Thursday, October 17, 2013

ఓట్స్‌ ఊతప్పం


బ్రేక్‌ఫాస్ట్‌ను బ్రేక్‌ చేయొద్దంటున్నారు వైద్యులు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. దాంతో రోజంతా ఉత్సాహంగా, పూర్తి ఎనర్జిటిక్‌గా ఉండొచ్చు. ఉదయం తీసుకొనే బ్రేక్‌ఫాస్ట్‌ కడుపు నిండేలా ఉండాలంటున్నారు పోషకాహార నిపుణులు. అదే సమయంలో ఆరోగ్యానికి మేలు చేయాలి. శరీరానికి తగినంత శక్తినివ్వాలి. అందుకు రోటీన్‌ ఇడ్లీ, ఉప్మాల్ని బ్రేక్‌ చేద్దాం. ఆకుపచ్చని ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, పాలు, గుడ్లు, పండ్లు, తేనెతో సరికొత్తగా తయారుచేసే బ్రేక్‌ఫాస్ట్‌లు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. వీటితో మరింత ఆరోగ్యాన్ని అందించే బ్రేక్‌ఫాస్ట్‌లలో కొన్నింటిని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
ఓట్స్‌ ఊతప్పం
కావల్సిన పదార్థాలు : వీట్‌ బ్రెడ్‌ (గోధుమ) -4 పెద్ద ముక్కలు; ఓట్స్‌ - కప్పు, రవ్వ-అరకప్పు; వంటసోడా-చిటికెడు; జీలకర్ర- అరకప్పు; ఉప్పు- రుచికి సరిపడా; పెరుగు-అరకప్పు; నీరు-కప్పు; ఆయిల్‌- 2 టేబుల్‌ స్పూన్లు, గార్నిష్‌ కోసం: క్యారెట్‌, క్యాప్సికమ్‌, ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర - అన్నీ చిన్న చిన్న ముక్కలుగా తురుముకున్నవి 2 కప్పులు.
తయారుచేసే విధానం : ముందుగా బ్రెడ్‌ ముక్కల అంచుల్లోని బ్రౌన్‌కలర్‌ భాగాన్ని తీసేయాలి. తర్వాత ఓట్స్‌ను, బ్రెడ్‌ను పొడిచేసి పెట్టుకోవాలి. ఒక బౌల్‌ తీసుకొని అందులో ముందుగా ఈ పొడి వేసి, దీనిలో రవ్వ, వంటసోడా, ఉప్పు, జీలకర్ర, పెరుగు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి, దోసె పిండిలా జారుగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌపై నాన్‌స్టిక్‌ పాన్‌ పెట్టి నూనె వేసి, వేడి చేయాలి. ఆ తర్వాత గరిటె నిండుగా పిండి తీసుకొని పాన్‌పై దోసెలా వేయాలి. దీని చుట్టూ కొద్దిగా నూనె వేయాలి. మంట మధ్యస్థంగా ఉండేలా చూసుకోవాలి. పైన గార్నిష్‌ కోసం సిద్ధంచేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దోసెపై వేసి, సర్దాలి. ఇప్పుడు మంటను పూర్తిగా తగ్గించి, ఐదు నిమిషాలు కాలనివ్వాలి. తర్వాత రెండోవైపు కూడా తిప్పి 1-2 నిమిషాలు కాల్చాలి. (ఇష్టమైతే ఒకసైడ్‌ కాలినా కూడా బాగుంటుంది) అయితే ఇలా ఒకవైపే కాల్చాలనుకున్నప్పుడు గార్నిష్‌ మిశ్రమాన్ని వేశాక, పైన మూత బోర్లించాలి. ఇలా తయారైన ఊతప్పాన్ని ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన ఓట్స్‌ ఊతప్పం రెడీ. దీనిలోకి కొబ్బరి చట్నీ లేదా టమాటా సాస్‌ మంచి కాంబినేషన్‌. 
పనీర్‌ దోసె..
కావల్సినపదార్థాలు: పనీర్‌- కప్పు; ఉల్లిపాయలు-2 (సన్నగా తరిగిపెట్టుకోవాలి); పచ్చిమిరప కాయలు-4 (చిన్న ముక్కలుగా చేసుకోవాలి); పసుపు- చిటికెడు; కారం-టేబుల్‌ స్పూన్‌; టమాటా-ఒకటి (చిన్న చిన్న ముక్కలుగా తరగాలి); ఉప్పు- రుచికి సరిపడా: జీలకర్ర -చిటికెడు; నూనె - తగినంత. దోసెల పిండి: మినపప్పు -కప్పు; బియ్యం - 2 కప్పులు. వీటిని ముందు రోజు ఉదయం నానబెట్టుకుని సాయంత్రం రుబ్బి పెట్టుకోవాలి. అంతే ఈ రోజు బ్రేక్‌ఫాస్ట్‌కు దోసెల పిండి రెడీగా ఉన్నట్లే.
