Thursday, February 3, 2011

మొగుడు వచ్చినా రాకపోయినా

మొగుడు వచ్చినా రాకపోయినా బెంగలేదు. తన వైపు ఆశగా చూసే వాళ్ళుండరు. పిల్లాడి ధ్యాసలో కోర్కెలు చచ్చిపోతాయి. ఈ ప్రాథమిక అంచనాలతో 'సరే' అంది. పిల్లాడి పాలకు ఒక ఆవు, బాలారిష్టాలకు రెండువేలు, భవిష్యనిధి బ్యాంకులో పదివేలు. రంగమ్మ ఇవేమీ వద్దంది. తన కష్టంతో పెంచుకుంటానని పౌరుషం చేసింది. కానీ పంతులు గారు ఒప్పించారు. రంగమ్మ ఇంట ఇక నలుసు రావడంతో పేటలో అందరికీ ఆనందం కలిగింది. రాముడు నామకరణ. పంతులుకు రెండేళ్ళకు టాన్స్‌ఫరైంది. ఒకరి అడ్రసుతో మరొకరికి పనిలేదు. తలపై బుట్ట, చంకలో రాముడు. తన రోజువారి పనులు సాగిస్తూనే ఉంది. మధ్యమధ్య బిడ్డ తల్లుల సలహాతో కుర్రాణ్ని ఆరోగ్యంగా పెంచుకుంటోంది.
కంటి పాపలా కాపాడడానికి బడి ముందు నాలుగు సీసాలతో బిళ్ళలు, బిస్కెట్లు, నేరేడుపళ్ళు, సపోటాలు, మొక్కజొన్న పొత్తులు అమ్ముకునేది. రంగమ్మకి కాణీ ఖర్చులేదు. పెరటిలోని వంకాయ, ములగకాడ, కరివేపాకుతో పచ్చడి. భోజనంలో అప్పుడప్పుడూ కోడిగుడ్డు.

కాళ్ళు బారాచాపుకుని గోనెపట్టామీద కూర్చుంది. పేడ, పుట్టమన్నుతో అలికిన నేల. వెదురు కర్రలతో దడికట్టి మన్ను పూసిన గోడల మధ్య సేద తీరుతుంది నడివయస్సు రంగమ్మ. చుక్కల సున్నంబొట్లు పెట్టిన అరుగులు, గోడలు రిసార్టులలోనూ, లలిత కళాతోరణంలోనూ ఆధునికుల కోసం ఏర్పాటు చేసిన విశ్రాంతి విడిదుల మల్లే! ఏషియన్‌ పెయింట్సును తలదన్నే విధంగా పసుపు పచ్చగా మెరిసే గోడలతో ఉన్న గుడిసె, 30 ఏళ్ళ కిందట ఆమె అయ్య రోడ్డు పక్కన వూరవతల రాటపాతి పాక వేశాడు. లేత ఆకులను తలపించే ఆ చిట్టి చేతులతో అయ్యకు పుల్లా పుడక అందిస్తూ నిర్మించుకున్న రంగమ్మ రాజమహల్‌ అది.

ఎవరన్నా వచ్చి బెదిరించినా బెదరలేదు. పనికి రాని ప్రభుత్వభూమి. చిన్నా చితక బతుకుల వాళ్ళు అక్కడే పాకలు వేసుకున్నారు. తన ధైర్యమే వారి ధైర్యం, వారి ధైర్యమే ఆమెకు కొండంత అండ. మురికి కాలువలను దారి మళ్ళించి, చెత్తా చెదారం తప్పించి నివాసయోగ్యంగా మార్చుకున్నారు అక్కడి జనం. తప్పించుకోలేని అధికారులు చిన్న చిన్న సౌకర్యాలు ఏర్పాటు చెయ్యక తప్పలేదు. అర్ధ కిలోమీటరు దూరంలోని పార్కు దగ్గర మరో రెండు కుళాయిలను మున్సిపాలిటీ ఏర్పాటు చేసింది. అక్కడక్కడా వీధిలైట్లు, కచ్చారోడ్డు. అది చిన్నపేటగా మారిపోయింది.

