Monday, January 31, 2011

పెద్ద అధికారి - పనివాళ్లు

ఇద్దరూ అధికారులు. వాళ్లలో ఒకరిని పెద్ద అధికారి అనొచ్చు. మరొకరు మామూలు అధికారి. ఇద్దరూ కలిసికట్టుగా సర్వీసులో ఉన్నవాళ్లు. సుమారు 35 ఏళ్లు ఆఫీసులో ఉన్నవాళ్లు, రాసిన వాళ్లు, ఎదిగిన వాళ్లు. పెద్ద అధికారి నాలుగేళ్లు గంధపు నూనె కార్ఖానాలో మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉండడం తప్పితే ఇద్దరూ తమ జీవితంలోని అనేక వత్సరాలను విధాన సభలోని ప్రణాళికా విభాగంలో గడిపారు. ప్రతి ఏడూ ప్రణాళిక వేయడానికి అంకెలు, అంశాలు సేకరించడం, కూడడం, తీసివేయడం, లెక్క చేసినదాన్ని ఆఫీసులో చెక్‌ చేయడం, బయటి నుంచి వచ్చిన అభ్యర్థనలను చూచి ఒక పక్కన పెట్టడం, వాటిపై ఏదైనా తప్పక రాయాల్సి వచ్చినప్పుడు 'పని వీలు కాదు', ఆర్థిక అనానుకూలం', మొదలైన నోట్స్‌ చేయడం, అంగీకరించేట్టు ఉంటే 'తమ సూచనలు గమనించబడును' అని తెలియచేయడం, వీటిలోనే వారి జీవితంలోని అధిక భాగం గడిచిపోయింది. ఇంట్లో నౌకర్లు చాకర్లు ఉన్నారు. 

ఆఫీసులో జవాన్లు ఉన్నారు. పూర్వంలో ఇనాందారీ కుటుంబీకులు కావడం వల్ల కూరగాయలు, బియ్యం, గోధుమలు పల్లె నుంచి వస్తాయి. వాటిల్లో వాళ్లకు ఆసక్తి లేదు. ఆఫీసే వారికి లోకం. దస్తావేజులు పెట్టడంలో, క్లిష్టమైన లెక్కలను చేయడంలో నిష్ణాతులని పేరు తెచ్చుకున్నారు. ఒకసారి కర్నాటక ప్రభుత్వం అధికారులకు బిరుదులివ్వాలనే ఉత్సాహం కలగడంతో ఈ పెద్ద అధికారికి 'జంటగా బిరుదు' ఇవ్వాలనే సూచన కూడా ఉండింది. అదెలాగో ఈ ఇద్దరు అధికారులు బిరుదు కోసం ప్రయత్నాలే చేయలేదని రాజకీయ నాయకులకు తెలిసి మిన్నకుండిపోయారు.

ఇలా ఉండే పెద్ద అధికారి మామూలు అధికారి రిటైరయ్యారు. పదవీ విరమణ రోజున తమ తమ ఇళ్లకు వెళ్లి సుష్టుగా భోంచేసి పడుకున్నారు. అయితే ఉదయం వాళ్లిద్దరి కోసం ఆశ్చర్యం కాచుకునుంది. మామూలు అధికారి పొద్దున్నే లేచి కళ్లు నులుముకుని చూశాడు. ఓ నిర్జన ప్రదేశంలో పెద్ద అధికారి పక్కన తాను అంతవరకు పడి ఉండి లేచాడని గ్రహించాడు. కళ్లు నులుముకుని చూశాడు. గిల్లుకుని చూశాడు. కల కాదు. చేతికి కట్టుకున్న వాచీ, ఒంటి మీదున్న దుస్తులు తప్ప వేరే ఏమీ లేవు. ఉదయం ఏడుగంటలై, సూర్యుడుదయించి మనిషెత్తుకు వచ్చినప్పటికీ పెద్ద అధికారి పడుకునే ఉండడం చూచి ''సార్‌, తెల్లవారింది, లేవండి'' అన్నాడు మామూలు అధికారి.

