Thursday, February 3, 2011

''నువ్వు పెంచేది ఏంది మామా?

'నీకు తెలియదు. నువ్వు వూరుకోరా! ఇయ్యాల మనం ఇస్తే రేపు ఇంకొకర్ని కూడా వీళ్లు అట్నే అడుగుతారు. ఉన్నవాళ్లు వుంటారూ, లేనివాళ్లూ వుంటారూ! రేపు వాళ్లు మనల్ని తిట్టుకుంటారు. మనం పెంచామని! అట్ట ఇయ్యకూడదు''
''నువ్వు పెంచేది ఏంది మామా? నెల రోజుల్నుంచీ నూట యాబై తీసుకుంటుంటే!''
''శుభకార్యం జరిగిన ఇంట్లో అలగా గుంపుతో తగాదా ఎందుకూ? నూటఇరవై లెక్కన తీసకపోండే! రేత్రి మిగిలినయి ఒక్కొక్కరూ మూడు నాలుగు బకెట్లు తీసకపోయారు మీరు. మనిషిని బట్టి పోవాలి!'' అంది రామనరసయ్య భార్య.

''నువ్వేందే మళ్లీ ఇరవై రూపాయలు పెంచావూ?'' భార్యమీద కయ్యిమన్నాడు.

రామనరసయ్య కొడుకు పెళ్లి రాత్రి చాలా ఘనంగా జరిగింది.

ఊరంతా బంతి పెట్టారు.

ఆయన కొడుకు ఎంసిఎ చదివాడు. బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. మంచి ఉద్యోగం అని చెప్పి ఎక్కువ కట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నాడు.

పొద్దున్నే ఎరుకలి రత్తమ్మ, అంజమ్మ, ఎంకమ్మ, సుబ్బమ్మ రాత్రి చేసిన వంటపాత్రలు కడగడం మొదలుపెట్టారు. వాళ్లను ఊళ్లోవాళ్లు రత్తీ, అంజీ, ఎంకీ, సుబ్బీ అని పిలుస్తారు. వాళ్లు ఎలాంటి నిరసన లేకుండా మామూలుగానే ఆ పిలుపులకు స్పందిస్తారు.

పెద్దపెద్ద డేగిశాలు, కాగులూ, గిన్నెలూ, బకెట్లూ, గరిటెలూ ఒకటేమిటి, ఒక ట్రాక్టర్‌ లోడు కంటే ఎక్కువే వున్నాయి.

నడివీధిలోనే వాళ్లు ఆ వంటపాత్రలను శుభ్రం చేస్తున్నారు.

''సరిగా తోమండేరు. ఎక్కడా ఎంగిలీ, మసీ ఉండకూడదని సామానోడు చెప్పాడు. మళ్లీ వాడితో మాట రాకూడదు'' రామనరసయ్య అన్నాడు.

''నువ్వు అట్ట కూకో సామీ! మాకు కొత్తా? ఏమీ వుండవులే!'' అంది రత్తమ్మ.

ఏమైనా దొరికితే తినాలని చాలా కుక్కలు అక్కడే కాచుకుని సిద్ధంగా వున్నాయి. రామనరసయ్య కూడా సిద్ధంగానే వున్నాడు దుడ్డు కర్ర తీసుకుని, వాటిని అక్కడికి రానీయకుండా తరుముతూ. ఆయన తరిమిన తర్వాత కొంతదూరం పోయినట్లే పోయి, మళ్లీ ఆయన వెంటే వెనక్కి తిరిగి వస్తున్నాయి. ఎంగిలి నీళ్లయినా దొరుకుతాయని వాటి ఆశ వాటిది.

వాళ్ల పనిని ఆజమాయిషీ చేస్తూ, కుక్కల్ని తరుముతూ ఆయనకూడా నడివీధిలో కుర్చీమీద ఆసీనుడయ్యాడు.

''ఏరా భోజనాలు ఎట్టా వున్నాయి? ఊళ్లో ఏమనుకుంటున్నారు?'' అటుగా వెళ్తున్న ఒకతన్ని పిలిచి అడిగాడు రామనరసయ్య.

''బెమ్మాండంగా వున్నాయి పెదనాన్నా భోజనాలు. ఇంతమాత్రం పెళ్లి మన వూళ్లో ఎవరూ చేయలేదనుకో. అబ్బో... ఎన్ని రకాలు... ఐసుక్రీములు ఒక్కోడయితే రెండు మూడుకూడా తిన్నాడు''.

''తింటే తిన్నారు కానీయిరా! ఏం లోటు లేకుండా అంతా బాగా జరిగింది. అది చాలు. కూరలు కూడా అన్నీ కుదిరినట్టేగా?''

