ప్రకృతి భలే విచిత్రమైనది సుమా! ఓవైపు ఎర్రటి ఎండలతో పొగలు సెగలు కక్కేలా చేస్తుంది. మరోవైపు ఆ వేసవి తాపాన్నుంచి బయటపడడానికి వీలైన పదార్థాలనూ ఇస్తుంది. చల్లచల్లటి పుచ్చకాయలు, తాటి ముంజలు, కొబ్బరి బొండాలు, మామిడి కాయలు, చెరకు రసాలు, నిమ్మ రసాలు ఇచ్చింది. ఇవి దాహాన్ని తీరుస్తాయి. పైగా వీటిలో శరీరానికి ఉపయోగపడే పోషక పదార్థాలు ఎన్నో. విచిత్రం కాక మరేంటి! ఇవికాక మనం కనిపెట్టిన గొడుగులు, కళ్లజోళ్లు, టోపీలు వుండనే వున్నాయి. ఏ ఎండకా గొడుగు పట్టమని పెద్దలు ఏనాడో చెప్పిన మాటను ఫాలో అయిపోతే సరి. ఏవంటారు. మరి ఎండాకాలంలో మనకు అందుబాటులో వుండే పళ్లు, కాయలు, రసాల గురించి చెప్పుకుందామా.పుచ్చకాయ అద్భుతమైన ఆహారం. గ్రీష్మానికి సరైన విరుగుడు పుచ్చపండు. తన ఎర్రటి ఎరుపుతో పిల్లలనూ, పెద్దలనూ ఆకట్టుకుంటుంది. ఇందులో ఎటువంటి కొవ్వు, కొలెస్టరాల్ వుండదు. పుచ్చకాయ మొత్తం బరువులో 92 శాతం నీరుకాగా ఆరుశాతం షుగర్ వుంటుంది. పుచ్చరసం తాగితే కడుపులో చల్లగా హాయిగా వుంటుంది. వేసవిలో అత్యంత సాధారణంగా కనిపించేవి కొబ్బరి బొండాలు, తాటి ముంజలు, చెరుకు రసాలు. ఇవి కూడా దాహాన్ని తీర్చి ఎండవేడి నుండి సేద తీర్చేవే. సహజమైన ఈ పదార్థాలు నిజంగా ప్రకృతి మానవులకి ఇచ్చిన వరాలే. నల్లతాటి కాయలు లోపల మూడు మంచు గిన్నెలు, వాటిలోని తియ్యని నీళ్లు -వేసవిలో తోడి తింటుంటే సూపర్. ఈ రుచి, అనుభవమే వేరు. వేసవిలో ముంజలు చాలా మంచి చేస్తాయి. వాటిని రోజూ తింటే వేసవిని ఇట్టే తీసేస్తాయి. కానీ ఏం చేస్తాం. అక్కడక్కడా అమ్ముతున్నా పట్టణాల్లో అందరికీ ఇవి అందుబాటులో వుండవు. కొన్ని అద్భుతాలు కొందరికి లభ్యం కావు అని సరిపెట్టోకోవలసిందే.
ఇక సర్వత్రా లభించేవి లేత కొబ్బరి బొండాలు. అప్పటికప్పుడు చెట్టు నుండి దించిన బొండాం నీళ్లు నులివెచ్చగా, కాస్త తీయగా, కాస్త ఉప్పగా మొత్తానికి గొప్పగా వుంటాయి. ఆరోగ్యానికి హానిచేసే 'కూల్' డ్రింకులన్నిటికంటే అత్యంత శ్రేష్టమైనది కొబ్బరి బొండాం. ఒక జన్మించే మొక్కకు కావలసిన పోషక పదార్థాలన్నీ అందులో వుంటాయి. కాబట్టి మనకు అవి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ వేసవిలో కొబ్బరి బొండాల్ని వదలకండి. కాకపోతే కాస్తంత ఎక్కువ ఖరీదు కూడా! కాని బొండాలు జ్వరం వచ్చిన వాళ్ళకీ, వడదెబ్బ తగిలిన వాళ్ళకీ, డయేరియా, నీరసం వున్న వాళ్ళకి మాత్రమే కాదు మాములు వాళ్లు అవి తాగితే పైన చెప్పిన అవస్థలు రాకుండా తప్పించుకోవచ్చు! కొబ్బరి నీళ్ళు (లేత కొబ్బరి నీళ్లు) శరీరానికి చలువ చేయడమే కాక జీర్ణకోశ సంబంధ సమస్యలను తగ్గిస్తాయి. మూత్రనాళ సంబంధ సమస్యలని తీసివేస్తాయి. కొలెస్టరాల్‌ని నియంత్రిస్తాయి. కొబ్బరి నీళ్లు సహజమైన ద్రవం. దానితో తక్కువ చక్కెర పదార్థాలే కాకుండా తక్కువ పిండిపదార్థాలూ వుంటాయి. కొవ్వు కూడా వుండదు.
