నందిని, ఆమె భర్త, కొడుకు పండక్కి ఊరెళ్లారు. ఓరోజు సాయంత్రం వారు ముగ్గురూ, అత్తగారు అంతా కలిసి బజారుకెళ్లారు. షాపింగ్ పూర్తయ్యాక అంతా తిరుగుముఖం పట్టారు. సిటీబస్ రావడంతో గబగబా ఎక్కేశారు కానీ ఎక్కడా ఖాళీ లేదు. అప్పటికే రెండు రోజులనుండి పండుగ పనులు, పిండివంటలకు తోడు షాపింగ్ అదనం ప్లస్ వయసు కారణాన నందిని అత్తగారు కొద్దిగా అలసటగా ఉన్నారు. చుట్టూ పరికించిన నందినికి స్త్రీలకు కేటాయించిన సీట్లలో కూర్చుని ఉన్న మగమహారాజులు కనిపించారు. వెంటనే అటుపోయి 'కాస్త లేస్తారా..' అంటూ మర్యాదగా అడిగింది. అదేం పాపమో, ఆ మాటలు వారి చెవులకే సోకలేదు. నందిని కాస్త గొంతు పెంచి, ''ఇది లేడీస్ సీటు. కొంచెం లేవండి' అంది. అయినా వారికి చీమైనా కుట్టినట్లు లేదు. ఇలా కాదని, 'చెబుతుంటే వినరేంటి? లేవండి' అంటూ గద్దించింది. 'ఈ బస్సేమన్నా మీ సొంతమా, దబాయిస్తున్నారు' అంటూ ఎదురు ప్రశ్నించాడు ఆ సీట్లో విలాసంగా కూర్చున్న ధీరుడు.'సొంతమేమిటండీ! లేడీస్ సీటు కనుక లేవమంటున్నాం. అదే మీ అమ్మయితేనో, అక్కయితేనో లేవరా? ఇప్పుడెందుకు చూసీ చూడనట్లు కూర్చుంటున్నారు?' అడిగింది నందిని కోపంగా. ఈలోగా నందిని అత్తగారు, 'ఊరుకో నందినీ. కాసేపటికోసం వాళ్లతో తగాదా ఎందుకు?' అంటూ మొదలెట్టారు. అదిచూసి, 'ఏదో వాళ్ల బస్సయినట్లు ఫీలైపోతోంది' అంటూ వాళ్లూ రెచ్చిపోయారు. 'ఏంటీ మాట్లాడుతున్నారు? పోనీ ఈ బస్సు మీ సొంతమా? ఇక్కడే పాతుకుపోతారా? పెద్దవయసువాళ్లని చూసికూడా లేవట్లేదంటే మీ చర్మం ఎంత మందమో తెలిసిపోతూనే ఉంది' అంటూ నందిని అరుస్తుండటంతో ఇక తప్పదన్నట్లు లేచారు. కూర్చోనని అంటున్నా నందిని అత్తగారిని బలవంతంగా కూర్చోపెట్టింది.
అంతలో ఉక్రోషం ఆపుకోలేని ఆ పురుషపుంగవులు వెనకనుంచి, 'ఏదో ఆడదని ఊరుకుంటున్నాం కానీ...' అని వినపడటంతోనే నందిని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే కొంగుదోపి, 'ఏంట్రా, ఏం వాగుతున్నావ్? ఆడదంటే తక్కువనుకుంటున్నావా? దీన్నిబట్టే అర్థమవుతోంది... ఇంట్లో భార్యకు, తల్లికి ఏమాత్రం విలువిస్తావో' అంటూ నందిని అరవడం ప్రారంభించింది. ఇంతలో నందిని అత్తగారు, 'రాయ్యా! ఇక్కడే కూర్చో. ఈ మాత్రం దానికి ఎందుకన్నన్ని మాటలు. అనవసరంగా నోరు చేసుకోవడాలు..' అంటూ నందిని ఎంత వారిస్తున్నా లేచి నించుంది. మరోపక్క ఒక ముసలాయన, 'బాబూ! ఆడోళ్ల సీటని లేవమన్నందుకు ఎందుకు ఆ అమ్మాయిపై పోట్లాట? ఇలా వచ్చి నా సీట్లో కూర్చో' అన్నాడు.
చిత్రం ఏమిటంటే అంత పెద్దాయన లేచి సీటు ఇస్తుంటే ఏమాత్రం సిగ్గూ, మొహమాటం లేకుండా అతగాడు వెళ్లి ఆ సీట్లో కూర్చున్నాడు. ఇంతలో నందిని వాళ్లు దిగాల్సిన స్టేజీ వచ్చింది. అంతా దిగిపోయారు. దిగీ దిగగానే నందిని భర్త, 'నీకెందుకు వచ్చిన తిప్పలు చెప్పు? బస్సులో అలా గట్టిగా పోట్లాడాలా? అనవసరంగా బిపీ పెంచుకోవడం కాకపోతే...' అన్నాడు. అత్తగారు, 'నిజంగా లేచే మనస్తత్వం ఉన్నవాళ్లయితే మనల్ని చూడగానే లేచేవాళ్లు. కానీ వాళ్లసలు పట్టించుకోనేలేదు. అలాంటివాళ్లు నువ్వు పోట్లాడితే మాత్రం లేస్తారా?' అన్నారు. 'అంటే ఊరుకోవాలా?' అంటున్న నందినితో, 'ఊరుకో. దీనివల్ల అనవసరంగా మన ఆరోగ్యం పాడవడం తప్ప వాళ్లెవరూ మారరు. పైగా బస్సులో తక్కినవాళ్లంతా ఎలా నవ్వుకున్నారో తెల్సా!' అన్నాడు ఒకింత కోపంగా. ఆఖరికి పదో తరగతి చదువుతున్న కొడుకు కూడా, 'ఎందుకమ్మా! అలా అరిచావు? కాసేపు నుంచుంటే సరిపోయేదానికి..' అనేశాడు.
she did a good job..no need to worry about those rascals..
ReplyDeleteyes.. am also agree with nandini.. there is no mistake in her argument..
ReplyDelete