Tuesday, September 17, 2013

అమెరికన్లకు జాత్యహంకార కొవ్వు ఇంకా తగ్గలేదు

అమెరికన్లకు జాత్యహంకార కొవ్వు ఇంకా తగ్గలేదు.. అది అమెరికన్ల రక్తంలో ఏ స్థాయిలో కలిసిపోయిందో మరోసారి నిరూపితమైంది.. ఒక వైపు అసమానతలు వద్దంటూ ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు చైతన్యం తెచ్చే ప్రయత్నాల్లో ఉంటే..,
అమెరికన్లు మాత్రం మా తెల్ల తోలే గొప్పదంటూ తమ బలుపును ప్రదర్శిస్తున్నారు.. దీనికి తాజా ఉదాహరణే... మిస్ అమెరికా కిరీటం గెలుచుకున్న మన తెలుగుతేజంపై అమెరికన్లు చేస్తున్న ట్వీట్లు..
ఎన్ఆర్ఐ నీనా దావులూరి మిస్ అమెరికాగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆమె కిరీటం గెలుచుకున్న కొద్ది గంటల్లోపే కొందరు అమెరికన్ పౌరులు జాత్యహంకార జాఢ్యాన్ని చూపారు. తమ జాతి వివక్ష పైత్యాన్ని ట్విట్టర్లో వెళ్లగక్కారు. ''నీవు ఉగ్రవాదిలా ఉన్నావు...అమెరికా నుండి వెళ్లిపో'' అని ''handle @emi_adkins'' ఈ యూజర్ నుండి మొదటి ట్వీట్ వెలువడింది. ఇక ల్యూక్ బాసిలి అనే పెద్ద మనిషి ఏకంగా 9/11 దాడులను లింక్ చేస్తూ ట్వీటాడు. ''నాలుగు రోజుల కిందట 9 /11 సంఘటన జరిగింది. ఇప్పుడు ఈమె మిస్ అమెరికాగా ఎంపికయింది'' అని పేర్కొన్నాడు. పోకీ అనే వ్యక్తి పోకిరి మాటలు వదిలాడు. ఏకంగా ''మిస్ అమెరికాగా ఎంపికైంది ఒక అరబ్బు క్లాసికల్ డాన్సర్ ''అని తన పైత్యాన్ని వెళ్లగక్కాడు. నాటే అనే మహానుభావుడు ఆసియా ఖండాన్నీ వదల్లేదు. ''మీరు ఇండియన్లయినా...ఆసియన్లయినా..అమెరికాలో కిడ్ లే'' అంటూ అవమానించే ప్రయత్నం చేశాడు.
తెల్ల తోలు మగరాయుళ్ల వ్యాఖ్యలు ఇలా ఉంటే..అమెరికన్ ఆడవారు తమ జలసీని వెళ్లగక్కారు. ''ప్రమాణం చేసి చెబుతున్నాను. నేను రేసిస్ట్ ను కాదు.. అంటూనే,ఇది అమెరికా...మిస్ అమెరికా గా ఎంపికైంది ఒక టెర్రటిస్ట్'' అని జెస్సికా అనే యువతి పేర్కొంది.
అయితే ఇంత జాత్యహంకార నీడలు వెంటాడుతున్నప్పటికీ స్త్రీవాద బ్లాగు జీజెబెల్ మాత్రం మన తెలుగు తేజానికి అండగా ట్వీటింది. '' రేసిస్ట్ లు రేసిస్ట్ వాఖ్యలే చేస్తారు...ఎందుకంటే మిస్ అమెరికాగా ఎన్నికైంది ఒక అమెరికన్ కాదు గనుక.'' అని పేర్కొంది.
ఇదిలా ఉంటే '' ప్రకృతి పరంగా పుట్టుకతో వచ్చే శారీరక అందంతోపాటు ఏ సర్జరీకి తలవంచని మానసిక సౌందర్యమే గొప్పది'' అని జడ్జి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పి అందరి మనసులను, మిస్ అమెరికా కిరీటాన్ని గెలుచుకున్న మన తెలుగు తేజం నీనా దావులూరి హుందాగా ప్రవర్తించింది.'' వాటికి నేను అతీతం..వాటిని పట్టించుకోబోను'' అని వ్యాఖ్యానించింది.
ప్రభుత్వ తీరూ అంతే...
  
