ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నది ఒక సామెత. అచ్చం అలాగే చేయాలన్న రూలేమీ లేదు కాబట్టి- ఇంట పై'చేయి' సాధించలేని పరిస్థితిలో కూడా రచ్చకెక్కి రాజకీయాలు మాట్లాడవచ్చు! ఇంట్లో ఈగల మోత... బయట పల్లకీ మోత! అన్న సామెత ఇలాంటి అనుభవంలోంచి పుట్టిందే! రచ్చబండ రాజకీయాలూ, రచ్చబండ కబుర్లూ మనకేం కొత్తవి కావు. రాళ్లూ, రాజకీయాలూ తొలి నుంచీ ఉన్నవే! వాటి మధ్య అవినాభావ సంబంధం ఉందని ఏ రాయి సాక్షిగానైనా చెప్పవచ్చు. కొంతమందికి ఎవరో ఒకరి మీద రాయి వేయందే రోజు గడవదు. కొందరికి రాజకీయం నాలుగు రాళ్లు వెనకేసుకునే వ్యాపారం. ప్రత్యర్థి సభలపై రాళ్లేయడం అంత ఆషామాషీ కాదు. చాలాసార్లు రాయి రెడీమేడ్ ఆయుధంగా చేతికి అందివస్తుంది. చుట్టూ అనిశ్చితి నెలకొంటున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా 'రచ్చబండే' మార్గదర్శిగా కనపడింది. ఏదో ఒకలాగా జనం మధ్యకు వెళ్లడం మంచిదే కానీ, నెలల తరబడి పెండింగులో ఉన్న వినతులనూ, విజ్ఞప్తులనూ పరిష్కరించకపోతే- పథకం పారదు. హామీలతోనో, హంగామాతోనో కాలం నెట్టుకుపోయే రోజులు పోయాయి. మునుపటి ముఖ్యమంత్రులు హామీల ఆప్షన్‌ను పక్కాగా వాడేయడంవల్ల- ఈ సిఎంకి మిగిలింది ఆచరణలో చూపడమే! ఇల్లు, ఇంటిస్థలం, రేషను కార్డు వంటి అభ్యర్థనలు '...మళ్లీ మొదలెట్టు..' అంటే కుదరదు. ఉత్తరాంధ్ర పర్యటనలో మహిళలు సిఎంకు అందుకనే అలాంటి ఝలక్‌లిచ్చారు.
ఇదేదో 'రక్ష'బండ అవుతుందని తలపోస్తే- అక్షరాలా 'రచ్చ'బండే అవుతోంది. జనం ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తుంటే- ప్రజా ప్రతినిధుల గుండెల్లో బండరాళ్లు పడ్డట్టు అవుతుంది. రచ్చబండ కాస్తా... ఉతికి ఆరేసే చాకిరేవుగా మారిపోతోంది. నేతలు షరతులూ, పరిమితులూ పెడుతున్నా; మాట్లాడొద్దని వారిస్తున్నా వాతలు తప్పటం లేదు. తెలంగాణాలో అయితే మంత్రులను వెంటపడి తరుముతున్నారు. ధరలు మండిపోయి, డొక్కలు ఎండిపోయి, జనం ఇక్కట్లు పడుతుంటే- కొంతమంది అధికార నేతలు పరాచికాలకు తెగిస్తున్నారు. అలాంటి సందర్భాల్లో జనాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. జనం అవసరాలను పట్టించుకోకుంటే- రచ్చబండ రోకలిబండై తల బొప్పి కట్టిస్తుందన్న నిజం ముఖ్యమంత్రికీ, మంత్రులకూ తెలిసి రావాలి! చాలాచోట్ల సభల్లో ఇలాంటి 'పాఠాలే' ఆవిష్కృతమవుతున్నారు!
స్పందించి సరి చేసుకుంటే సరేసరి!
లేకుంటే... రచ్చబండే రేవుబండ!
No comments:
Post a Comment