చెన్నయ్ లోని నెహ్రూ స్టేడియంలో ఈనెల 21 నుంచి 24 వరకు వందేళ్ళ సినిమా
పండుగ జరుగనుంది. ఈ వేడుకల కోసం స్టేడియాన్ని ఎంతో అందంగా
తీర్చిదిద్దుతున్నారు. దాదాపు 25 కోట్ల రూపాయల ఖర్చుతో భారీ స్థాయిలో
తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలను నిర్వహించనుంది. అలనాటి
పాత మధురాల నుంచి నేటి పాటల వరకు సెలెక్టివ్ గా డాన్సులు ప్లాన్
చేస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ
కార్యక్రమంలో సౌత్ ఇండియా రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు. ముఖ్య
అతిథిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరుకానున్నారు. సినీ కుటుంబం నుంచి
బిగ్ బీ అమితాబ్, శ్రీదేవి, రజనీకాంత్, కమలహాసన్ వంటి అతిరథ మహారథులు
అభిమానులకు కనువిందు చేయబోతున్నారు. వందేళ్ళ సినిమా వేడుకల సందర్భంగా ఈనెల
17 నుంచి 22 వరకు స్థానిక థియేటర్లలో తెలుగు, తమిళ, మళయాళ, హిందీ సినిమాలను
ప్రదర్శించనున్నారు. అలనాటి ఆణిముత్యాలు మాయాబజార్, పాతాళభైరవి,
మల్లీశ్వరి సినిమాలను కూడా ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. ఇళయరాజా
స్వరపరిచిన 8 నిమిషాల పాటను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారు.
ఇది మొత్తం వేడుకలకే హైలెట్ గా నిలుస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.

No comments:
Post a Comment