''కూరలకేం? అదిరిపోయేట్టు చేశారు పెదనాన్నా! అన్ని కూరల్లోనూ జీడిపప్పే! బొగు రుచిగా వున్నాయిలే కూరలు కూడా. భోజనాలు ఫస్టుక్లాసుగా వున్నాయి''.

''ఒకరి కంటే మిగులుగా వుండాలి తప్ప వేటి దగ్గరా తగ్గొద్దని మా వోడు చెప్పాడు. బాగాలేవు, బాగా పెట్టలేదు.. అనే మాట రానీయకూడదన్నాడు. ఎంత ఖర్చయినా ఎనకాడొద్దన్నాడు. అన్నీ బాగున్నట్టే కదా!''

''తిరుగులేదు పెదనాన్నా! వంక పెట్టే పనేలేదు. అన్నీ ఏమున్నాయిలే!'' అంటూ అతను అక్కడే ఉన్న మరో కుర్చీమీద సెటిలయ్యాడు.

ఇంటినిండా బంధువులున్నారు. కొందరు ప్రయాణానికి సిద్ధమౌతున్నారు. ఆడవాళ్లు టిఫిన్‌ తయారీ ఏర్పాట్లలో నిమగమయ్యారు.

రామనరసయ్య చుట్ట ముట్టించుకుని, ఒక కుర్చీమీద కూర్చుని, మరో కుర్చీలో కాళ్లు బారజాపుకుని వచ్చేపోయే వాళ్లతో మాటలు మొదలుపెట్టాడు.

''ఏరా నరసయ్యా... పంచే చొక్కా బెమ్మాండంగా ఉన్నాయిరా! పెళ్లికొడుకు మాదిరిగా వున్నావు'' చెంబు తీసుకుని పోతున్న ఒక వయసు మళ్లినాయన రామనరసయ్యను పలకరించాడు.

''బెమ్మాండంగా వుండక... నాకేం మామా? ఎవరన్నా పిల్లనిస్తారేమో చూడు, మళ్లీ పెళ్లి చేసుకుంటా!''

''ఏయ్యో... ఎక్కడి పనులు అక్కడే వున్నాయి. తీరిగ్గా కూర్చుని మీటింగ్‌ పెట్టావు, వెళ్లి టెంటువాళ్లను పిలుచుకురా. వచ్చి టెంట్లు ఊడదీస్తారు. అడ్డంగా వున్నాయి, ఎందుకింకా?'' అంటూ ఆయన భార్య లక్ష్మి ఇంట్లో నుండి వచ్చింది.

''కుర్రాడు మళ్లీ పెళ్లి చేసుకుంటాడంటమ్మారు! పిల్లని చూడమంటున్నాడు''

''చేసుకుంటాడు, ఎందుకు చేసుకోడూ? మనవడూ, మనవరాళ్లూ పెద్దోళ్లు అవుతుంటే ఇంకా ఆయనకు ఎకసికాలు తగ్గలా!''

''కొడుకు సంపాయిచ్చి పడేత్తన్నాడు. వీడి పని కుశాలుగా వుంది'' అంటూ నవ్వుతూ వెళ్లిపోయాడు ఆయన.

రామనరసయ్యకు ఒక కూతురూ, కొడుకూ! కూతురికి ఎనిమిదేళ్ల క్రితమే పెళ్లి చేశాడు. ఆమెకి కూడా ఒక కూతురు, కొడుకూ.

రామనరసయ్య ఆస్తి పరంగా పెద్ద ఉన్నవాడేంకాదు. లేమిడి కుటుంబమే! అయితే అప్పో సప్పో చేసి కొడుకును చదివించుకున్నాడు.

కొడుకు ఉద్యోగం సంపాదించుకుని కంపెనీ తరపున రెండుసార్లు విదేశాలకు వెళ్లి కొంత డబ్బు కూడబెట్టుకున్నాడు.

''అమ్మా.. మరే అమ్మాయి ఏడుత్తందే! తాత నిన్ను పిలచక రమ్మన్నాడు'' అంటూ ఐదేళ్ల పిల్లవాడు గిన్నెలు కడుగుతున్న అంజమ్మ దగ్గరికి వచ్చాడు.

''నువ్వు పోయిరామ్మె! పోయి సంటిదానికి పాలిచ్చిరా!'' అంది అంజమ్మని వాళ్లత్త ఎంకమ్మ.

అంజమ్మ బాలింత. రెండు నెలల పసికందు. ఇంటిదగ్గర ఉంది. ఆమెకి వళ్లంతా పచ్చిపుండు మాదిరిగా వుంది. అయినా పని పోగొట్టుకోవడం ఇష్టంలేక, నాలుగు రూపాయలు వస్తాయిలే అనే ఆశతో వచ్చింది.