ఈ పేట నుండే ఉన్నవాళ్ళ, అధికారుల, మధ్యతరగతి కుటుంబాల ఇళ్ళల్లో పాచిపనులకు సరఫరా అవుతుంటారు.

రంగమ్మకు వెనకాముందు ఎవ్వరూ లేకపోయినా ఇళ్ళల్లో పాచిపనులకు ఎప్పుడూ పోలేదు. అయ్య పెరటిలో నాటిన కరివేపాకు, ములగ చెట్లు తనలానే ఏపుగా పెరిగాయి. అయ్యపోయిన తరువాత రంగమ్మకు అవే తోడూ నీడా!

తెల్లవారు జామునే లేచి చెట్టుకు నిచ్చెన ఆన్చి అందినంతమేర కరివేపాకు కోసుకునేది. నాలుగో, ఐదో మునగకాడలు తెంపుకునేది.

ప్రజలకు ఐదు పైసలో పదిపైసలో ఇచ్చి కొనుక్కునే అలవాటు రాలేదు. పిడికెడు బియ్యం వేసి నాలుగు రెమ్మలు తీసుకునేవారు. పది ఇళ్ళు తిరిగితే ఓ అర్ధకేజి బియ్యం- తనకు రోజు గడిచిపోయేది. అప్పుడప్పుడూ ఏ అమ్మన్నా టీ చుక్కను, ఆవకాయబద్దను ఇచ్చేది.

వీధి అరుగులపై ముఖం కడుక్కునే మగవారికి రంగమ్మ బాగా పరిచయం. బిళ్ళ గోచీ వేసి నేత చీరెలో 'కరివేపాకూ కరివేపాకూ' అంటూ వస్తుంటే తమ ఇంటి ఆడపడుచు వస్తున్నట్లే భావించేవారు. 'రంగమ్మ వచ్చిందే' అంటూ భార్యల్ని పిలిచేవారు.

రంగమ్మ జీవితంలో పెద్ద మలుపు లేమీ తిరగలేదు. తన ఇరవయ్యోయేట పెళ్లి అయింది. పెళ్లయిన నాలుగేళ్ళకే మొగుడు ఆ పేటలో ఎవరినో లేపుకుపోయాడు. తండ్రీ కాలం చేశాడు.

'గొడ్డొచ్చిన వేళా బిడొచ్చిన వేళా' అంటారు. అలానే రంగమ్మ జీవితంలోనూ జరిగింది. సుబ్రమణ్యం పంతులు ఇంటికి కరివేపాకు వాడుకగా వేస్తుంది. ఆయన రంగమ్మ 'చెవిలో రహస్యం' చెప్పాడు. అది తప్పుడుమాట కాదు కాబట్టి బతికిపోయాడు. ఆలోచించి చెపుతానంది.

పంతులు బంధువుల పిల్ల రహస్యంగా నీలాడబోతుంది. చదువు నిమిత్తం హాస్టల్లో ఉందని చెప్పుకుంటున్నారట! ఎనిమిదో నెల కడుపు. రంగమ్మ పిల్లలను కనని తల్లి అయింది. నరులకు ఈ రహస్యం తెలియకూడదు. అది షరతు!

మొగుడు వచ్చినా రాకపోయినా బెంగలేదు. తన వైపు ఆశగా చూసే వాళ్ళుండరు. పిల్లాడి ధ్యాసలో కోర్కెలు చచ్చిపోతాయి. ఈ ప్రాథమిక అంచనాలతో 'సరే' అంది. పిల్లాడి పాలకు ఒక ఆవు, బాలారిష్టాలకు రెండువేలు, భవిష్యనిధి బ్యాంకులో పదివేలు.

