Friday, February 18, 2011

మనసు మన గుప్పిట్లో...

ఇంటిల్లిపాదికీ సర్వం సమకూర్చే మహిల తనపై తగిన శ్రద్ధ తీసుకోదు. అది శారీరక ఆరోగ్యాన్నే కాదు, మానసిక ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తుంది. కుటుంబంలోని అందరిలాగానే తిండీ, నిద్ర, మనశ్శాంతి స్త్రీలకూ ముఖ్యం. అంతేకాదు, సహజంగానే పురుషులకన్నా స్త్రీలకు ఆలోచనలు, మానసిక వ్యాకులత అధికం. దరిమిలా అనారోగ్యాలు దరికి చేరే అవకాశాలూ అధికం. వీటిన్నింటినీ ఎదుర్కోవలసిన ఆవశ్యకత వారికెంతో అవసరం. అదే ఆమెకూ, కుటుంబానికీ క్షేమకరం, సంతోషకరం.
* ఫిట్‌ అండ్‌ ఫైన్‌
సరైన పోషకాహారం, వ్యాయామం, విశ్రాంతి వీటిద్వారా ఒత్తిడి మటుమాయం. ఉల్లాసం మన సొంతం.
* అతి సర్వత్ర వర్జియేత్‌
అనవసర విషయాలను గురించి అతిగా ఆలోచించొద్దు. వాటివల్ల సమస్యలు తీరకపోగా, మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
* హద్దులు అనివార్యం
రెచ్చగొట్టి గొడవచేసి ఆనందంపొందే వారితో కబుర్లు అనవసరం. అందువల్ల ప్రయోజనం లేదు సరికదా, సమయం వృథా. పనీ చెడుతుంది.
* ఆపదలో అత్మస్థైర్యం
*కష్టాలు మనుషులకు కాకుంటే మానులకు వస్తాయా' అన్నారు పెద్దలు. అందుకే వచ్చిన కష్టాన్ని ఎలా అధిగమించాలనే ఆలోచన తప్ప ఇవన్నీ నాకే ఎందుకొచ్చాయనే దిగులు సగం నీరసాన్ని తీసుకొస్తుంది. అందుకే అలాంటి ఆలోచనలకు స్వస్తి పలకాల్సిందే!
్ప ఆప్తులకోసం
బంధాల ప్రాధాన్యత మనకు తెలిసిందే. తెలియనిదల్లా దానికి తగు సమయం కేటాయించలేకపోవడం. పనులన్నీ కాసేపు పక్కనపెట్టి అనుబంధాలకు తెరతీయండి. జీవితంలో ఆనందాన్ని పంచుకోవడానికి, కష్టాలను మరిచిపోవడానికి ఇంతకు మించిన దారే లేదు.
* సహకారం అవసరం.
అలజడికి గురైనపుడు మనలో మనమే సతమతమై ఒత్తిడికి గురికాకుండా అత్మీయులతో పంచుకోవడం, వారి సహకారాన్ని కోరడమూ తప్పుకాదు... అవసరం.
* ఆధారం కారాదు అవరోధం
ఉన్నత స్థానాలను అధిగమించాలనే తాపత్రయంలో క్షణం తీరికలేని ఉరుకులు, పరుగులు అసలుకే మోసం. తస్మాత్‌ జాగ్రత్త.
* ఆదాయం- అదుపు
టెన్షన్‌కు గురయ్యే కారణాలలో ఇదే ముఖ్య కారణం. సరైన ప్రణాళికతో వ్యవహరించడం చాలా ఒత్తిళ్లను తగ్గిస్తుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు వద్దు. అవసరం మేరకు ఖర్చులు తప్ప ఆడంబరాలకోసం కాదు.
* ఆసరా తెచ్చే ఆనందం
అవసరమైనవారికి చేతనైన సాయం ఇచ్చే సంతృప్తి, తద్వారా వచ్చే మనశ్శాంతి ఆరోగ్యాన్ని పదిలంగా వుంచుతుంది.
* ఆటపాటలు, అభిరుచులు
మెదడు పదునెక్కడానికి పజిల్స్‌ను మించిన మార్గం లేదు. అంతేకాదు, సృజనాత్మకతకు పదునుపెట్టే అభిరుచులు మనసును మరింత తెరిపిన పడేస్తాయి. వీటివల్ల అల్జీమర్స్‌ వంటి వ్యాధులూ దూరం. అనవసరమైన విషయాలమీదకు ఆలోచనలు పోవు.

No comments:

Post a Comment