అమెరికన్ పౌరుల్లో ఎక్కువభాగం జాతి వివక్ష ధోరణులు కనిపిస్తాయి. అసలు ఈ పైత్యానికి అక్కడి ప్రభుత్వమూ కారణమే. మొదటి నుండి నల్ల జాతి ప్రజలను చిన్న చూపు చూసే జాఢ్యాన్ని అక్కడి ప్రభుత్వాలే పెంచి పోషించాయి. అది రానురానూ కొరకరాని కొయ్యగా మారింది. ప్రపంచం పై ఆధిపత్యాన్ని చలాయించాలని చూసే పెద్దన్న అమెరికా రకరకాల అవకాశాలు వెతుకుతుంటుంది. దానిలో భాగంగా రేసిజాన్ని ఒక పావుగా వాడుకుంటోంది. పూర్వపు సోవియట్‌ యూనియన్‌ రిపబ్లిక్కులలో ఒకటి, మధ్య ఆసియా దేశాలలో ఒకటైన కిర్ఘిజిస్తాన్‌ లో 2010లో జరిగిన జాతుల కొట్లాటలో అమెరికా హస్తం ఉందన్నది సుస్పష్టం. అమెరికా పెట్టిన జాతి వివక్ష చిచ్చుకు వెయ్యిమందికి పైగా అమాయకులు బలయ్యారు. పాలస్తీనా, ఇజ్రాయిల్ మధ్య జాత్యహంకార చిచ్చును రగిల్చిందీ అమెరికానే. ఇలా అమెరికాను పాలించే పెద్దలే తమ అత్యాశకు జాతి వివక్షను రెచ్చగొడుతుంటారు. ఇలా నేతలను ఫాలో అవుతూ కొందరు పౌరులు సైతం ఇదే జాఢ్యాన్ని వంటబట్టించుకున్నారు.
అభద్రతా భావంతోనే..?
 
మిస్ అమెరికాగా ఎన్నికైన యువతిపై అమెరికన్లు ఎక్కుపెట్టిన ట్వీట్లు తమలోని అభద్రతాభావాన్ని తెలుపుతున్నాయి. గత కొన్నేళ్లుగా అమెరికాలో నిరుద్యోగం ఎక్కువ అవుతోంది. ఉన్న అరకొర అవకాశాలను విదేశీయులు ముఖ్యంగా ఇండియన్లు చేజిక్కించుకుంటున్నారు. మరో వైపు ఆర్థికమాంద్యం తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి యువతలో అభద్రతాభావం, అసహనం ఎక్కువ అవుతోంది. తమకు కాకుండా ఇతరులకు అవకాశాలు దక్కినప్పుడు తమలోని అసహనాన్ని వారు తీవ్ర రూపంలో వ్యక్త పరుస్తున్నారు. తాజా ట్వీట్ల వ్యవహారమూ ఈ కోవలోనిదే అని అర్థం చేసుకోవచ్చు.
ప్రపంచాన్ని తన కను సైగలతో నడపాలని భావించే అగ్రరాజ్యానికి, అక్కడి జాత్యహంకారానికి బుద్ధి వచ్చే రోజు ఎప్పుడు వస్తుందో...

1 comment:

  1. ఎక్కడో అమెరికాలో "వాళ్ళ ప్రవర్తన " వలన వచ్చే నష్టం కన్నా మన రాష్టంలో తెలంగాణ "వాళ్ళ ప్రవర్తన " వల్లా వచ్చే నష్టం ఎక్కువ కదా!

    ReplyDelete