రంగమ్మ ఇవేమీ వద్దంది. తన కష్టంతో పెంచుకుంటానని పౌరుషం చేసింది. కానీ పంతులు గారు ఒప్పించారు. రంగమ్మ ఇంట ఇక నలుసు రావడంతో పేటలో అందరికీ ఆనందం కలిగింది. రాముడు నామకరణ. పంతులుకు రెండేళ్ళకు టాన్స్‌ఫరైంది. ఒకరి అడ్రసుతో మరొకరికి పనిలేదు. తలపై బుట్ట, చంకలో రాముడు. తన రోజువారి పనులు సాగిస్తూనే ఉంది. మధ్యమధ్య బిడ్డ తల్లుల సలహాతో కుర్రాణ్ని ఆరోగ్యంగా పెంచుకుంటోంది.

కంటి పాపలా కాపాడడానికి బడి ముందు నాలుగు సీసాలతో బిళ్ళలు, బిస్కెట్లు, నేరేడుపళ్ళు, సపోటాలు, మొక్కజొన్న పొత్తులు అమ్ముకునేది. రంగమ్మకి కాణీ ఖర్చులేదు. పెరటిలోని వంకాయ, ములగకాడ, కరివేపాకుతో పచ్చడి. భోజనంలో అప్పుడప్పుడూ కోడిగుడ్డు.

ఏ తండ్రికీ, తల్లికీ పుట్టిన బిడ్డో, నాజూకుగా పెంచుకుంది. వాడికి ఐదేళ్లు చదువు సాగి ఆగిపోయింది. కిరాణా షాపు, సైకిలు షాపు ఏదో ఒకటి చెయ్యడం మానడం. అమ్మకు పదో పరకో చేతిలో పెట్టేవాడు. అది దాచి గుడ్డలు కొనేది.పిడికెడు పిడికెడు బియ్యంతో రోజులు బాగానే నడిచాయి. బియ్యం స్థానంలో పైసలు రావడంతో గడ్డుకాలం వచ్చింది.కొడుకు చేతికి అందివచ్చాడు. తనకి ఏ లోటూలేదు కానీ, ఓరోజు పశ్చిమాకాశాన పిడుగులా ఎవరినో తీసుకువచ్చాడు.

'మా అమ్మ రంగమ్మండి!' పరిచయం చేశాడు. ''వీళ్ళు బొంబాయి నుంచి వచ్చారమ్మా. మన టౌనులో పెద్దషాపు పెడుతున్నారు. వూళ్ళో అన్ని షాపులూ కలిపితే ఎంత ఉంటుందో వీళ్ళు పెట్టేది అంత పెద్దది''!

''నాతో పనేమిటి''?

''వాళ్ళ షాపులో కాయకూరలు, ఆకుకూరలు, కూడా అమ్ముతారు''! రాముడు సంతోషంతో ఆశ్చర్యంగా చెప్పాడు.

''వాళ్ళకి మన కరివేపాకు చెట్టు కావాలంట''!

''అంత పెద్దచెట్టు వాళ్ళకెందుకురా ! కావాలంటే రోజూ వచ్చి కోసుకునివెళ్ళమను'' రంగమ్మ బదులిచ్చింది.

''మనచెట్టు లాంటివి వందకావాలంటమ్మా మార్కెట్టులో వాకబు చేస్తుంటే తీసుకొచ్చాను.''

ఆమె ఆశ్చర్యానికి అంతులేదు. నోరెళ్ళబెట్టింది.

''సంవత్సరం ఆదాయం మనకు ఒక్కసారే''! రంగమ్మ మనసులో ఆశ పుట్టింది - ఏవేవో లెక్కలు కట్టింది మనసు. పైగా కొడుకు అంత పెద్ద షాపులో ఉంటే ఆడి అందానికి 'ఓనరు' లా ఉండడూ!

