Thursday, September 5, 2013

ఒకే ఒక్కపాత్రతో 'పంచమి'

''చిన్నతనం నుంచి ప్రయోగాలు చేయడం అంటే ఇష్టం. రొటీన్‌గా కాకుండా కొత్తగా ఏదైనా చేయాలనే తపన నాలో ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రయోగాత్మకంగా ఒకే ఒక్కపాత్రతో 'పంచమి' సినిమా చేశానని'' నూతన
దర్శకురాలు సుజాత భౌర్య అన్నారు. అర్చన టైటిల్‌ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని మేఘన Ê హర్ష సమర్పణలో ఐడియా మూవీ క్రియేషన్‌ బ్యానర్‌పై డి.శ్రీకాంత్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె చెప్పిన సంగతులు.

పలు యాడ్స్‌ చేశా
చెన్నైలో డిఎఫ్‌ఐ పూర్తి చేశాక దర్శకుడు గీతాకృష్ణ దగ్గర యాడ్‌ ఏజన్సీలో పని చేశాను. కొన్ని చిత్రాలకు దర్శకత్వపు శాఖలో పనిచేసి తరువాత కృష్ణవంశీగారి దగ్గర 'చక్రం' సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాను. దర్శకురాలిగా మొదటి చిత్రమిది. అంతేగాక స్వయంగా యాడ్‌ ఏజన్సీ కూడా నడుపుతున్నాను.
ఐడియాకు కారణమిదే!
లవ్‌ స్టోరీలు, యాక్షన్‌ సినిమాలు అందరూ చేస్తున్నారు. ఏదైనా కొత్తగా ట్రై చేయాలని ఈ సినిమా చేశాను. ఇందుకోసం చాలా అనుకున్నాను. ఒకేఒక్కపాత్రతో చేస్తే ఎలా ఉంటుందనేది మెదిలింది. ఇంతకుముందు ఎవరైనా చేశారేమోనని నెట్‌లో వెతికితే. ఇంగ్లీషులో ఓ చిత్రం కన్పించింది. అందులోనూ సగం తర్వాత మరో పాత్ర ఎంటరవుతుంది. కానీ ఒకే ఒక్కపాత్ర మొత్తంగా సినిమా చేయాలని ఈ ప్రయోగం చేశాను. రచయిత దాసరి గంగాధర్‌ని కలిసి నా ఆలోచనల్ని ఆయనతో పంచుకుని ఈ కథను రెడీ చేశాం. రాసే కొద్ది చాలా ఆసక్తి పెరిగింది. ఎక్కడా బోర్‌కొట్టకుండా జాగ్రత్త పడ్డాను.
ఫొటోగ్రాఫర్‌ కథే!
ఒక ఫోటోగ్రాఫర్‌ తన దగ్గరున్న ఫోటో కలెక్షన్‌ని ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించి గోల్డ్‌ మెడల్‌ సాధించాలనుకుంటుంది. దానిలో భాగంగా ఫొటో షూట్‌ కోసం ఓ అడవికి వెళుతుంది. అక్కడ ఆమె ఎటువంటి సమస్యలను ఎదుర్కొంది. తనకి ఎదురైన అనుభవాలేంటి అనేది కథ. దాంతోపాటు మరణం లేకుండా జీవితాన్ని సాగించగలమా? లేదా అని ఆమెకొచ్చిన ప్రశ్నలకి సమాధానమే ఈ చిత్రం.
అర్చనపై నమ్మకం కుదిరింది
స్టార్‌ హీరోయిన్‌తో సినిమా తీసేంత అనుభవం నాకు లేదు. ఈ కధకి ఆమె న్యాయం చేయగలదు అని నాకు అనిపించింది. ఆమెలో టాలెంట్‌ ఉంది. అందుకే అర్చనని ఎంపిక చేశాం. తన క్యారెక్టర్‌కి 100 పర్సెంట్‌ న్యాయం చేసింది. కొన్ని సీన్స్‌లో డూప్‌ లేకుండా నటించింది. ఈ చిత్రంతో ఆమెకు మంచి పేరొస్తుంది.
గ్రాఫిక్స్‌ ప్రత్యేక ఆకర్షణ...
సినిమా మొత్తం మీద 52 నిమిషాలు గ్రాఫిక్స్‌ ఉంటాయి. రాజేష్‌ పాల అద్భుతంగా గ్రాఫిక్స్‌ చేశారు. అర్చన, పక్షులు, జంతువుల మీద సినిమా నడుస్తుంది. సింగిల్‌ క్యారెక్టర్‌ అనే ఫీలింగ్‌ ఎక్కడా కలగదు. అనుకున్న దాని కన్నా బడ్జెట్‌ ఎక్కువైంది. అయినప్పటికీ నిర్మాత సహకరించారు. పాటలకు రెస్పాన్స్‌ బావుంది. శ్రీకోటి చక్కని సంగీతం అందించారు.
దర్శకురాలుగా ఈ కథను తీసుకుని నలుగురు నిర్మాతలకు చెప్పాను. అందరూ పర్వాలేదు అన్నారేకానీ... చేద్దాం అని అనలేదు. ఐదవ వ్యక్తిగా శ్రీకాంత్‌గారికి చెబితే.. వెంటనే నచ్చి చేసేద్దాం అన్నారు. ఆ రకంగా పంచమ నిర్మాతతో 'పంచమి' తీశాను. ఇందుకు ముందుగా అనుకున్నదానికన్నా ఎక్కువే ఖర్చయినా.. అనుకున్నవిధంగా వచ్చింది. ప్రేక్షకులకు నచ్చుతుందనే ఆశిస్తున్నాను అన్నారు. త్వరలో భారీ బడ్జెట్‌తో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఆమె చెప్పారు. 

No comments:

Post a Comment