Thursday, February 10, 2011

అందాల ఆటబొమ్మలా !

దీనికి ప్రధాన కారణం హీరోయిన్‌ పాత్ర అందాల ఆరబోతకే పరిమితం కావడమే. దీనికే నేడు గ్రామర్‌ రోల్స్‌ అని పేరు. ఈ మాటలో కొట్టుకుపోతున్న హీరోయిన్లలో మిగతా పాత్రలతో మెలిగే నటనలో ఎక్కువ శ్రద్ధ కనిపించదు. కేవలం పాటలకు, తాను ప్రత్యేకంగా కనిపించే సన్నివేశాలకు ఆమె గ్లామర్‌ని విరబూయిస్తుంది. అందుకే నేటి హీరోయిన్లను చూస్తే అనురాగం, అనుబంధాలు గుర్తుకురావడంలేదు. ఆశతో కూడిన ఆరాధనా భావమే కనిపిస్తోంది.సావిత్రి, జమున, అంజలీ దేవి, కృష్ణకుమారి, బి.సరోజా దేవి, కాంచన, వాణిశ్రీ, విజయనిర్మల, శారద మొదలైన వారు దశాబ్దాల తరబడి అగ్రహీరోయిన్లుగా ప్రేక్షకుల గుండెల్లో ఆరాధనా భావాన్ని కలిగి వున్నారు. ఇప్పటికీ అదే ఆరాధనా భావంతోనే వారి సినిమాలను తిలకించేవారు చాలా మంది వున్నారు. వీరు అడపాదడపా చిలిపి, శృంగార సన్నివేశాలు చేసినా సినిమా సినిమా మొత్తాన్ని లీడ్‌ చేయడం వల్ల ప్రేక్షకులు దానికి ప్రత్యేకతను ఇచ్చేవారు కాదు. వీరు హిట్‌ కాంబినేషన్‌గా కూడా పేరెన్నిక కావడంతో హీరోతో పాటు సమానమైన రెమ్యూనరేషన్లను, ప్రేక్షకుల అభిమానాన్ని పొందగలిగారు. నాటి తరంలో ఎన్టీఆర్‌ - కృష్ణకుమారి, ఏ.ఎన్‌.ఆర్‌ - సావిత్రి, ఏ.ఎన్‌.ఆర్‌ - వాణిశ్రీ, ఎన్టీఆర్‌ - బి.సరోజాదేవి, ఎన్టీఆర్‌ - అంజలీదేవి, కృష్ణ - విజయనిర్మల, శోభన్‌బాబు - కాంచన, శారద వంటి కాంబినేషన్స్‌ సూపర్‌ హిట్‌గా నిలవడంతో వీరిని చూస్తే అచ్చమైన దంపతులనే భావం ప్రేక్షకుల్లో కలిగేది. అందుకే కాంబినేషన్‌ ఎక్కువ నడచిన సమయంలో ఆమె హీరోతోపాటు సమానంగా, ఎక్కువ కూడా రెమ్యూనరేషన్‌ డిమాండ్‌ చేసేదన్న ఇండిస్టీ టాక్‌ కూడా ఆరోజుల్లో ఎక్కువగా వినిపించేది.
గిరిజ, రాజసులోచన, దేవిక, గీతాంజలి వంటి అనేకమంది నటీమణులు ఎక్కువగా హీరోయిన్‌ పాత్రల్లో రాణించక పోయినా ద్వితీయ శ్రేణి హీరోయిన్లుగా, కమెడియన్లకు జోడీలుగా మంచి పేరుతో పాటు ఎందరో నటీనటుల అభిమానాన్ని ప్రేక్షకుల అభిమానాన్ని పొంది దశాబ్దాల తరబడి వెండి తెరను రంజింపజేశారు. కామెడీ కాంబినేషన్లుగా రాజబాబు - రమాప్రభ, పద్మనాభం - గీతాంజలి, రేలంగి - గిరిజ, రమణారెడ్డి - సూర్యకాంతం ప్రేక్షకుల మదిలో ముద్రపడిపోయి వీరుకూడా హీరోయిన్లతో సమానంగా ఆదరణను, అభిమానాన్ని పొందగలిగారు.
