Friday, January 31, 2014

''నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పటి నుండి ఫ్యాషన్‌

అహ్మదాబాద్‌లో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌, యూనివర్సిటీ ఫర్‌ ఆర్కిటెక్చర్‌, అర్బన్‌ ప్లానింగ్‌ అండ్‌ ఇంటీరియర్‌ డిజైన్‌,
నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నా లజీ వంటి సంస్థలు ఫ్యాషన్‌కు సంబంధించిన వివిధ అంశాలలో యువతకు శిక్షణ నిస్తున్నాయి. అక్కడ విద్యార్థులు తాము నేర్చుకున్న విద్యకు వైవిధ్యాన్ని జోడించి, ఫ్యాష న్‌ను సరికొత్త బాట పట్టిస్తున్నారు. 20 నుండి 30 ఏళ్ళ మధ్య వయస్సున్న వీరు తమ పనితనానికి సంప్రదాయాన్ని మేళవిస్తున్నారు. విభిన్నంగా కనిపించేలా ఇప్పటి ట్రెండ్‌ను అనుసరించి కర్టెన్లు, దుస్తులు, చెప్పులు, నగలు తయారుచేస్తున్నారు. సొంత లేబుల్‌తో బ్రాండ్‌ ఇమేజ్‌ తెచ్చుకుంటున్నారు. పర్యావరణానికి అనుకూలంగా ఉంటూ ఇలాంటి కృషి చేస్తున్న యువ తరంగాలు, వారి లేబుల్స్‌ గురించి మీ కోసం..
ఇరవై తొమ్మిదేళ్ళ నీరజ లఖానీ 'నీర్‌జీ ఆర్గానిక్‌' అనే బ్రాండ్‌తో బట్టలతో పాటు వివిధ అలంకరణ వస్తువులను తయారు చేయడంలో సిద్ధహస్తురాలు. ''నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పటి నుండి ఫ్యాషన్‌కు సంబంధించిన విషయాలను నేర్చుకున్నాను. మా నాన్నగారికి మారిషస్‌కి బదిలీ అయింది. అక్కడ స్కూల్లో డిజైనింగ్‌ ఒక సబ్జెక్ట్‌గా ఉండేది. అక్కడే నేను ఫ్యాషన్‌, టెక్స్‌టైల్స్‌, రంగుల ఎంపిక వంటి ఫ్యాషన్‌కు సంబంధించిన మొదటి సూత్రాలు నేర్చుకున్నాను'' అని అంటారు నీరజ. స్కూల్‌ చదువు పూర్తయ్యాక నీరజ 'నిఫ్ట్‌'(ఎన్‌ ఐ ఎఫ్‌ టి) లో చేరారు.''నా గ్రాడ్యుయేషన్‌ 2007లో అయిపోయిన తర్వాత నేను ముంబైలో ఒక ఏడాది పాటు పనిచేసి, సొంతంగా పర్యావరణానికి హాని కలిగించని వస్తువులు తయారుచేసి, అమ్మడానికి 'నీర్‌జీ' మొదలుపెట్టాను. సహజంగా పెంచిన ఆర్గానిక్‌ నూలుతో తయారుచేసి, సహజమైన రంగులు అద్దిన దుస్తులు సరఫరా చేసే, గ్లోబల్‌ ఆర్గానిక్‌ టెక్స్‌టైల్‌ స్టాండర్డ్‌ సర్టిఫికేట్‌ పొందిన కంపెనీలు దొరకడం కష్టమైపోయింది. ఇది నేను 'నీర్‌జీ'ని ఆరంభించిన తర్వాత ఎదుర్కొన్న మొదటి సవాలు'' అని చెప్పారామె.ఆర్గానిక్‌ దుస్తులు పర్యావరణానికి మేలు కలిగించడమే కాకుండా అటువంటి ఉత్పత్తులు అమ్మేవారి విలువను కూడా పెంచుతాయి. టాక్సిన్‌ రహితమైన ఈ దుస్తులను వేసుకోవడం వలన చర్మానికి కూడా హాని కలగదు. ''దుస్తులలో మిగిలి పోయిన ముక్కలతో రకరకాల అలంకరణ వస్తువులు తయారుచేస్తాను. ఇప్పుడిప్పుడే అమ్మకాలు కూడా పుంజుకుంటున్నాయి'' అని చెబుతున్నారు నీరజ.
వ్రజ్‌ భూమి