''కాఫీ ఎక్కడీ'' అంటూ పెద్ద అధికారి లేచాడు. మామూలు అధికారి, ముఖంలో భయం, కలవరం నింపుకుని పెద్ద అధికారికి అంతా వివరించసాగాడు. పెద్ద అధికారికి తన సహోద్యోగి మాటల్లో నమ్మకమే కలగలేదు. బెంగుళూరు నుంచి ఒకటి రెండు మైళ్ల దూరంలో తామంతా పిక్‌నిక్‌కు వచ్చి ఉండొచ్చనుకుంటూ గిల్లుకున్నాడు. నేలను తాకి చూశాడు. కాదు, కల కాదు. ఇద్దరూ తమ స్థితిని గురించి చర్చించసాగారు. నోట్స్‌ చేయడానికి పెన్ను, పేపరు కూడా లేదు. లేచి తామున్న ప్రదేశాన్ని పరీక్షించసాగారు. దూరంలో చెట్ల తోపు, నది ఉన్నట్టు కనిపించింది. ఏ దారిగానీ, రాస్తాకానీ లేకపోవడం వల్ల జనాలు లేరనేది స్పష్టమైంది.

''ఆహారం కోసం ఏం చేద్దాం?'' అని పెద్ద అధికారి అడిగాడు. తన బాస్‌కు ఎలా నచ్చచెప్పాలా అని సతమతమై మామూలు అధికారి చేతులు నులుముకున్నాడు. తినడానికి ఏదైనా దొరుకుతుందా అని ఇద్దరూ అటూఇటూ తిరగసాగారు. చెట్ల దగ్గరికి వచ్చారు. మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, పనస చెట్లు అన్నీ ఉన్నాయి. పళ్లు కూడా కాచాయి. కానీ ఎక్కడం ఎలా?'' ''ఏమండీ, మీరే చెట్టెక్కి కొబ్బరి కాయలు దింపండి'' అని పెద్ద అధికారి అనగానే మామూలు అధికారి 'చెట్టు ఎక్కడం రాదు' అని చెప్పడానికి సిగ్గుపడి, కొబ్బరి కాయల చెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేసి నాలుగడుగులు పైకి సాగేలోపు జారి, ఉన్న ఒక చొక్కాను చింపుకున్నాడు. పెద్ద అధికారి పనస చెట్టు ఎక్కబోయి పట్టు తప్పి పడ్డాడు.

ఇద్దరూ నిరాశ చెంది ఏటి గట్టుకు వచ్చారు. కావలసిన చేపలు ఉన్నాయి. కానీ వాటిని పట్టడం ఎలా? వాటిని చూస్తూ నుంచున్నారు. చివరికి తిరుగుతూ ఉంటే ఏదైనా దొరకవచ్చని ఊరక చెరువు గట్టు వెంబడి నడవసాగారు. అడివే వారి కోసం ఎదురు చూస్తోంది. అక్కడ జింకలు, పందులు, కుందేళ్లు వాళ్లను చూచి పరిగెత్త సాగాయి. ఇద్దరికీ ఆకలి పెరుగుతూ పోయింది. చివరికి అడివి కూడా తమకేమీ ఇవ్వలేదనిపించి ఆగిపోయారు.

''సార్‌ ఇప్పుడొక పని చేద్దాం'' అన్నాడు మామూలు అధికారి. కొత్త ఐడియాలు ఇవ్వడంలో మామూలు అధికారి నిష్ణాతుడైనందువల్ల పెద్ద అధికారి కుతూహలంతో విన్నాడు. ''మీరు దక్షిణానికి వెళ్లండి. నేను ఉత్తరానికి వెళ్తాను. దేన్నైనా సంపాదించుకుతీరాలి. ఆకలేస్తుంది'' అన్నాడు మామూలు అధికారి.

''ఉత్తరమేది, దక్షిణమేది?'' అడిగాడు పెద్ద అధికారి. సూర్యుడు మబ్బు చాటుకు పోవడంతో కాస్త ఆగి మామూలు అధికారి అన్నాడు ''పశ్చిమానికి ముఖం చేసి నుంచుంటే నా ఎడమ వైపున ఉన్నదే దక్షిణం''. ''కుడివైపున ఉన్నది ఎందుకు దక్షిణం కాకూడదు'' అని పెద్ద అధికారి అన్నాడు. మామూలు అధికారి తికమక పడసాగాడు. ఇసుక మీద మ్యాప్‌ గీసి చూపితే పెద్ద అధికారి నిజ జీవితంలో దానికి వ్యతిరేకంగా ఉండడం సాధించి చూపసాగాడు. ఇద్దరికీ తలలు చెడిపోసాగాయి. ''నీవు ఈ దిక్కులో వెళ్లు. నేను ఆ దిక్కులో వెళ్తాను'' అని పెద్ద అధికారి నడవసాగాడు. పొట్ట తాళం వేయడం మొదలై ఇద్దరి తలలు పాడవసాగాయి. ''రాత్రికి ఇక్కడికే రండి'' అని మామూలు అధికారి 'సార్‌' కూడా చేర్చకుండా పెద్ద అధికారిని కేకేశాడు.

