుకోకుండా తలూపామా స్థాయినిబట్టి సమర్పించుకోవాల్సిందే.మన ఇంటి బంగారానికి బజారు బంగారంతో ముడిపెట్టే ముదనష్టం ఎప్పటికి ముగుస్తుందో!

No comments:

Post a Comment