Friday, May 8, 2015

పిల్లల్లో భవిష్యత్ ప్రశ్నార్థకంగా

పిల్లలు అమ్మ ఒడిలోనైనా ఆడుకోవాలి. లేదా తరగతి గదిలోనైనా ఉండాలి. ఈ రెండు చోట్లా కాకుండా పిల్లలు ఎక్కడున్నా వారి హక్కులు కాలరాసినట్టే. వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారినట్టే. అమ్మానాన్న ఒడిలో ఉండలేని పరిస్థితిలోనూ, బడిలోనే తమ జీవితాలను తీర్చిదిద్దుకోవాలని ప్రయత్నిస్తున్న చిన్నారులు మీ చుట్టూ, మన చుట్టూ అనేకమంది ఉన్నారు.
దేశంలో నేడు 18 సంవత్సరాలలోపు వున్న వారి సంఖ్య 45 కోట్లు. కానీ, నేటికీ దేశంలో 73 శాతం మహిళలు, చిన్నారులు దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారని లెక్కలు చెప్తున్నాయి. ఈ ఆర్థిక పరిస్థితే అనేకమంది చిన్నారులు బడిబాట మాని, పనిబాట పట్టేలా చేస్తోంది.
పిల్లల్లో పోషకాహార సమస్య....
నేటికీ, 35 శాతం పిల్లల జననాలు నమోదు కావడం లేదు. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 35 శాతం పిల్లలు తక్కువ బరువుతో జన్మిస్తున్నారు. నేటికీ 40 శాతం పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. నేటికీ ప్రతి 100 మంది పిల్లల్లో 19 మంది డ్రాపవుట్స్ గా మిగులుతున్నారు. 100 మంది డ్రాపవుట్స్ లో 66 మంది అమ్మాయిలే కావడం మరింత శోచనీయం. 65శాతం మంది ఆడపిల్లలకు 18 ఏళ్లలోపే పెళ్లిళ్లు జరుగుతున్నాయి. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు పిల్లలపై బాధ్యతలు మోపుతున్నాయి. హాయిగా ఎదగాల్సిన వయసులో వారి భవిష్యత్ కు అడ్డుగా నిలుస్తున్నాయి. అయినా వాటిని అధిగమిస్తున్నవారు, అననుకూలతను జయిస్తున్న చిన్నారులెందరో మన చుట్టూ ఉన్నారు.
స్కూల్ ఫీజు కోసం కూలీగా...
అమ్మానాన్నల సంరక్షణలో హాయిగా పెరగాల్సిన కోటేశ్వరి, కన్నవారి ప్రేమకు దూరమైంది. ప్రస్తుతం అమ్మమ్మ, తాతయ్యల సంరక్షణలో ఉంది. వారిద్దరి ఆర్థిక అశక్తత కారణంగా, స్కూల్ ఫీజుకోసం పత్తిచేలో కూలీగా మారింది. అంతంత మాత్రం ఆర్థిక పరిస్థితికి తోడు, కాలికి తగిలిన గాయానికి వైద్యం కూడా చేయించుకోలేని స్థితిలో పత్తిచేలో కూలీగా పనిచేస్తోంది. అలాగని చదువుకు దూరం కాలేదు. ఆ చదువును కొనసాగించాలనే ఈ విధంగా తాపత్రయపడుతోంది.
కుటుంబ భారాన్ని, చదువు బాధ్యతని మోస్తున్న యామిని...
గోరుముద్దలు తినిపించాల్సిన అమ్మ, అనారోగ్యంతో ఇంటికే పరిమితమైతే, కుటుంబ భారాన్ని, చదువు బాధ్యతని తన భుజాలమీదకెత్తుకుంది ఈ యామిని. తన భవిష్యత్ ఎలా ఉంటుందో తెలీదు, ఎలా తీర్చిదిద్దుకోవాలో తెలీదు. అయినా ఒక భరోసాతో పనిచేస్తే, తన సమస్యలు తీరుతాయనే నమ్మకంతో పత్తిచేలో కూలీగా మారింది. కాసిన్ని డబ్బులు చేతికొస్తే, తిరిగి స్కూల్ కెళ్లాలని అంటోంది.
