రాల్తున్న మంచు ముత్యాల్ని
ఎగురుతున్న హరివిల్లులా
పక్షుల గుంపుల్ని
నిశ్శబ్దంగా కళ్లు మూసుకుని
దృశ్యాన్ని నాలో వీక్షిస్తున్నాను
అనుభవాలు అంతరాల్లో
దొంతరలుగా పేరుకుపోతున్నాయి
కొన్ని సమయాల్లో
దృశ్యాలుగా జాలువారుతున్నాయి
గాలిలో అలా మేఘాల కెరటాల్లో
గాలిపటాలు తుళ్లిపడుతున్నాయి
శ్వాసతో విచ్చుకుంటున్నాయి
మబ్బులతో ముగ్గులేస్తున్నాయి
ప్రకృతి నిశ్శబ్దాన్ని నాలో మౌనాన్ని
వెలిగించే ధ్యానం
నన్ను నింపుతుంది
తెల్లారే చందమామలా
వెలిగే సూర్యరూపాన్ని
కనుల అరల పొరల్లో
ముచ్చటగా దాచుకుంటాను
పొగమంచు వెన్నెల్లో
నెమ్మదిగా జారుతున్న
నునులేత సూర్యుణ్ణి
జేబులో వేసుకోవాలనిపిస్తుంది
మొక్కల్ని ప్రేమించే సూర్యుణ్ణి
అందాలు వెదజల్లే మొక్కల్ని
ఒకటి ఒకటిగా ఆస్వాదిస్తూ
సూర్యకిరణాలతో స్నానమాడాలనిపిస్తుంది.
No comments:
Post a Comment