Thursday, February 17, 2011

ఘనంగా ప్రపంచ కప్‌ ప్రారంభోత్సవం

 



నలభై ఐదు రోజుల పాటు అభిమానులను ఆనందోత్సాహాల్లో నింపేందుకు క్రికెట్‌ కార్నవాల్‌గా అభివర్ణించతగ్గ ఐసిసి ప్రపంచకప్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. బంగ్లాదేశ్‌ రాజధాని నగరంలోని చారిత్రాత్మకమైన బంగబంధు స్టేడియం ప్రారంభోత్సవ వేడుకలకు వేదికగా నిలిచింది. ఈ మెగా పండుగను బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా ప్రారంభించారు. వేలాది మంది ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య ఈ పోటీలు ప్రారంభమయ్యాయని ఆమె ప్రకటించారు.
ఈ టోర్నమెంట్‌ను నిర్వహించేందుకు తమ దేశాన్ని ఎంపిక చేసినందుకు ఆమె అంతర్జాతీయ క్రికెట్‌ మండలికి కృతజ్ఞతలు తెలిపారు. బంగ్లాదేశ్‌ సంప్రదాయానికి అనుగుణంగా ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న 14 దేశాల జట్ల కెప్టెన్లు రిక్షాలో మైదానంలోకి రావడంతో ప్రారంభోత్సవ కార్యక్రమం ఆరంభమైంది. చివరగా బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ వచ్చినపుడు ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో స్వాగతం చెప్పారు. ధోనీకి కూడా వారు పెద్దఎత్తున హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ స్వాగతం పలికారు. 15 సంవత్సరాల తరువాత భారత ఉపఖండంలో ప్రపంచకప్‌ తిరిగివచ్చింది. బంగ్లాదేశ్‌లో ఈ మెగా టోర్నమెంట్‌ జరగడం ఇదే ప్రథమం. 1971లో స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన తరువాత ఇంతటి పెద్ద టోర్నమెంట్‌ బంగ్లాదేశ్‌లో జరగడం ఇదే ప్రథమం.

అందువల్లనే ఈ టోర్నమెంట్‌ను, ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బంగ్లాదేశ్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 3,500 మంది కళాకారులు నిర్వహించిన వివిధ రకాల ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రెండున్నర గంటలసేపు సాగిన ఈ ప్రదర్శనలో భారత గాయకుడు సోనూ నిగమ్‌, బంగ్లాదేశ్‌ గాయకురాలు రూనా లైలా, సబీనా యాస్మిన్‌, ముంతాజ్‌, కెనడా రాక్‌స్టార్‌ బ్రయాన్‌ ఆడమ్స్‌ నిర్వహించిన ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ ప్రారంభోత్సవంతో బంగ్లాదేశ్‌తోపాటు ఈ టోర్నీని నిర్వహిస్తున్న అన్ని దేశాల్లో క్రికెట్‌ కోలాహలం ప్రారంభమైంది. ముఖ్యంగా బంగ్లాదేశ్‌ మొత్తాన్ని క్రికెట్‌ ఫీవర్‌ ఆవహించింది. '' హే ప్రపంచమా, రండి, బంగ్లాదేశ్‌ గురించి తెలుసుకోండి'' అంటూ ఎబ్బార్‌ టిప్పు ఆలపించిన గీతం ప్రారంభోత్సవనికే హైలైట్‌గా నిలిచింది. ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్న మూడు దేశాల సంస్కృతి.సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా నిర్వహించిన ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కాల్చిన బాణసంచాతో ఢాకా నగరం వినీలాకాశం రంగులతో శోభాయమానంగ కనిపించింది.ఆరంభంలో మస్కట్‌ను రిక్షాలో తీసుకొచ్చిన సందర్భంగా ప్రేక్షకుల హర్షధ్వానాలు మిన్నుముట్టాయి.

అగ్రశ్రేణి రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బంగ్లాదేశ్‌ జాతీయ గీతం ఆలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. శంకర్‌-ఎహసాన్‌- లారు త్రయం క్రీడోత్సవాల ఇతివృత్తంతో ఆలపించిన గీతం అందరినీ ఆకట్టుకుంది.భారత ఉపఖండంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌కు ప్రారంభోత్సవ కార్యక్రమం అద్దంపట్టింది. కార్యక్రమాన్ని నిర్వహించిన తీరు, హాజరైన ప్రేక్షకులు ఈ టోర్నీ తప్పక విజయం సాధించగలదని భరోసా ఇచ్చాయి. రెండు రోజుల తరువాత అసలు టోర్నమెంట్‌ ప్రారంభం కానుంది. ఈ నెల 19న భారత్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరగనున్న ప్రారంభమ్యాచ్‌తో ఈ మెగా టోర్నమెంట్‌ ఆరంభమవుతుంది. తొలి మ్యాచ్‌ను నిర్వహించే అవకాశం తమకు కలగడం పట్ల బంగ్లాదేశ్‌లో క్రికెట్‌ అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తొలి మ్యాచ్‌లో తమ జట్టు గెలవగలదని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమ జట్టు కనీసం క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకోగలదని వారు భావిస్తున్నారు. వారి ఆశలు నెరవేరాలని కోరుకుందాం!

No comments:

Post a Comment