Thursday, February 17, 2011

' ప్రియురాలి ప్రేమ పొందడానికి తనిష్క్‌ డైమండ్‌'

'మీ ప్రియురాలి ప్రేమ పొందడానికి తనిష్క్‌ డైమండ్‌'
'ప్లాటినం ఆభరణాలతో మీ ప్రేమ పదిలం'
విపణీ వీధిలో ఇలాంటి వలపు వాణిజ్య ప్రకటనలెన్నో. వాలంటైన్స్‌ డే వస్తోందంటే మొదట సంతోషించేది ప్రేమికులే కాదు! వ్యాపారులు కూడా!! తమ సరకును లాభసాటిగా ఎలా అమ్ముకోవాలో వారికి మాబాగా తెలుసు. మానవ ఉద్వేగాలతో ఎలా వ్యాపారం చేయాలో వారికి వెన్నతో పెట్టిన విద్య. అందుకోసం క్షణానికో కొత్త మార్గాన్ని అన్వేషిస్తారు. నిముషానికో సందర్భాన్ని ఆవిష్కరిస్తారు. బంధానికో రోజు, అనుబంధానికో తారీకు జోడిస్తారు. ప్రేమికుల రోజు కూడా అలాంటిదే.
గ్రీటింగ్‌ కార్డులు, రోజాపూలు, చాక్లెట్టులు, బొమ్మలు, ఆభరణాల పేర ప్రేమికుల జేబులకు చిల్లులు పెట్టేస్తారు. ఏ బజారుకెళ్లినా 'ప్రేమ మీకు, డబ్బు మాకు' అన్నట్టు రంగం సిద్ధం చేసేస్తారు. మరి వారిది 'వ్యాపార ప్రేమ' కదా. వందలవేల కోట్లలో లావాదేవీలు జరిగిపోతాయి. ఎన్నెన్ని ఆఫర్లు, ఎన్నెన్ని డిస్కౌంట్లు! ఆ ఆనందంలో, మైమరపులో పర్సు ఖాళీ అవ్వాల్సిందే. అన్ని బజార్లు ప్రేమికుల దగ్గరకే చేరుకుంటాయి.

వలపు వాణిజ్యంలో పత్రికలు, టీవీ చానళ్లు, రేడియాల పాత్ర తక్కువేం కాదు. ఏమేం బహూకరించి ప్రేమను ప్రకటించొచ్చో, పెంచుకోవచ్చో చెప్తాయి. లవేరియా లక్షణాలేంటో విపులీకరిస్తాయి. తియతియ్యటి ప్రేమ కబురులెన్నో చెప్పి ఆకట్టుకుంటాయి. ఇక షాపింగ్‌ మాళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు ప్రేమికుల కోసం ఎన్నెన్ని చేస్తాయి? మత్తెక్కించే మద్యం గ్లాసుల గలగలలు, మైమరపించే మ్యూజిక్కు... తళుకుబెళుకుల సెలబ్రెటీలతో చేయించే హంగామా అంతా ఇంతా కాదు. అంతా యువ కస్టమర్ల కోసమే సుమా!
హృదయాకారపు వస్తువులకు ఆరోజు చెప్పలేనంత గిరాకీ. ఉంగరాలు, బూరలు, కేకులు, పూలు, ఫొటో ఫ్రేములు, బ్యాగ్గులు, చాక్లెట్లు, ఆభరణాలు..ఏవైనా సరే గుండె గూటిని పోలివుంటే చాలు. క్షణాల్లో కొనేస్తారు. బహూకరించేస్తారు. ఇవేనా! అర్ధరాత్రి సర్‌ప్రైజ్‌ గిఫ్టులు, స్పెషల్‌ డిన్నర్లు... బిల్లు ఎంతైనా పర్లేదు!
ప్రేమ కోసం ఆ మాత్రం ఖర్చు చేయకపోతే ఎలా! షాజహాన్‌లా తాజమహల్‌ కట్టించలేకపోయినా ఈ చిరుబహుమతులైనా ఇవ్వకపోతే ఎలా! అన్న వాతావరణం సృష్టించేస్తారు.
మల్లెలాంటి నిష్కల్మష ప్రేమను ప్రియసఖీ సఖుల సముఖాన ఆవిష్కరించడానికి ఖరీదైన బహుమతే కావాలా!
ముహూర్తం పెట్టినట్టు ఆ రోజునే చెప్పాలా!

No comments:

Post a Comment