ఇద్దరూ పొద్దువాలేంత వరకూ నడిచి అలసిపోయి ముందుగానే తెలిసిన అడివి అంచుకు చేరారు. ఏమీ దొరకలేదు. ఎవరూ తారసపడలేదు. మామూలు అధికారి మాత్రం చేతిలో ఓ పేపర్‌ పట్టుకుని వచ్చాడు. ''హిందూ పేపర్‌ అక్కడ పడి ఉంది'' అని మామూలు అధికారి అనగానే పెద్ద అధికారి దాన్ని చప్పున లాక్కుని ''కాస్త పాత పేపర్‌, అయినా ఫరవాలేదు. ప్రస్తుతం చదవడానికి పేపర్‌ దొరికింది కదా'' అని చూడసాగాడు. ''గవర్నర్‌గారు నిన్న సాయంత్రం నగర ప్రముఖులకు గొప్ప విందు ఏర్పాటు చేశారు. కర్నాటకలో జనప్రియమైన మద్దూరు వడ, 'కొడుగు' పనస అప్పడాలు, గుల్బర్గా నూనె వంకాయ కూర, మైసూరు బొబ్బట్లు అన్నీ చక్కగా చేయబడ్డాయి'' అని పెద్ద అధికారి చదవగానే ఆకలి తీవ్రమై మామూలు అధికారి ''సార్‌! ఆహారం గురించి చదవకండి. చచ్చిపోతాను'' అంటూ పేపర్‌ లాక్కున్నాడు. సంపాదకీయ వ్యాసాలు చదవలేక చివరకు ''ఈ మధ్య వ్యవసాయ విశ్వవిద్యాలయం కనిపెట్టిన మల్లికా మామిడి పండు అత్యంత తీపి రుచిని కలిగి ఉంది'' అని చదివి పేపర్‌ను విసిరేశాడు.రాత్రి ఎక్కడ పడుకోవాలో తోచక ఇద్దరూ తమ పెన్షన్‌ డబ్బులు ఏయే విధంగా ఇన్‌వెస్ట్‌ చేయాలో చర్చించారు. కాలం గడవడం లేదు. ఆకలి రగులుకొని మండసాగింది. పెద్ద అధికారి ఆచరణలో నమ్మకమున్న వాడవడంవల్ల లేచి పచారు చేయసాగాడు. ''ఏదైనా ఆట తెలుసునేమండి'' అని అడిగితే మామూలు అధికారికి ఏమీ తెలియదు. ఎలాగో తెల్లవారింది. ఉదర బాధ పెరుగుతూ పోయింది. పెద్ద అధికారి ''నీ వల్లే ఇలా అయింది'' అంటూ చేతి కింది మనుషుల్ని తిట్టే రీతిలోనే మాట్లాడాడు. మామూలు అధికారి కోపం, ఆకలితో బాధపడుతూ ''నా వల్లే'' అన్నాడు. పెద్ద అధికారి అతని కాలర్‌ పట్టుకోగానే మామూలు అధికారి విడిపించుకోవడానికి పెనుగులాడాడు. పెద్ద అధికారి అతని చేయి కరిచాడు. రక్తం కనిపించగానే ఇద్దరూ బెదిరిపోయి మౌనంగా కూర్చున్నారు.

చివరికి మామూలు అధికారి, ''ఒక ఐడియా తట్టింది'' అంటూ లేచాడు. మామూలు అధికారి నడవసాగాడు. ఎలాంటి ఆశ లేకపోయినా పెద్ద అధికారి అనుసరించాడు. చాలా దూరం నడిచారు. అటూ ఇటూ చూస్తూ వెళ్లారు. చివరికి ఏటి పక్కన ఒక రైతు పడుకుని ఉండడం కనిపించింది. పెద్ద అధికారి గట్టిగా ''ఒరే పల్లెటూరి మొద్దూ, లే!'' అని గదమగానే పనివాడు లేచి ''అయ్యగారూ'' అంటూ చేతులు జోడించాడు.

