హైదరాబాద్: నూటొక్క జిల్లాల అందగాడ్ని అంటూ తెలుగు సినీ ప్రేక్షకులను అలరించిన నూతన్‌ప్రసాద్ ఇక లేరు. దేశాన్ని క్లిష్టపరిస్థితుల్లోనే వదిలి తన దారిన వెళ్లిపోయారు.ప్రముఖ సినీ నటుడు నూతన్ ప్రసాద్ ఈరోజు ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈరోజు ఉదయం పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా కన్నుమూశారు.నటనతోనే కాక తనదైన వాచకంతో ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్నారు నూతన్ ప్రసాద్. కొన్ని వందల సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనదైన డైలాగ్ డెలివరీతో అభిమానుల మనసుల్లో చెరగని ముద్రవేశారు.
అందాల రాముడు చిత్రంతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన నూతన్ ప్రసాద్ ముత్యాలముగ్గుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో నిత్యపెళ్లికొడుకుగా, రాజాధిరాజు సినిమాలో సైతాను పాత్ర ఆయనను విలక్షణ నటుడిగా నిలిపాయి. 1989లో 'బామ్మమాట బంగారు బాట' సినిమా షూటింగ్‌లో ప్రమాదంతో చక్రాల కుర్చీకే పరిమితమయ్యారాయన. ఆ సినిమాలో భానుమతితో కలిసి నటించారాయన. ప్రమాదంనుంచి ఆత్మస్త్థెర్యంతో కోలుకున్న నూతన్ ప్రసాద్ తర్వాత చక్రాల కుర్చీలో ఉండే 'కర్తవ్యం' సినిమాలో నటించారు. 1984లో 'సుందరి సుబ్బారావు' సినిమాలో ఉత్తమ సహాయనటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఖైదీ, మగమహారాజు, శ్రీవారికి ప్రేమలేఖ, కథానాయకుడు, పట్నం వచ్చిన పతివ్రతలు, అహ నా పెళ్లంట... తదితర చిత్రాల్లో ఆయన నటించారు. 2005లో నూతన్‌ప్రసాద్ ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకున్నారు. కామెడీ విలన్‌గా నాగభూషణం తర్వాత అంతటి పేరొందిన నటుడు నూతన్‌ప్రసాదేనని అభిమానులు అంటారు.
నూతన్ ప్రసాద్ 1945, డిసెంబరు 12న కృష్ణాజిల్లాలోని కైకలూరులో జన్మించారు. ఆయన అసలు పేరు తాడివాడ వరప్రసాద్. ఐటీఐ చదివే రోజుల్లోనే నాటకాల్లో పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నూతన్ ప్రసాద్ తన ప్రతిభకు గుర్తింపుగా అందుకున్న తొలి బహుమతి 'ఒక దువ్వెన' అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నూతన్‌ప్రసాద్‌కి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు నూతన్ కుమార్ కూడా నటుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు.
నూతన్ ప్రసాద్ మృతి పట్ల చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు ప్రముఖులు నూతన్‌ప్రసాద్ మృతిపట్ల సంతాపం ప్రకటించారు.
No comments:
Post a Comment