వచ్చిన వాళ్ళు ఏవోవో కాగితాలు రాసుకున్నారు. సంవత్సరం ఒప్పందం. తరువాత రేటు పెంచి తిరగ రాసుకుంటారు. రాముడు వచ్చీరాని లెక్కలతో నెలకు మూడొందలన్నాడు. రంగమ్మ కసురుకుంది. ఏడాదికి నాలుగైదు వేలన్నా కావాలని అంది. వాళ్ళు ఆమెతో 'ఊ' అనిపించారు.

రెండురోజులు ఏదో వెలితనిపించింది. ఊహ తెలిసినప్పటి నుండీ ఉన్న దినచర్య మారిపోయింది.

ఆ రాత్రి ఏదోకల.

చెట్టు చుట్టూరా గజ్జల మోత.

కోపంతో చెట్టు ఊగుతున్న భ్రమ. అయ్య కలలో దీనంగా చూసిన చూపులు. తుల్లి పడి లేచింది. మనసు అశాంతిగా మారింది. అయినా నీతి తప్పకూడదు. నాలుగు ములగకాడలు, రెండు వంకాయలు, ఒక అనపకాయ పట్టుకుని ఎక్కడికి పోతుంది?

క్రమంగా పాదులు పాడయ్యే పరిస్థితి దాపురించింది. కరివేపాకు చెట్టు దగ్గరకు వెళ్ళింది. మాను చేతులతో తాకింది, దుఃఖం పొర్లివచ్చింది. కొంగుతో కన్నీరు తుడుచుకుంది. పాదుల దగ్గర చూసింది. రెండు రోజులుగా శుభ్రం చెయ్యడంలేదు. కొబ్బరి ఈనెల చీపురు తీసుకొని శుభ్రం చేసి నిట్టూర్పు విడిచింది.

ఏమిటో!!

తన జీవితకాంలో ఇప్పటి వరకూ అనుభవించని నిస్సత్తువ. నీరసం ఎప్పుడైనా నలతగా ఉంటే ఏ అమ్మన్నా టీ ఇచ్చేది. రంగమ్మ కూడా ఏ ఇల్లాలన్నా నీరసంగా కనబడితే వాళ్ళ చేతుల్లో తడిగుడ్డలు స్వతంత్రంగా తీసుకుని పిండి ఆరేసేది. ఏ ఇంటి బావి దగ్గరన్నా అంట్లు వుండిపోతే సహాయపడడం కోసం ఆలోచించేది కాదు. ఇప్పుడు తనకు తానే పరాయిదిగా మారిపోయింది!

''ఒరే రాముడూ... మనం తప్పు పని చేసినట్లు ఉన్నాంరా!''

''ఏటే...''!

'చెట్టు ఇచ్చేయడం !''

రంగమ్మ డబ్బు మనిషికాదు. గతి తప్పిన తల్లి బిడ్డను ఇస్తే, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తన బాధ్యతను నిర్వహించిన విశాల హృదయం కలదే కదా!

''తెల్లారు గట్టేలేచి ఆ నాలుగు వీధులు తిరగకపోతే కానీ కాళ్ళు ఆడటం లేదురా.. బెంగగా ఉందిరా!''

''నాలుగు రోజులుపోతే అదే అలవాటవుతుంది. కూరలు పట్టుకెళ్ళు!''

రంగమ్మకు కోపం - దుఖ్ణం రెండూ వస్తున్నాయి!.

''మా అయ్య పోయిన రెండో నాడే బుట్ట పట్టుకుపోయాను. మీ బాబు నన్ను ఒగ్గేసి పోతే బెంగపడలేదురా!''....

''ఆ డబ్బు వాళ్ళ మొహం మీద కొట్టి, చెట్టు ఇవ్వనన్నాని చెప్పు'' కచ్చితంగానే చెప్పుతూ ఏడుపు లంకించుకుంది. తన తప్పు తనకు తెలిసింది. దాన్ని సరిదిద్దు కోవాలి. అవసరమైతే తగాదా అన్నా పడాలనే నిశ్చయానికి వచ్చింది.

