Monday, March 28, 2011

వింత గుండె!

'నూటికో కోటికో' అంటుంటామే అది చైనాలో జరిగింది. జింగ్‌ జింగ్‌ అనే చిన్నారి అలాంటి అరుదైన పిల్లవాడు. ఎలాగంటారా! వాడి గుండె అందరిలాంటిది కాదు. ప్రత్యేకమైనది. కాళ్లూ చేతులకు మల్లే నేను కూడా బయటే ఎందుకు వుండకూడదు. లోపల ఎందుకు మగ్గిపోవాలని అని అనుకుందేమో! ఏకంగా వాడి ఉదర భాగంలో పైకి వచ్చేసింది. పుట్టేటప్పుడే అలా పుట్టాడు. అయితే పొట్టమీద నల్లటి మచ్చలా వుంటే వాడి తల్లిదండ్రులకు అర్ధం కాలేదు. పెద్ద ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ వైద్యులు చెప్పారు. అది గుండె అనీ...బయటికే కనిపిస్తోందనీ...అయితే ఆరోగ్యంగానే వుందనీ. అమ్మో అవయవాలన్నిటిలోకి ప్రధానమైన గుండె ఇలా బహిరంగంగా కనిపిస్తుంటే ఎవరికైనా భయమేస్తుంది. పొరపాటున దానికేదైనా తగిలితే అంతే సంగతులు కదా అని కూడా అనిపిస్తుంది. కొందరు మాత్రం జింగ్‌ జింగ్‌ ఎంతో కాలం బతకడని అనుకుంటున్నారు. అయితే వాడిని పరీక్షిస్తున్న వైద్యులు ధైర్యం చెబుతున్నారు. ప్రస్తుతానికి జింగ్‌ రెండు నెలల పిల్లవాడే కనుక...మరి కొంత కాలం వరకు అవయవాలు వృద్ధి చెందుతుంటాయి కనుక ... ఆపరేషన్‌ చేయడానికి ప్రస్తుతానికి వీలవదన్నారు. కొద్ది కాలం గడిస్తే చిన్నారి జింగ్‌ ఆపరేషన్‌ను తట్టుకోగలుగుతాడని వారి అభిప్రాయం. ఏదేమైనా జింగ్‌ జింగ్‌ ఆపరేషన్‌ విజయవంతం కావాలని వాడు చెంగు చెంగున పరుగెడుతూ ఆడుకోవాలని కోరుకుందాం.

No comments:

Post a Comment