స్కూలు ఫీజు కోసం పత్తిచేల్లో ...అమ్మ అనారోగ్యం, ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా, ఉత్సాహంగా ఉరకలేస్తున్న ఈ చిన్నారి పేరు రవి. స్కూల్ కెళ్లడం, చదువుకోవడం అతనికిష్టం. అయినా తప్పడం లేదు. ఇలా పత్తిచేలో పనిచేయడం ఇష్టం లేదు. స్కూల్లో ఫీజు కట్టుకోవాలి. అందుకే పనిచేస్తున్నానంటాడు. పెద్దాయ్యాక పోలీస్ ఆఫీసర్ అవుతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.తమ్ముడికి అన్నీ తానై చూసుకుంటున్న రాధిక...ఐదేళ్ల వయసున రాధికకి పసితనం ఛాయలు ఇంకా వీడనేలేదు, తమ్ముడికి అన్నీ తానై చూసుకుంటోంది. తమ్ముడి పట్ల వయస్సుకు మించిన బాధ్యతతో వ్యవహరిస్తోంది. అమ్మలా లాలిస్తుంది. ఆకలేస్తే తినిపిస్తుంది, సమయానికి కావలసిన సేవలన్నీ చేస్తుంది. అక్కలా తోడుంటుంది. అనుక్షణం రక్షణగా నిలుస్తోంది. తల్లిదండ్రులు కూలీ పనికి వెళ్తూ చిన్న వాడైన తమ్ముడిని చూసుకునే బాధ్యత రాధికకు అప్పగించారు. విషాదమేమిటంటే రాధికకు కేవలం ఒక సంవత్సరం తేడా తో ఒక అక్క ఉండేది, కేవలం మూడు నెలల క్రితం వరకు రాధిక, రాధిక తమ్ముడి బాధ్యత అక్కదే. పాము కాటుకు గురై అక్క మరణించిన తర్వాత రాధిక తమ్ముడి బాధ్యత నెత్తికెత్తుకుంది. అంగన్ వాడీ సెంటర్ కు పంపిస్తే ఏడుస్తున్నాడని తరగతి గదిలో కూడా తన పక్కనే కూర్చోబెట్టుకుంటోంది. ఒక పక్క చదువుతూనే నిరంతరం తమ్ముడిని కనిపెట్టుకుని ఉంటోంది.చదువుకుంటూనే వ్యవసాయం పనులు చేస్తున్న బాబు...ఒకవైపు చదువుకుంటూనే, మరో వైపు వ్యవసాయం పనుల్లోనూ చేదోడు వాదోడుగా నిలుస్తున్నాడు బాబు. బాబు ప్రస్తుతం 7 వ తరగతి చదువుతున్నాడు. స్కూల్ లో ఉన్నంతసేపే విద్యార్థి. ఆ తరువాత, అంతకుముందు గేదెల కాపరి. ఈ పనులకు తోడు తండ్రికి, వ్యవసాయ పనుల్లో కూడా ఈ బాబు సాయపడతాడు. చెల్లిబాధ్యత తీసుకున్న సాహిత...బుడి బుడి నడకల చెల్లి చేతిని తన చేతిలోకి తీసుకుని నడిపిస్తున్న సాహిత వాళ్ళ తల్లిదండ్రులకు రెండో సంతానం. అక్కను బడి మాన్పించి పనికి పంపిస్తున్న పోచవ్వ చిన్న కూతురిని సాహితతో బడికి పంపిస్తుంది. దినసరి కూలీకి వెళ్ళే పోచవ్వ బాధ్యతను సాహిత తీసుకుంది. చెల్లి అవసరాలన్ని తీరుస్తుంది. తనతోపాటు బడికి తీసుకెళ్తుంది. తరగతి గదిలో తన పక్కనే కూర్చోబెట్టుకుని కంటికి రెప్పలా కాపాడుతుంది. లంచ్ బెల్ కొట్టగానే అటు అంగన్ వాడీ సెంటర్ లో చెల్లికి ఆహారం తీసుకొచ్చి తినిపిస్తుంది. ఆడిస్తుంది, పాడిస్తుంది, లాలిస్తుంది.చిన్నారి విద్యార్థులకు ఉపాధ్యాయుల వ్యక్తిగత సాయం...అనేకమంది ఉపాధ్యాయులు ఇలాంటి పేద చిన్నారులెందరికో అనుక్షణం చేయూత అందిస్తున్నారు. వ్యక్తిగతంగానూ వారికి సాయపడుతున్నారు. ఈ చిన్నారుల భవిష్యత్ బాగుండాలంటే, వ్యక్తిగత సాయం సరిపోదని, ప్రభుత్వం మరింత సానుకూలంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. తక్షణం వారి ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచించాలి...1989లో ఐక్యరాజ్యసమితి ఒక ఒప్పందాన్ని రూపొందించింది. 1989లో జరిగిన ఒప్పందం 1990వ సంవత్సరంలో బాలల హక్కుల ఒప్పందం అమలులోకి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం 18 ఏళ్ళ లోపు వారందరినీ బాలలుగా పరిగణించి, వారిని అన్ని రకాల వివక్షల నుంచి దోపిడీ నుంచి రక్షించాలని, వారి ఎదుగుదలకు అవసరమైన అన్ని రకాల వసతులు, సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాలకు స్పష్టమైన మార్గ దర్శనం చేసింది. ఇకనైనా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఆ దిశగా ఆలోచించాలని కోరుకుందాం. 
10tv

No comments:

Post a Comment