తయారుచేసే విధానం: ముందుగా పన్నీర్‌ను మెత్తగా చిదుముకుని, పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్‌ పెట్టి నూనె వేసి, వేడయ్యాక అందులో జీలకర్ర వేసి అవి చిటపటలాడుతుంటే అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు వర్ణం వచ్చే వరకూ వేయించాలి. అందులో పసుపు, ఉప్పు వేసి, ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి అవి మెత్తగా ఉడికే వరకూ వేయించాలి. ఇప్పుడు అందులో చిదిమి పెట్టుకున్న పన్నీర్‌ను వేసి బాగా కలపాలి. ఇలా 5-10 నిమిషాలు వేయించుకోవాలి. అంతే దోసెలోకి ఫిల్లింగ్‌ మిశ్రమం రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టౌపై నాన్‌స్టిక్‌ పాన్‌ పెట్టి దోసె వేసుకోవాలి. దోసె రెండువైపులా కాలాక మసాలా దోసెకు బంగాళదుంప కూరను ఎలా రాసి సర్వ్‌ చేస్తామో, అలాగే ఈ పన్నీర్‌ మిశ్రమాన్ని రాసి సర్వ్‌ చేయాలి. అంతే పన్నీర్‌ దోసె రెడీ. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. దీనికి చట్నీ లేదా సాంబార్‌ మంచి కాంబినేషన్‌. అయితే దీన్ని వేడి వేడిగా తినాలి.
కావల్సిన పదార్థాలు: క్యాబేజి-అరకప్పు (తురిమి, ఉడికించాలి); పెసరపప్పు - పావుకప్పు (ఉడికించుకోవాలి); సోయా మీల్‌మేకర్‌ - పావుకప్పు (పొడి చేసుకోవాలి); బంగాళదుంప-1 (ఉడికించి, చిదిమి పెట్టుకోవాలి); పచ్చిమిర్చి పేస్ట్‌-టేబుల్‌ స్పూన్‌; పసుపు- చిటికెడు; జీలకర్ర - టేబుల్‌ స్పూన్‌; కొత్తిమీర తరుగు - టేబుల్‌స్పూన్‌ (సన్నగా తురుముకోవాలి); ఉప్పు- రుచికి సరిపడా; గోధుమ పిండి - 2 కప్పులు; నీళ్లు - కప్పు.
తయారుచేయు విధానం: పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర వేసి నిమిషం వేయించాలి. తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యాబేజీ తురుము మరియు పెసరపప్పు వేసి, మీడియం సెగతో 3-4 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు అందులోనే సోయా పొడి, చిదిమి పెట్టుకొన్న బంగాళదుంప వేసి 4-5 నిమిషాలు అదే సెగపై వేయించాలి. పచ్చిమిర్చి పేస్ట్‌, పసుపు, ఉప్పు, కొత్తిమీర వేసి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. తర్వాత స్టౌ ఆఫ్‌ చేసి, పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్‌ తీసుకుని గోధుమ పిండి, ఉప్పు, నీళ్ళు పోసి సున్నితంగా పిండిని కలుపుకోవాలి. పదినిమిషాల తర్వాత పిండి నుండి కొద్దికొద్దిగా తీసుకొని చపాతీలా రోల్‌ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న స్టఫింగ్‌ను చపాతీ మధ్యలో పెట్టి మడిచి, అన్ని వైపులా క్లోజ్‌ చేసి, తిరిగి చపాతీలా ఫ్లాట్‌గా చేసుకోవాలి. ఇప్పుడు స్టౌపై నాన్‌స్టిక్‌ పాన్‌ పెట్టి వేడయ్యాక స్టఫ్డ్‌ పరోటాను వేసి, వేడిచేస్తూ రెండువైపులా తిప్పుతూ బంగారురంగు వచ్చేవరకూ వేయించుకోవాలి. ఇలాగే పరోటాలన్నీ వేయించుకోవాలి. అంతే స్టఫ్డ్‌ సోయా పరోటా రెడీ! ఇది చాలా రుచికరంగా ఉంటుంది. దీనిలోకి టమాటా సాస్‌ సూపర్‌ కాంబినేషన్‌! దీన్ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కూడా.