''సోమరి వెధవా, నిద్రపోతూ కాలం గడుపుతావా? కొబ్బరి చెట్టెక్కి కొబ్బరి బోండాలు తెంచుకుని రా'' అన్నాడు మామూలు అధికారి. గంభీరమైన ఎత్తు, కాంతివంతమైన ముఖం, అధికార స్వరానికి భయంతో చెమటలు పట్టిన పనివాడు తలకు తుండు చుట్టుకుని కొబ్బరి బోండాలు దింపాడు. అయ్యగారికి అలసట కలగడం, కోపం రావడం వాడికి తెలిసిపోయింది. వాళ్లు కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండగా మామిడి చెట్టు, పనస చెట్టు ఎక్కి పళ్లు కోసి ఇచ్చాడు. వాళ్లు ఆజ్ఞాపించక మునుపే అడివిలోకి దూరి కుందేలు, పంది, జింకలను చంపి తెచ్చి వెదురు బొంగులు రాపాడి మంట చేసి వంట చేశాడు. అధికారులిద్దరూ సుఖంగా భోజనం చేశారు. పనివాడు వాళ్లు ఒదిలేసిన కుళ్లిన పండ్లు, ఎముకలు చీకుతూ వారి ఆజ్ఞ కోసం ఎదరుచూడసాగాడు. వాళ్లేమీ చెప్పకుండా తమ ఆఫీసు, పెన్షన్‌ గురించి మాట్లాడుతూ ఉండడం వల్ల ''నేను కొంచెం సేపు పడుకుందునా దొరా'' అన్నాడు.''దానికంటే ముందు ఒక మంచి తీగను కోసుకురా. అది గట్టిగా ఉండాలి'' అన్నారు వాళ్లిద్దరూ.

అతను గట్టి తీగ తెచ్చిన వెంటనే అతడి కాళ్లు చేతులు కట్టి చెట్టుకు బిగించి సరిగా బందోబస్తు చేసి, ''సోమరి వెధవా, ఎక్కడికైనా తప్పించుకుపోతావేమో జాగ్రత్త!'' అన్నారు. దాంతో పనివాడు కట్టేసిన చోటనే నిద్రపోయాడు.

అధికారుల జీవితం సక్రమంగానూ, ప్రశాంతంగానూ సాగిపోసాగింది. పనివాడు కష్టపడి వేటాడేవాడు. చేపలు తెచ్చేవాడు. పళ్లు తెంచేవాడు. పది పన్నెండు మైళ్లు వెళ్లి ఉప్పు, చింతపండు కూడా తెచ్చి వంట చేసేవాడు. అధికారులు ఊరికి వెళ్లడమే మరిచారు. తమ పెన్షన్‌ బాగా పెరిగాక వెళ్తే బాగుంటుందని నిర్ణయించుకున్నారు. అప్పుడే పనివాడితో ఒక బండి తయారుచేయమని చెప్పారు.

''రేరు గాడిదా! బండి బాగుండాలి. బండి లాగేవాడివి నీవే గుర్తుంచుకో'' అని హెచ్చరించారు. సంభాషణ ఆహ్లాదంగా ఉంది.

మామూలు అధికారి ''సార్‌! రామాయణం కథ జరిగిందేనంటారా?'' అని అడిగేవాడు.

''మరి! ఇప్పటికీ దండకారణ్యం, అయోధ్య, లంక ఉండడం దాన్ని సూచిస్తుంది కదా'' అంటూ పెద్ద అధికారి వివరిస్తాడు.

''అది కాదు సార్‌! కోతులు మాట్లాడడం కాస్త...''

''డార్విన్‌ థియరీ ప్రకారం మనిషి ఒక దశలో అలా ఉండేవాడు'' అని పెద్ద అధికారి వివరించేవాడు.

మరోసారి ''తూర్పు-పడమరలు ఉండడం విచిత్రం'' అని పెద్ద అధికారి ఆశ్చర్యపోయేవాడు.