''వాళ్ళు ఒప్పుకోరేమోనే!''

''నువ్వెళ్ళరా! లేకపోతే నేనెళతాను''.

''ఇందా నీ డబ్బు - నేను చెట్టు వదులుకోను అదే నా జీవితం'' కుండ బద్దలకొట్టినట్టు రంగమ్మ చెప్పింది.

''వేలిముద్ర వేసేటప్పుడు ఉండాలి జ్ఞానం. ఇక్కడ అల్లరి చేస్తే పోలీసులను పిలుస్తాను'' స్వరం పెంచాడు. రంగమ్మకు అరికాలు మండింది.

''నేను మంచిదాన్ని కాదు. నా కొడుకును అమాయకుణ్ని చేసి వప్పించావు. ఏమైనా సరే నేను చెట్టు దగ్గరికి ఎవ్వరినీ రానియ్యను. నా కాగితాలు ఇచ్చేరు''!

''నేను మంచిగా చెప్పుతున్నాను. నా బతుకు పోతే ఊరుకుంటననుకుంటున్నావా! ఈ వ్యాపారం ఎలా చేస్తావో అదీ చూస్తాను!''

రంగమ్మ ఆ షాపింగ్‌మాలుకు అడ్డం కూర్చుంది. జనం పోగయ్యారు. నిన్న కాక మొన్ననే తెరిచిన దుకాణమైంది. మేనేజరుకు చెమటలు పట్టాయి. అల్లరవుతుందని అర్థమైంది. రంగమ్మకు అన్యాయం జరిగి ఉంటుందని అక్కడికి చేరిన వారికి అర్థమైయింది.

పోలీసులు వచ్చి రంగమ్మనూ, మేనేజరునూ స్టేషనుకు తీసుకుపోయారు.

స్టేషనులో చిన్నప్పటి నుంచీ తనకూ, ఆ చెట్టుకూ ఉన్న అనుబంధం చెప్పింది. ఆ వృత్తి మానుకోలేనని మొరాయించింది. నిలువెత్తు బంగారం ఇచ్చినా కుదరదంది. ఆ పేటలో జనానికి తెలిసి పోయింది. ఒక్కొక్కరుగా స్టేషనుకు రావడం ప్రారంభమైంది ఎస్‌.ఐకి కంగారు పుట్టింది. ఏ కేసు పెట్టాలో అర్థం కాలేదు. రాజీ చేసుకొమ్మని మేనేజరుకు చెప్పి తప్పించుకున్నాడు.

అక్కడినుంచి జనాన్ని తీసుకుని షాపింగ్‌మాలు దగ్గరకు చేరింది. వేరే దారి లేని మేనేజరు రంగమ్మ దారికి వచ్చి కాగితాలు ఇచ్చేశాడు. అక్కడే చించి వాడి మొహం మీద కొట్టి గర్వంగా నడిచిపోయింది కరివేపాకు రంగమ్మ.

మరుసటి రోజునుండి రంగమ్మ కరివేపాకు అందరి ఇళ్ళలోనూ యథావిధిగా దర్శమిచ్చింది.

చెట్టు, పుట్టలు, గట్లు తినే ఆహారం, ఒక ప్రాంతం ఆచార వ్యవహారల మీద, ప్రాచీన సాంప్రదాయాల మీద దాడి కొనసాగిస్తే.. కరివేపాకు రంగమ్మలు ఎలా ఊరుకుంటారు? ఈ వేళ కూరలో కరివేపాకులా తీసేస్తే? రేపు? ఆ మర్నాడు ఏదో ఒక రోజున మన బతుకుల దాకా ఈ పగుళ్ళు రావా! చూస్తూ ఊరుకుంటామా?

1 comment:

  1. Very nice... I wish this kind of revolutions come all around soon..

    Regards

    Ram

    ReplyDelete