''పాలిచ్చి ఇప్పుడే వస్తా'' మిగతా వాళ్లకు చెప్పి, వచ్చిన పిల్లాడి చేయి పట్టుకుని తీసుకుపోయింది అంజమ్మ.

ఎరుకల వాల్ల గుడిసెలు అక్కడికి దగ్గరే. నాలుగిళ్లూ, నీళ్లులేని వాగు దాటితే వాళ్ల గుడిసెలే.

వంటసామాన్లు మొత్తం కడగడం మధ్యాహ్నానికి పూర్తయింది. మధ్యమధ్యలో ఇంట్లో వాళ్లు చెప్పే పనులు చేస్తుంటే.

''ముందు అన్నాలు తినండే! నడిజాము అయింది'' రామనరసయ్య భార్య లక్ష్మి చెప్పింది వాళ్లకు.

పని చేసి, ఆకలిగా వుండడంతో ఎప్పుడా అని ఎదురుచూస్తున్న వీళ్లు తిండికి కూర్చున్నారు.

ఇప్పుడు వండిన అన్నమూ, పాడవకుండా వున్న రాత్రి మిగిలిపోయిన కూరలూ వీళ్లకు పెట్టారు. తిన్న తర్వాత లేచి చీపుర్లు తీసుకున్నారు. రాత్రి వీధిలోనే భోజనాలు ఏర్పాటు చేశారు. వీధినిండా ప్లాస్టిక్‌ గ్లాసులూ, ఎంగిలి విస్తర్లూ. చీదర చీదరగా వుంది. అంతా వాటిని శుభ్రం చేయడానికి కదిలారు.

''ఇద్దరు ఇటురాండే! ఇంట్లో చాలా పని వుంది'' లక్ష్మి ఇద్దర్ని ఇంట్లోకి తీసుకుపోయి బండెడు అంట్లు వేసింది. సాయంత్రానికి ఎటోళ్లు అటు వెళ్లిపోయారు. తుఫాను వెలిసినట్లయింది.

ఎరుకల వాళ్ల పని కూడా అయిపోయింది.

''డబ్బులియ్యి మామా... ఎల్తామూ!'' అడిగింది వాళ్లకు మేస్త్రీగా వుండే రత్తమ్మ.

''ఇప్పుడేం డబ్బులే రత్తీ? రేపొచ్చి తీసకపో!''

''కాదుమామా.. వారాలోడికి నిన్ననే కట్టాల్సిన డబ్బులు. ఒకరోజు ఆలిస్సెమయితే వాడు ఊరుకోడు. ఇంటిమీదకొచ్చి జాతర చేస్తాడు''

''మొత్తం ఎంతమందే?''

''మొదటిరోజు ఇద్దరూ, మొన్న ఇద్దరూ, నిన్న పదకొండు మందిమీ, ఇయ్యాల నలుగురిమీ, మొత్తం పంతొమ్మిది మంది మామా!''

''ఏమే?'' అని పక్కనే వున్న భార్యవైపు చూశాడు.

''అంతేలే'' అందామె.

''కూలీ ఎంతే?'' అడిగాడు వాళ్లని.

''రోజుకు మడిసికి నూటయాబై రూపాయలు మామా!''

''ఏందీ... నూటయాబై రూపాయలే?'' ఆశ్చర్యపోతూ నోరు తెరిచాడు.

''ఎక్కడైనా అంతే తీసుకుంటున్నాం మామా!''

'ఏంది? డబ్బులా, చిల్ల పెంకులా?''

''మీరొక్కరే కాదుగా మామా! పెళ్లిళ్లు అయినా, పేరంటాళ్లు అయినా, దినాలు అయినా, ఏబంతైనా విస్తరాకులు ఎత్తేసినోళ్లకి నూటయాబయ్యే కూలి!''

''పని చేసేవాళ్లు, మీరొక్కరే కాకుండా ఇంటిల్లిపాదీ వచ్చి మూడు పూటలా మూడు బొచ్చెలు తింటారు. ఇంకా ఇంటికి తీసకపోతారు. తిండి పెట్టి రోజుకు అంత కూలీ ఇచ్చేది ఎక్కడే? ఎక్కడన్నా వుందీ?''

''ఎన్ని బంతులకి పోవడంలా మేము? మా పనే అది. ఎవుర్నైనా కనుక్కునే ఇయ్యి మామా?''

''ఛ నోర్ముయ్యవే! అడిగేదానికయినా హద్దు వుండాల్సిన పని లేదంటే? కలుపుకు పోతే ఎంత ఇస్తన్నారే కూలీ? అరవై రూపాయలు! అంతకంటే ఎక్కువ ఇయ్యమంటావేంది, పైగా తిండిపెట్టి!''