హీరోయిన్‌ అంటే ఆహార్యం, అభినయం, నృత్యం వంటి అన్ని విభాగాల్లోనూ పరిణితి కలిగినదై వుండాలన్నది నేటి భావన. అందుకే నవరసాల్లో ఏ రసాన్నయినా ఇట్టే ఒలకబోసే పట్టు వారిలో వుండేది. అందువలనే సినిమా అంతా అన్ని పాత్రలతోనూ నడుస్తూ హీరోయిన్‌ రక్తికట్టించేది. ప్రేక్షకులు కూడా హీరోయిన్‌ కంటే ఆ పాత్రనే ఎక్కువగా సొంతం చేసుకునేవారు. అందుకే ఎన్టీఆర్‌ జోడీగా నటించిన సావిత్రి రక్తసంబంధంలో చెల్లిగా నటించినా ప్రేక్షకుడు మురిసిపోయాడు. మైమరచి ఆ పాత్రలకు పట్టాభిషేకం చేశాడు. ఎన్నో సినిమాల్లో అగ్రహీరోలు అగ్రహీరోయిన్లను (తమతో అనేక సినిమాల్లో నటించిన), సపోర్ట్‌ పాత్రలకు (జగ్గయ్య, కాంతారావు వంటివి) ఇచ్చి పెళ్లి చేసిన సందర్భాలు అనేకం.
అయినప్పటికీ ప్రేక్షకులు జీర్ణించుకోగలిగారు, అభినందించారు, ఆదరించారు. అంటే హీరోయిన్ల పాత్ర స్వభావాలకు, అభినయానికి అంత ప్రాధాన్యత వుండేది.పాతతరం హీరోయిన్లు నృత్యంలో కూడా ఆరితేరినవారే. ఎంతటి నృత్యాన్నైనా మాస్టర్ల సహాయంతో ఇట్టే ఓకే చేసేవారు. సెంటిమెంటుని పండించడంలో గ్లిజరిన్‌ అవసరంలేని కన్నీళ్లను అలవోకగా ఒలకబోసేవారంటే అతిశయోక్తి కాదు. పాత్రలపై పట్టు అంతగా వుండేది. రకరకాల పాత్రల్లో నటిస్తూ రకరకాల ఉద్వేగాలను పండించడంలో వీరిదే అగ్రతాంబూలం. ఏ పాత్రలో నటిస్తే ఆ పాత్రకు అతుక్కుపోవడమే కాదు ప్రేక్షకుల గుండెల్లో హత్తుకుపోయి నిలిచిపోయేవారు. అందుకే సీతమ్మతల్లి పాత్ర అంటే టక్కున అంజలీదేవి గుర్తుకొస్తుంది. మోతాదు మించని పడకింటి శృంగారాన్ని, ఆరుబయట అందాలను ప్రదర్శించి ప్రేక్షకులను రంజింపజేయటంలో ఆ తరం హీరోయిన్లు నిష్ణాతులనే చెప్పాలి. 'ఈరేయి తీయనిది.., చిటపట చినుకులు పడుతూ వుంటే..., పచ్చగడ్డి కోసేటి ...' వంటి అనేక పాటలు ఇప్పటికీ సున్నిత శృంగారంతో గిలిగింతలు పెడుతూనే వుంటాయి.
