Thursday, February 24, 2011

అటు ఇటు మధ్యలో కమలం

ఇదీ తెరాస చీఫ్ కె.చంద్రశేఖర్ రావు లేటెస్ట్ గేమ్ ప్లాన్‌గా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పార్లమెంటు సమావేశాల ముందటి వరకూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని నయానా.. భయానా... బతిమాలైనా తెలంగాణా రాష్ట్రాన్ని ఇప్పించుకుంటామని ప్రకటిస్తూ వచ్చిన తెరాస చీఫ్... హఠాత్తుగా తన పంథాను మార్చుకున్నారు.
దీనికి కారణం లేకపోలేదంటున్నారు విశ్లేషకులు. నిజానికి మొన్నటి ఉపఎన్నికల ముందు వరకూ తెలంగాణా ప్రాంతంలో తెరాసను పట్టించుకున్న వారే లేరు. కానీ తెలంగాణా ఉద్యమం తర్వాత తెరాస సీన్ మారిపోయింది. మెల్లగా ఆ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగింది. దీంతో ఇతర పార్టీల నుంచి క్రమంగా తెరాసలోకి వలసలు భారీ సంఖ్యలోనే పెరిగాయి.

ఈ పరిస్థితుల్లో బలమైన కాంగ్రెస్ పార్టీతో అనుకూలంగా ఉన్నట్లయితే భవిష్యత్తులో అది తమ పార్టీకే ముప్పు అని తెరాస భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కనుక రాష్ట్రంలో బలహీనంగా ఉన్న భాజపా అయితే కేంద్రంలో తాము అనుకున్న పని సుళువుగా సాధించుకోవచ్చన్నది ఆ పార్టీ భావనగా ఉంది.

ఇంకోవైపు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కారాలుమిరియాలు నూరుతున్న వైఎస్.జగన్ హవా సీమాంధ్రలో సూపర్‌గా ఉన్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణాలో తెరాస, సీమాంధ్రలో వైఎస్ జగన్ పార్టీ ఢంకా బజాయించి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఆ పార్టీలో తొణికిసలాడుతోంది. ఎలాగూ జగన్ కాంగ్రెస్ వ్యతిరేకే కాబట్టి భవిష్యత్తులో జగన్‌తో కలిసి కేంద్రంలో చక్రం తిప్పాలన్న ధ్యేయంతో తెరాస ఉన్నట్లు తెలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయంగా ఉంది. చూద్దాం.. ఏం జరుగుతుందో...?

No comments:

Post a Comment