Tuesday, March 8, 2011

ఆల్ ఇంగ్లాండ్ క్రౌన్‌పై బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ దృష్టి!

కామన్వెల్త్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఈ ఏడాది ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌పై దృష్టి సారించింది. వరుస టైటిళ్లతో హ్యాట్రిక్ సృష్టించి, అభిమానులను ఆకట్టుకున్న ఈ హైదరాబాదీ చిన్నది.. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో మెరుగైన ఆటతీరుతో ప్రత్యర్థిని కట్టడి చేయాలనుకుంటోంది.

గత ఏడాది ఐదు బ్యాడ్మింటన్ టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్న సైనా నెహ్వాల్, గాయంతో బ్యాడ్మింటన్ కోర్టుకు దూరమైంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరిగే ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్‌‌లో విజేతగా నిలవడం ద్వారా ఈ టైటిల్ గెలుచుకున్న ప్రథమ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా సైనా రికార్డు సృష్టించాలనుకుంటోంది. ఈ విషయమై సైనా నెహ్వాల్ మాట్లాడుతూ.. ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌ను గెలవడమే తన లక్ష్యమని చెప్పింది. గత ఏడాది సెమీఫైనల్స్ వరకు పోరాడిన అనుభూతితో ఈసారి ఆల్ ఇంగ్లాండ్ టైటిల్‌ను సొంతం చేసుకోవడంపై దృష్టి సారించానని చెప్పింది. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నానని, ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్‌లో మెరుగ్గా రాణించేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తానని చెప్పింది.

ఇక పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో భారత ఆటగాడు పారుపల్లి కశ్యప్ జర్మనీకి చెందిన మార్క్ వీబ్లెర్‌తో బరిలోకి దిగనున్నాడు. డబుల్స్ విభాగంలో రూపేష్ కుమార్, సనావే థామస్‌లు మలేషియా జంట టెక్ ఛాయ్ గన్-బిన్ షెన్ టాన్ ‌లతో తలపడతారు. ఇక మిక్స్‌డ్ డబుల్స్‌లో జ్వాలా గుత్తా-అశ్విని పొన్నప్ప జోడీ తొలి రౌండ్లో మరియా హెల్స్‌బోల్-స్కెల్‌బెక్ ద్వయంతో పోటీకి సై అంటున్నారు.

No comments:

Post a Comment