మధ్యతరం హీరోయిన్లుగా జయసుధ, జయప్రద, శ్రీదేవి, విజయశాంతి నుండి సౌందర్య వరకు అనేకమంది రంగుల చిత్రాల్లో దశబ్దాల తరబడి నటించి మెప్పించారు. వీరికాలంలో కూడా కృష్ణ - జయసుధ, జయప్రద, శోభన్‌బాబు - జయసుధ, బాలకృష్ణ - విజయశాంతి, చిరంజీవి - రాధ, రాధిక, కృష్ణ - శ్రీదేవి, వెంకటేష్‌ - సౌందర్య వంటి కాంబినేషన్లు ఎక్కువకాలం ప్రేక్షకులను రంజింపచేశాయి. ఈతరం హీరోయిన్లు కూడా సినిమా మొత్తం నడిపించడంలో తగిన పాత్రలను కలిగివుండేవారు. అభినయంలో నవరసాలను పండించేవారు. ప్రేక్షకులు వీరిని, పాతతరం నటీమణులను సొంతం చేసుకున్నంతగా కాకపోయినా కొంత ఆరాధనా భావాన్ని కలిగి వుండేవారు. ఈ తరం హీరోయిన్లను అందాల బొమ్మలుగా తీర్చిదిద్దడంలో దర్శకులు ఎక్కువ కష్టపడేవారని చెప్పాలి. అందుకే శృంగారాన్ని అభినయించడంలో ఈ తరం హీరోయిన్లు ఒకింత ఎక్కువనే చెప్పాలి. అయినప్పటికీ సినిమా తొలి సన్నివేశం నుండి చివరి సన్నివేశం వరకు కనిపించడం విశేషం.
ప్రస్తుత తరంలో నోటికి తిరగని పదాలతో పేర్లు కలిగిన హీరోయిన్లు పట్టుమని పది సినిమాలు కూడా నటించని పరిస్థితుల్లో దర్శనమిచ్చి, అదృశ్యమైపోతున్నారు. దానికి కారణం నేడు సినిమాల్లో హీరోయిన్‌ పాత్ర తీరుతెన్నులు సరిగా లేవు. కేవలం అందాలను ఆరబోసే బొమ్మగానే పరిగణిస్తున్నారు.
దీన్ని దృష్టిలో వుంచుకుని మాగ్జిమమ్‌ ఆరబోయగల నటిని హీరోయిన్‌గా ఎంపిక చేసుకోవడంలో నిర్మాతలు, దర్శకులు ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకే హీరో రేంజ్‌ రెమ్యూనరేషన్‌ను అందుకోలేకపోయినా 'దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న' చందాన కోటి వరకు కొంతమంది గుంజగలుగుతున్నారు. ఎంతగొప్ప అందమున్నా తొలి సినిమా బిగ్గెస్ట్‌ హిట్‌ కాకపోతే ఆమె అందం బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అందుకే హీరోయిన్‌ కావాలనుకునేవారు సక్సెస్‌ జోరుమీదున్న హీరోలను వెదుక్కుని ఎంట్రీ యిస్తున్నారు. ఒకవేళ చిన్న హీరోతో ఎంట్రీ దొరికినా ప్రొడక్షన్‌కి పేరుంటే ఒకే చెపుతున్నారు. అన్నీ కలిసొస్తే త్రిష, అనుష్క, ఇలియానాల మాదిరి కొద్ది సంవత్సరాలు లాగించగలుగుతారు. లేకపోతే ఎంత గించుకున్నా ఇండిస్టీలు మారినా ఛాన్స్‌లు మాత్రం శూన్యమనేది నగసత్యం. ఈ పరంపరలో అదృష్టం బాగున్నంత సేపు గోల్డెన్‌ లెగ్స్‌, ప్లాప్‌లు వరుసగా పలకరిస్తే ఐరెన్‌లెగ్గులుగా ముద్రపడిపోవడం, కెరీర్‌ ముగిసిపోవడం ఖాయం. అప్పుడు హీరోయిన్ల మన్న భావనను పక్కన పెట్టి మళ్లీ అదృష్టం కోసం 'ఐటమ్‌ సాంగ్‌' చేయడానికి సైతం 'సై' అనడం జరుగుతుంది. కొంతమంది హీరోయిన్లు పెద్ద హీరోలతో నటిస్తూనే మరోపక్క పార్ట్‌టైమ్‌ జాబ్‌లా ఐటమ్‌ సాంగ్స్‌ చేస్తున్నారు.