వెజిటబుల్‌ పాన్‌ కేక్‌
కావల్సిన పదార్థాలు: మైదా- 3 టేబుల్‌ స్పూన్లు; మొక్కజొన్న గింజల పిండి (కార్న్‌ఫ్లోర్‌) - 2 టేబుల్‌ స్పూన్లు; బియ్యంపిండి- 3 టేబుల్‌ స్పూన్లు; బేకింగ్‌ పౌడర్‌- టేబుల్‌ స్పూన్‌; బంగాళదుంప (ఆలుగడ్డ)- ఒకటి (పెద్దది- దీన్ని చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి); క్యారెట్‌-ఒకటి (దీన్ని తురుముకోవాలి); క్యాప్సికమ్‌- ఒకటి (సన్నగా కట్‌ చేసుకోవాలి);
తయారుచేసే విధానం: ముందుగా ఒక బౌల్‌ను తీసుకుని అందులో బియ్యంపిండి, నీళ్ళుకూడా పోసి, చిక్కగా, జారుగా పిండిని కలుపుకోవాలి. తర్వాత కలుపుకొన్న పిండిలో పైన సిద్ధం చేసుకొన్న పదార్థాలన్నింటినీ వేసి, బాగా కలుపుకోవాలి. పిండి మరీ చిక్కగా లేదా మరీ పల్చగా లేకుండా సమంగా కలుపుకోవాలి. కలుపుకున్న ఈ మిశ్రమాన్ని పదినిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత స్టౌ మీద పాన్‌ పెట్టి, మీడియం మంట పెట్టి, పాన్‌ మీద దీసెలా వేసుకోవాలి. దీని అంచుల్లో నూనె వేసి 2-3 నిమిషాలు కాలాక, తిరగేసుకోవాలి. రెండోవైపు కూడా దోస కాల్చుకోవాలి. దోసె పసుపురంగులోకి వచ్చిందంటే దోసె కాలిందని అర్థం. ఇలా మొత్తం పిండిని దోసెలుగా పోసుకోవాలి. అంతే వెజిటుబల్‌ పాన్‌కేక్‌ రెడీ. దీనిలోకి టమాటా, పచ్చిమిర్చి రోటిపచ్చడి చాలా బాగుంటుంది.
మెక్సికన్‌ ఎగ్‌ ఛీజ్‌రాప్‌
కావల్సిన పదార్థాలు: ఫ్లౌర్‌ టోర్టిల్లా (గోధుమ పిండితో తయారుచేసిన పలుచని చపాతీ లాంటిది) -1 లేదా 2 (8 అంగుళాలు); గుడ్డు- ఒకటి; మెక్సికన్‌ జున్ను-2 టేబుల్‌ స్పూన్లు; సల్సా సాస్‌- టేబుల్‌ స్పూన్‌; ఉప్పు- రుచికి సరిపడా.
తయారుచేసే విధానం: మొదట ఫ్లౌర్‌ టోర్టిల్లాను మైక్రో ఓవెన్‌ సేఫ్‌ బౌల్లో నొక్కి పెట్టాలి. ఇప్పుడు ఫ్లౌర్‌టోర్టిల్లా మధ్యలో గుడ్డును పగులగొట్టి పోయాలి. గుడ్డు లిక్విడ్‌ను ఫోర్క్‌ సహాయంతో బాగా గిలకొట్టాలి (ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది గుడ్డును గిలకొట్టేటప్పుడు టోర్టిల్లా చిరిగిపోకుండా జాగ్రత్తగా, చాలా నిదానంగా చేయాలి. ఇలా వీలుకాకపోతే చిన్న బౌల్లో గుడ్డును బాగా గిలకొట్టి, తర్వాత ఫ్లౌర్‌టోర్టిల్లాలో పోయవచ్చు). ఇప్పుడు గుడ్డు సొనతో నింపిన టోర్టిలానో మైక్రో ఓవెన్‌లో పెట్టి, 45 సెకన్లుకు సెట్‌ చేయాలి. 45 సెకన్లు తర్వాత గుడ్డు ఉడికిందో లేదో ఒకసారి చెక్‌ చేసుకోవాలి. ఒకవేళ గుడ్డు ఉడకనట్లైతే తిరిగి మైక్రో ఓవెన్‌లో పెట్టి, మరో 20 నిమిషాలు సెట్‌ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లౌర్‌ టోర్టిల్లాన్‌ను మైక్రో ఓవెన్‌ బౌల్లో నుండి బయటకు తీసి, ఒక వెడల్పు ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లౌర్‌ టోర్టిల్లా మీద మెక్సికన్‌ చీజ్‌, సల్సా సాస్‌ మరియు చిటికెడు ఉప్పును రాయాలి. తర్వాత ఫ్లౌర్‌ టోర్టిలాను కింది భాగం పూర్తిగా కవర్‌ చేయాలి. అలాగే సైడ్స్‌ను లోపలికి మడిచి కవర్‌ చేయాలి. అంతే హెల్దీబ్రేక్‌ ఫాస్ట్‌కు ఎగ్‌ చీజ్‌ రాప్‌ రెడీ! దీనిని టమాటాసాస్‌తో తింటే భలే రుచిగా ఉంటుంది.

No comments:

Post a Comment