Tuesday, October 8, 2013

ప్రకాశవంతమైన చర్మం కోసం...నీరు

                                  
     పని ఒత్తిడి, బద్దకంతో నీటికి దూరంగా ఉంటే మన అందాన్ని, ఆరోగ్యాన్ని మనచేతులారా మనమే చెడగొట్టుకున్నవారమవుతాం. నీటితో మేటి లాభాలున్నాయని ప్రతి ఒక్కరూ గమనించాలి. అవేంటో తెలుసుకుందాం...
   శరీరంలో నీటి శాతం సక్రమంగా ఉండాలి. ఇది ఏమాత్రం తక్కువున్నా చర్మం ముడతలు పడడం, పొడిబారిపోవడం, చర్మ సమస్యలు మొదలవుతాయి. శరీరంలో నీటి శాతం 75 నుంచి 80 వరకు ఉండాలి. రోజుకు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలి. దీంతో శరీరంలోని వ్యర్థాలు దూరమవుతాయి. చర్మం మంచి నిగారింపును పొందుతుంది. శరీరంలోని నీరు చెమట, మూత్రం రూపాల్లో బయటికి పోతుంది. దీంతో శరీరం నీటి శాతాన్ని కోల్పోతుంది. కనుక ఆ నష్టాన్ని పూడ్చడానికి ఎప్పటికప్పుడు శుభ్రమైన నీటిని తాగుతూ ఉండాలి. ఎక్కువ నీటిని తీసుకోవడంతో అధిక బరువు ఉన్నవారు కూడా తగ్గుతారు. శరీర ఆకృతి చుడముచ్చటగా తయారవుతుంది. పెదాల పగుళ్లను నివారించి సున్నితంగా, అందంగా చేస్తుంది. చర్మం తేమగా ఉండాలంటే సరిపోను నీరు తప్పనిసరి. ముఖం మీద ఏర్పడ్డ ముడతలను మట్టుమాయం చేయడంలో నీరు చేసే పనితీరే వేరు. మూత్రపిండాల్లో రాళ్లు, ఇతర సమస్యలు వచ్చే అవకాశముండదు. చెమట ద్వారా శరీరంలోని మలినాలను బయటికి పంపడంతో దుర్వాసనకు దూరంగా ఉండొచ్చు. అందరినీ ఆకట్టుకునే అందం మన సొంతమవడంలో కళ్లది కూడా కీలక పాత్ర ఉంటుందన్న విషయాన్ని మరిచిపోవద్దు. అందం విషయంలో కళ్లు కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తాయి. నీళ్లు తాగడంతో పాటు రోజులో అప్పుడప్పుడు కళ్లను చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల కళ్లు తాజాగా, ఆకర్షణీయంగా కనబడుతాయి.
మరీ ఎక్కువైనా కష్టమే..
నీరు తాగితే మంచిదే కదా అని మరీ బలవంతంగా కడుపు ఖాళీ లేకుండా పట్టించే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే మూత్రపిండాలపై ఎక్కువ భారం పడుతుంది. కిడ్ని ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. దాంతో ఆనారోగ్య బారిన పడాల్సిన ప్రమాదముంది. ఎక్కువ దాహం వేసినప్పుడైనా, మళ్లీ మళ్లీ తాగాల్సి వస్తుందని ఒకేసారి గ్లాసులకొద్దీ నీరు తగడం సరైన పద్ధతి కాదు. దాంతో మేలుకన్నా కీడే ఎక్కువగా ఉంటుందనేది గమనించాలి. అప్పుడప్పుడు కొన్ని కొన్ని నీళ్లు తీసుకోవడమే అందానికి, ఆరోగ్యానికి ఎంతో మంచిదరి మర్చిపోవద్దు.
- బెల్లె పవన్‌
ప్రకాశవంతమైన చర్మం కోసం...
నీటిని సక్రమంగా తాగడంతో పాటు చర్మాన్ని కూడా నీటితో ఎప్పటికప్పుడు శుభ్రపర్చుకోవాలి. రోజూ స్నానం చేయడంతో శరీర ఉష్ణోగ్రత ఎప్పుడూ నిలకడగా ఉంటుంది. చర్మ రంధ్రాల్లోని మురికి సులభంగా తొలుగుతుంది. దాంతో చర్మవ్యాధులు మన దరిచేరవు. గోరువెచ్చని నీటిలో కాటన్‌ వస్త్రాన్ని కొద్దిసేపు నానబెట్టి, ఆ తర్వాత దాంతో ముఖం మీద పరుచుకోవాలి. దీంతో చర్మరంధ్రాలు తెరుచుకుంటాయి. ఇదే పద్ధతి తరుచూ చేస్తే మొటిమల బారిన పడకుండా కూడా కాపాడుకోవచ్చు.

No comments:

Post a Comment