అందుకే అగ్రహీరోల సరసన వెలుగుతున్నప్పుడే చిన్న హీరోలతో కూడా అవకాశాలను, భారీ రెమ్యూనరేషన్‌లను అందుకోవాలి. ఒక వేళ చిన్న హీరో చిత్రం హిట్‌ అయితే మరిన్ని అవకాశాలు పెరుగుతాయి. ఫట్‌ అయితే అగ్రహీరో సినిమా ఎలాగూ కాపాడుతుంది. ఏదేమైనా నేటి హీరోయిన్లు కెరీర్‌ని చాలా జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకోకపోతే ఇట్టే కనుమరుగయ్యే ప్రమాదం వుందన్నది వారికి తెలిసిందే!
ఈ తరం హీరోయిన్లకు ఎక్కువగా సినిమాలో మిగతా పాత్రలలో ( అసలు వుంటే కదా!) సంబంధం వుండదు. అందుకే అనుబంధాల ఎమోషన్లు చేయనవసరం లేదు. కేవలం గ్లామర్‌ డాల్‌గా పాట వచ్చేముందు సన్నివేశంలో కనిపించి వెళ్లిపోతే సరిపోతుంది. నేటి కథల డిమాండ్‌ అంతే! నేడు పరిశ్రమ బికినీ అందాలు, లిప్‌లాక్‌ కిస్సుల ఫోబియాతో కొట్టుమిట్టాడుతోంది. అందుకే హీరోలు, నిర్మాతలు వాటికోసం ప్రతేక దృష్టి పెట్టడంతో డాన్స్‌ మాస్టర్లు, దర్శకులు సన్నివేశాలను రక్తికట్టించే పనిలో పడుతున్నారు. కెరీర్‌తోపాటు అందాన్ని సొమ్ము చేసుకోవడంలో హీరోయిన్లు అందాల ఆరబోతకు ఓకే చెపుతూ వారి డిమాండ్‌ని పెంచుకుంటున్నారు.
అందుకే ఒకనాడు ప్రేక్షకుడు హీరోయిన్‌ని వదిన, అమ్మ, చెల్లి, అక్క, ప్రియురాలు వంటి బంధాలతో సమాన దృష్టితో చూసి ఆరాధించేవాడు. అప్పుడు కేవలం హీరోయిన్‌ అంటే హీరోకే కాదు తనకి హీరోయిన్‌గా భావిస్తూ ఆరాధిస్తున్నాడు. అందుకే గుళ్లను సైతం కట్టడానికి వెనుకాడడం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఇలా వచ్చి అలా వెళ్లిపోయే మెరుపుతీగలాంటి హీరోయిన్‌ అందాల ఆరబోత ఎంతైనా అవసరమన్నది సినిమా తీసేవారి గట్టినమ్మకం. దానికోసం ఎంతైనా వెచ్చించి ప్రపంచంలో అందం ఎక్కడ వున్నా వెతికి పట్టుకుని ప్రేక్షకులకు కనువిందు చేయాలని ఆడిషన్స్‌ పెడుతూ ఉంటారు. ఆట బొమ్మలుగా కనిపించే నేటి హీరోయిన్లు ఎక్కువకాలం నిలబడలేకపోయినా 'అందం చూడవయా.. ఆనందించవయా..' అన్నట్లు ప్రేక్షకులను రంజింపచేసి సినిమా స్టార్స్‌గా ముద్రపడాలని ఆశపడడం సహజం, వాస్తవం. ఎందుకంటే సినిమా ఓ గ్లామర్‌ ప్రపంచం.

No comments:

Post a Comment