వేసవిలో ఎక్కడ బడితే అక్కడ చెరుకు రసం బళ్లు దర్శనమిస్తాయి. చెరుకుగడలను పిండి...రసాన్ని వడగట్టి, కాస్త అల్లం, నిమ్మకాయ జోడించి తాగితే మిట్టమధ్యాహ్నపు ఎండలో ఎన్ని గ్లాసుల రసమైనా సర్రున జుర్రెయ్యవచ్చు. చెరుకు రసం నీరసాన్ని తగ్గిస్తుంది, సేద తీరుస్తుంది. దానిలోని అధిక కార్బోహైడ్రేట్ల కారణంగా శక్తినిస్తుంది. సాధారణంగా రసం ద్వారా ఇబ్బంది కలగకపోవచ్చు కానీ, రసం తీసే పద్ధతులు, ఆ పరిసరాల వల్ల కొన్ని సమస్యలు రావచ్చు. రసం తీసేవాళ్లు... రసం తీసే యంత్రం శుభ్రంగా వుండక పోవచ్చు. గ్లాసులు, ఐసు కూడా! ఐసు వేసుకోకపోవడమే మంచిది. ఇక చెరుకు పిప్పి ఈగల్ని, బ్యాక్టీరియాని ఇట్టే ఆకర్షిస్తుంది. ఇవన్నీ దృష్టిలో వుంచుకుని చెరుకు రాసాన్ని సేవించాలి. అయితే అదే పనిగా అధికంగానూ, రోజూ చెరుకు రసాన్ని తాగడం అంత మంచిది కాదు. కానీ ఎండ వేడి నుండి సేద తీరాలంటే చెరుకు రసం ఉత్తమం.వేసవి తనతోపాటు మామిడి పండ్లను వెంట తెస్తుంది. మామిడి పండ్ల రసాన్ని అలా జుర్రుతుంటే అబ్బ! ఆ అనుభూతి తెలియని వారుండరంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంత మజా ఏ పండు తినేప్పుడూ రాదేమో! మామిడి పండ్లు వేడి చేస్తాయని కొందరు వాటిని తినడానికి భయపడుతుంటారు. కానీ యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉన్న ఈ పండ్లు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. విటమిన్లు, ఖనిజాలూ పుష్కలంగా ఉంటాయి. ఇవి మంచి పోషకాహారం. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఏ పండులోనూ లేనంతగా మామిడి పండులో 'ఇ' విటమిన్ ఉంటుంది. ఒక మామిడి పండులో 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఫైబర్ కొలెస్టరాల్‌ను తగ్గించడమే కాకుండా జీర్ణశక్తిని పెంచుతుంది.
ఆకుకూరలు, టమోటాలు, దోసకాయలు కూడా వేసవిలో తినవలసిన పదార్థాలు. చవగ్గా లభించే ఆకుకూరుల్లో నీరు, పీచుపదార్థమే ఎక్కువగా వుంటుంది. వాటిలో వుండే సహజ లవణాలు వేసవితాపం, దాహం తీరుస్తాయి. టమోటాలు తింటే ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలుగుతుంది. బయటకు వెళ్లబోయేముందు రెండు టమోటాలను తిని వెడితే ఎండను తట్టుకోవచ్చు. బాగా మగ్గిన టమోటాలను రసం తీసుకుని కొంచెం ఉప్పు, పంచదార, నిమ్మరసం కలుపుకొని తాగితే దాహం నుంచి ఉపశమనం కలుగుతంది. వేసవిలో కందిపప్పు కంటే పెసర పప్పు తింటే త్వరగా జీర్ణం అవుతుంది. పెరుగు ఎక్కువగా వాడితే మంచిది. అలాగే వేసవిలో నోటికి ఘాటుగా వుండేవి తినాలనిపిస్తుంది. పచ్చళ్లలో పెరుగును వాడితే నోటికీ రుచిగా వుంటుంది. వంటికీ ఉపయోగకరంగా వుంటుంది. ఈ ఎండల్లో నూనె ఎక్కువగా పీల్చే పదార్థాలను, టిఫెన్లును దూరంగా వుంచాలి. పూరీలు, దోసెలు, పునుగులు వంటివి నూనె కొంచెం ఎక్కువగా పీలుస్తాయి. అందుకే వాటిని తినకుండా వుండడమే బెటర్. ఇడ్లీలు, బ్రెడ్, నూనె లేకుండా చపాతీలు, పుల్కాలు వంటివి తీసుకోవచ్చు. నిమ్మ పులిహార, పెసర పొంగలి తీసుకోవచ్చు.ఎండల్లో జాగ్రత్తలు