''అదేం కాదు, సూర్యుడు లేకుంటే ఏది తూర్పు, ఏది పడమర అని తెలిసేది కాదు'' అని మామూలు అధికారి విస్మితుడయ్యేవాడు.

కొద్ది రోజుల్లో బండి తయారైంది. మంచి టేకు చెట్టును నరికి, కోసి, నునుపు చేసి, పనివాడు బండి తయారుచేశాడు. దాన్ని అధికారుల ముందుకు తెచ్చి నిలిపి పనివాడు ఒంగి నుంచున్నాడు. వాళ్ల మెప్పుకోసం ఎదురు చూశాడు.

''ఛీ! గబ్బు ముండా కొడుకువి కదరా. గతిలేని వాడిలా చేశావు'' అని అధికారులు బండెక్కి కూర్చున్నారు. వారు బండి ఎక్కడమే పనివాడికి వారి మెప్పుదలకు పరాకాష్టగా కనిపించింది. హుషారుగా బండి లాగుతూ ''మల్లేశ్వరానికి కద సార్‌!'' అన్నాడు.

అదెలా తెలిసిందో? బెంగుళూరులోని, మల్లేశ్వరంలోని ఎనిమిదవ క్రాస్‌!

తొందరగా, తొందరగా లాగు! చాలా సోమరివయ్యా నువ్వు. రద్దీ ఎక్కువ. జాగ్రత్తగా లాగాలి'' అన్నారు.

విచిత్రమేమంటే ఆ పనివాడికి బెంగుళూరు దారి, మధ్య దారిలో నిలిపేటప్పుడు యజమానులు విశ్రమించాల్సిన జాగా, వంట తయారు చేయడానికి అనుకూలమైన స్థలం అన్నీ తెలుసు. బెంగుళూరు చేరేసరికి రాత్రయింది.

పెద్ద అధికారి ''వీణ్ణి రెండు రోజులు తమ దగ్గరే ఉండనీ'' అని అధికార స్వరంతో చెప్పడం వల్ల మామూలు అధికారి మిన్నకుండిపోవాల్సి వచ్చింది. పైగా మామూలు అధికారి తాను రేపటి రోజున తీసుకోవాల్సిన నాలుగైదు నెలల పెన్షన్‌ గురించి ఆలోచించసాగాడు. పెద్ద అధికారి ఇల్లు చేరి పిల్లలతో మాట్లాడుతూ సంతోషపడ్డాడు. ఇంటి భోజనం చాలా బాగుంది. పడుకోబోయే ముందు పనివాడు గుర్తొచ్చి వాడి వైపు ఓ కంబళి విసిరి ''తోటలో పళ్లున్నాయి. దొంగలు కోయకుండా చూడాలి'' అని అన్నాడు.

పనివాడు ఆకలితో ఎదురు చూడసాగాడు. అధికారి చివరకు ఒక రొట్టె ముక్క విసిరి ''పడుకో'' అంటూ తలుపులు మూసుకున్నాడు.

అయ్యగారు సంతృప్తులైనందుకు పనివాడు కుదుటపడి రొట్టెముక్క తింటూ కూర్చున్నాడు.


''కాఫీ ఎక్కడీ'' అంటూ పెద్ద అధికారి లేచాడు. మామూలు అధికారి, ముఖంలో భయం, కలవరం నింపుకుని పెద్ద అధికారికి అంతా వివరించసాగాడు. పెద్ద అధికారికి తన సహోద్యోగి మాటల్లో నమ్మకమే కలగలేదు. బెంగుళూరు నుంచి ఒకటి రెండు మైళ్ల దూరంలో తామంతా పిక్‌నిక్‌కు వచ్చి ఉండొచ్చనుకుంటూ గిల్లుకున్నాడు. నేలను తాకి చూశాడు. కాదు, కల కాదు. ఇద్దరూ తమ స్థితిని గురించి చర్చించసాగారు. నోట్స్‌ చేయడానికి పెన్ను, పేపరు కూడా లేదు. లేచి తామున్న ప్రదేశాన్ని పరీక్షించసాగారు. దూరంలో చెట్ల తోపు, నది ఉన్నట్టు కనిపించింది. ఏ దారిగానీ, రాస్తాకానీ లేకపోవడం వల్ల జనాలు లేరనేది స్పష్టమైంది.

No comments:

Post a Comment