ఇక, భూమి ధానికి హస్త కళల వ్యాపారం చేయాలని ఎప్పటి నుండో కోరిక ఉండేది. ఇద్దరు స్నేహితులతో కలసి 'వ్రజ్‌ భూమి' అనే లేబుల్‌తో దుస్తులు, ఇంకా మహిళలకు అవసరమైన ఇతర వస్తువులు తయారుచేయడం ఆరంభించారు. ''నేను నిఫ్ట్‌లో ఒక ప్రాజెక్ట్‌ మీద పనిచేశాను. ఆ విధంగా నాకు అజ్రక్‌తో పనిచేసే అవకాశం కలిగింది. అజ్రక్‌ అంటే రెండు వైపుల రంగులు అద్దే ఒక కాటన్‌ టెక్స్‌టైల్‌. ఇది చాలా పెద్ద పని. చేతిపని చేసేవాళ్ళకి చాలా అనుభవం ఉండి ఉండాలి.నాకు ఆ కళ గురించి తెలుసు. అందుకే సొంతంగా పని మొదలుపెట్టాను'' అంటారు 28 ఏళ్ళ భూమి ధాని. ఆమె అహ్మదాబాద్‌లోని గుడీస్‌ అనే ఒక ప్రముఖ కేఫ్‌లో దుస్తుల ప్రదర్శన నిర్వహిస్తుంటారు. '' మా ప్రదర్శనకు వచ్చిన స్పందన చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. చాలామంది నాణ్యమైన హస్త కళలకు ప్రాముఖ్యమిస్తారని మాకు అర్థమైంది'' అంటారామె.
డ్యాజిల్‌
''మా అత్తగారికి అహ్మదాబాద్‌లో బొటిక్‌ ఉంది. ఆమే నన్ను మహిళలకు నచ్చేలా సంప్రదాయ చెప్పులు తయారుచేయమని ప్రోత్సహించారు. చాలామందికి దుకాణాలలో వారి సైజు చెప్పులు, వారికి నచ్చిన రంగు దొరకవు. నేనది గమనించాను అందుకే 'డ్యాజిల్‌' ఆరంభించాను'' అంటారు 26 ఏళ్ళ ఆమిన్‌. ఆమిన్‌ ఫార్మసీలో మాస్టర్స్‌ డిగ్రీ చేశారు. 'డ్యాజిల్‌' అనే బ్రాండ్‌పై మహిళలకు అవసరమైన రెడీమేడ్‌ చెప్పులు తయారుచేస్తున్నారు. ''ఆర్డర్‌ను బట్టి వారి సైజు చెప్పులు తయారుచేస్తుంటాను. ఏదైనా ప్రత్యేక సందర్భాల కోసం చెప్పులు తయారుచేయించుకునేవారికి నా ఉత్పత్తులు సంతృప్తినిస్తాయి. ధర రూ. 1000 మొదలుకొని రూ.3000 వరకు ఉంటుంది. డ్యాజిల్‌ ఫుట్‌వేర్‌ అనే మా వెబ్‌ సైట్‌ నుండి, మా బొటిక్‌ నుండి మేము తయారుచేసిన చెప్పులు కొనుక్కుంటూ ఉంటారు.'' అని వివరించారు ఆమిన్‌.
టిల్లా
''నేను చేతి మగ్గం ఉత్పత్తులను తయారుచేయాలని అనుకున్నాను. ఎందుకంటే నాకు ఖాదీ అంటే ఇష్టం. నేను కూడా ఖాదీనే వేసుకుంటాను'' అంటారు 33 ఏళ్ల దేవ వర్మన్‌. 'టిల్లా' అనే లేబుల్‌ పేరుతో సాధారణంగా ఉండి స్టైలిష్‌గానూ ఉండే వస్త్రాలను తయారుచేయడం ఇతని ప్రత్యేకత. ''నేను టిల్లా మొదలుపెట్టినప్పుడు ఫ్యాషన్‌కు సంబంధించిన విషయాలను, ట్రెండ్‌లను నాలుగువైపులా గమనిస్తూ ఉండేవాడిని. ఫ్యాషన్‌ అంటే, వెలుగు జిలుగులతో పై నుండి కింది వరకు అలంకరణలు గుప్పించి తయారుచేస్తారు. కానీ నేను సాధారణంగా, వాస్తవంగా ఉండి స్టైలిష్‌గా ఉండేలా డిజైన్‌ చేయాలని నిర్ణయించుకున్నాను'' అంటారు వర్మన్‌. మహిళలు రోజువారీగా వేసుకునే దుస్తులకు గాలి ఆడేలా ఉండి, తేలికగా ఉండే వస్త్రాలను ఉపయోగిస్తాను. నేను డిజైన్‌ చేసిన బట్టలు ప్రయాణాలు చేసేప్పుడు సులువుగా తీసుకు వెళ్ళగలిగేలా ఉంటాయి. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌లో వర్మన్‌ చదువుకున్నారు. కొన్ని ఏళ్ళ నుండి దుస్తులు డిజైన్‌ చేస్తున్న వర్మన్‌ తన 'టిల్లా' లేబుల్‌తోనే, ఇప్పుడు లైటింగ్‌, ఫర్నిచర్‌, ఇంటి అలంకరణల లాంటి సేవలు కూడా అందిస్తు న్నారు. ''అహ్మదాబాద్‌లో నా డిజైనర్‌ దుస్తులను ప్రదర్శించాను. చాలా మంచి స్పందన వచ్చింది. దుస్తులు, ఇంటి అలంకరణ సామానులు రెండు వేర్వేరు విషయాలు. కానీ నేను రెండింటికీ సమర్థంగా డిజైన్‌ చేయగలుగుతున్నా'' అన్నారు వర్మన్‌.
కృషి, సృజనాత్మకత ఉంటే ఎంచుకున్న రంగంలో విజయం సాధ్యమని ఈ యువతీ యువకులు నిరూపిస్తున్నారు కదూ!

No comments:

Post a Comment