ఎండాకాలమైనా ఉద్యోగాలూ, పనులూ, అవసరాలూ మనల్ని ఎండన పడేస్తాయి. కాబట్టి ఎలాగోలా, అది పుర్తయ్యే వరకూ ఎండ నుండి కాపాడుకోక తప్పని పరిస్థితి వస్తుంది. సాధారణంగా ఎండకి బాగా ప్రభావితమయ్యేది మన కళ్ళే. వేడికి చర్మం ఇబ్బంది పడితే కాంతికి కళ్లు కలవరపడతాయి. అందువల్ల కళ్ళని ప్రత్యేకంగా కాపాడుకోవడం ముఖ్యం. సూర్యకాంతిలోని అల్ట్రావైలెట్ కిరణాలు అటు చర్మాన్ని ఇటు సున్నితమైన రెటీనానీ దెబ్బతీస్తాయి. కాబట్టి ఆ కిరణాల నుండి వాటిని రక్షించుకోవడం తప్పనిసరి. కానీ ఎలా? చర్మానికైతే వస్త్రం తోనో, గొడుగు నీడలోనో, ప్రస్తుతం మార్కెట్లో విరివిగా లభించే అపార క్రీములు, లోషన్ల సంపదతోనో కాస్త రక్షణ పొందవచ్చు. మరి కళ్ళకి కళ్ళజోళ్ళే దిక్కు! కళ్ళద్దాలు (చలువ కళ్లద్దాలు- సన్‌గ్లాసెస్- కూలింగ్ గ్లాసెస్) కూడా ప్రస్తుతం విస్తారంగా కాస్త నాణ్యమైనవీ, నిజంగా కంటికి అవసరమైన రక్షణని కల్పించేవాటిని చాలా ముఖ్యం. ఎందుకంటే 'మంచి' కళ్లద్దాలు కాకపోతే రక్షణమాట అటుంచి కళ్లు దెబ్బతినే ప్రమాదమే ఎక్కువ.బవేసవిలో సూర్యరశ్మిలోని అల్ట్రా వయొలెట్ కిరణాలవల్ల చర్మం. కమిలిపోతుంది. దీన్ని 'టానింగ్' అంటారు. దీని నుంచి తప్పించుకునేందుకు. స్ట్రాబెర్రీ పళ్ళ గుజ్జు ఖీరాల ముద్ద చక్కగా పని చేస్తాయి.
*చర్మం కమిలిన చోట టొమాటోల పలుచని చక్రాలను తేలికగా రుద్దాలి. 20-25 నిముషాల తరువాత కడిగేయాలి.
* ఒక చెంచా బాదాముల పొడి, 2 చిన్న చెంచాలు పాలు, చిటకెడు పసుపు కలిపి లేపనం చేయాలి.* సబ్బుకు బదులుగా సున్నిపిండి వాడకం లాభదాయకం.
* ఒక చిన్న చెంచా సోయాబీన్స్ పొడి, పెరుగు కలిపి రాసుకుంటే. చక్కని బ్లీచ్ జరుగుతుంది.
* కీరాలు, టొమాటోల గుజ్జులో బాదాముల పొడి కలిపి, వారానికి కనీసం మూడుసార్లు ముఖానికి రాసుకోవాలి.
ఏంచేయాలి? ఏది వద్దు?
వేసవిలో సన్‌బాత్ తీసుకోకూడదు.
అవసరానికి మించి ఎండలో తిరగకూడదు. ఉదయం 10 గంటల నుంచి, సాయంకాలం నాలుగువరకూ సూర్యరశ్మిలోని అల్ట్రా వయొలెట్ కిరణాల శక్తి అత్యదికంగా ప్రభావితం చేస్తాయి.
బయటికి వెళ్లే ముందు 18-35 ఎస్ పెలఫ్ గల సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. ఏదోలే అనుకోకుండా బాగా రాసుకోవాలి.
చర్మాన్ని రక్షించేందుకు కాస్తంత లూజుగా వుండే కాటన్ బట్టలను ధరించాలి.
చర్మానికే కాదు, ఎండవల్ల కళ్లకూ హానికలుగుతుంది. కళ్ళను యువి కారణాల నుంచి రక్షించుకునేందుకు తగిన కళ్ళజోడు పెట్టుకోవాలి.
No comments:
Post a Comment