''కలుపుకీ, దీనికీ సంబంధం లేదులే మామా! కలుపుకి ఎండబడి పోతే మళ్లీ పొద్దు కొండల్లో పడేతలికి ఇంటికి వస్తారు. మేం అట్ట కాదుగా! ఏకువ జామునుంచీ అద్దరేత్తిరి దాకా చేస్తాం. రేత్రి బంతి మన ముందోళ్లు, ఎనకోళ్లు తినేసరికి ఒంటి గంట అయింది. కలుపువాళ్లతో వంతు పెడితే ఎట్ట?''

''అయితే ఇంకొక పది రూపాయలు తీసుకోండి. అంతే గానీ, నోరు పట్టకుండా అడిగితే ఏమనీ?''

''అదేంది మామా అట్టంటావూ? అందరి దగ్గరా అంతే తీసుకోవడం! నీ దగ్గర కొత్తగా ఏమన్నా తీసుకుంటున్నామా?''

''నేను మాత్రం వందకంటే ఎక్కువ ఇయ్యనే!''

''రెండేళ్ల నుండీ నూటయిరవై తీసుకుంటున్నాం. నువ్వు ఇయ్యాల వంద ఇస్తానంటే ఎట్ట? నెల రోజుల నాడే నూటయాబై చేసాం. నూటయాబై అని పేరేగానీ అక్కడ ఏం వస్తన్నయి? అన్ని వస్తువుల ధరలూ పెరిగే!''

''నాకు అయ్యేం తెలియదే! వంద లెక్కన తీసకపొండి''

''చాకిరీ చేసిన వాళ్ల దగ్గర బేరం చేస్తే ఎట్టమామా? నాలుగు మంత్రాలు చదివినందుకు రేత్రి బేమ్మడికి ఐదువేలా నూటపదహార్లు ఇచ్చారే! కూటికి దికాణా లేని మాదగ్గరా బేరాలు? పనోళ్లం అనేగా లోకువ?''

అంతలో కొడుకు ఇంట్లోనుండి బయటికి వచ్చాడు.

''వాళ్లు అడిగినంత ఇవ్వు నాన్నా! పని వాళ్లతో ఎందుకు గొడవ?''

''నీకు తెలియదు. నువ్వు వూరుకోరా! ఇయ్యాల మనం ఇస్తే రేపు ఇంకొకర్ని కూడా వీళ్లు అట్నే అడుగుతారు. ఉన్నవాళ్లు వుంటారూ, లేనివాళ్లూ వుంటారూ! రేపు వాళ్లు మనల్ని తిట్టుకుంటారు. మనం పెంచామని! అట్ట ఇయ్యకూడదు''

''నువ్వు పెంచేది ఏంది మామా? నెల రోజుల్నుంచీ నూట యాబై తీసుకుంటుంటే!''

''శుభకార్యం జరిగిన ఇంట్లో అలగా గుంపుతో తగాదా ఎందుకూ? నూటఇరవై లెక్కన తీసకపోండే! రేత్రి మిగిలినయి ఒక్కొక్కరూ మూడు నాలుగు బకెట్లు తీసకపోయారు మీరు. మనిషిని బట్టి పోవాలి!'' అంది రామనరసయ్య భార్య.

''నువ్వేందే మళ్లీ ఇరవై రూపాయలు పెంచావూ?'' భార్యమీద కయ్యిమన్నాడు.

''నోర్మూసుకుని ఇయ్యి'' ఆమె వురిమింది.

''అదేందమ్మా...'' అని వాళ్లు కొద్దిసేపు నసిగి, మొండికిపడి, చివరికి ఆ డబ్బు తీసుకుని దారిపట్టారు.

''చూడేరు, ఆయన పెళ్లాం ఏమంటందో! బర్రెది! మనం అలగా గుంపంట! పని చేశాం. డబ్బులడిగాం. మనం అలగా గుంపా? పని చేసినోళ్లకి డబ్బులు ఇయ్యటానికి పేచీలు పెట్టీ, తగాదాపడినోళ్లు అలగా గుంపవుతారు కానీ, మనమా?'' అంది సుబ్బమ్మ.

''పెట్టే దగ్గర వేలూ, లచ్చలూ బడాయిగా పెడతారు. ఎక్కడెక్కడివాళ్లో తిన్న ఎంగిలి విస్తళ్లు ఎత్తేసిన మన దగ్గరికి వచ్చేసరికి పేచీలు పెట్టి గీచి గీచి బేరాలు చేత్తాడు పెతోడు. మొన్కొకడు తాగి ఆ విస్తట్లోనే బండెడయితే కక్కుకుని రోతరోత చేసి పెట్టాడు. అదంతా ఎత్తడంలా మనం. మన దగ్గర ఎందుకంటా బేరాలూ?'' అని దారిలో తిట్టుకుంటూ వాళ్ల గుడిసెలకు చేరుకున్నారు.

1 comment: