Thursday, September 19, 2013

ఉల్లిపాయకు ఒళ్లు మండుతోంది. ఒక్కసారిగా నెత్తినెక్కి కూర్చుంది. గత కొంత కాలంగా పెరుగుతూ వస్తున్న ఉల్లి ధర రూపాయి పతనంతో మరింత కొండెక్కింది. దానికి తోడు దేశవ్యాప్తంగా
ఉల్లి దిగుబడి భారీగా తగ్గిపోయింది. వెరసి సామాన్యుడి చెంతకు చేరనని భీష్మించుకు కూర్చుంది. మరోవైపు కేంద్ర మంత్రులు అడ్డదిడ్డంగా వక్రభాష్యాలు చెపుతూ ఉల్లితో పాటు ఫైర్ అవుతున్నారు.
ముట్టుకుంటే కన్నీరే..
 
యావత్‌ భారతదేశాన్ని ఇప్పుడు ఉల్లి కన్నీరు పెట్టిస్తోంది. ఒక్క కిలో ఉల్లిగడ్డలు కొనాలన్నా సామాన్యుడు ఒకటికి నాలుగుసార్లు ఆలోచిస్తున్నాడు. ప్రతి ఇల్లాలూ ఉల్లిని ముట్టుకున్నప్పుడల్లా ఉలిక్కిపడుతోంది. కొన్ని ప్రాంతాలలో ఉల్లి ధర వంద రూపాయలు దాటడమే ఇందుకు కారణం. దీంతో ఉల్లిని కొనలేక, జిహ్వచాపల్యం చంపుకోలేక, దానికి అలవాటుపడ్డవాళ్లు రుచీ పచీ లేని కూరలు తినలేక నానా అవస్థ పడుతున్నారు. ఇలాంటి సమయంలో బాధ్యతాయుతమైన ఏ ప్రభుత్వమైనా ఉల్లిధరల రెక్కలు విరచడానికి ప్రయత్నిస్తోంది. అయితే మన ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రులు
కపిల్ సిబల్ :
తాజాగా టెలికాం మంత్రి కపిల్‌సిబల్‌ ఉల్లి ధరలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉల్లిగడ్డలు ప్రభుత్వం అమ్మడం లేదనీ, ధరల పెరుగుదలపై వ్యాపారులనే అడగండంటూ తలతిక్క సమాధానం చెప్పారు. కపిల్‌సిబాల్‌ ధరల నియంత్రణ బాధ్యత ఎవరి చేతిలో వుంటుందో తెలియని అమాయక బాలుడేమీ కాదు. ప్రపంచంలోనే అత్యుత్తమ యూనివర్సిటీగా గుర్తింపు పొందిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న మేథావి. పైగా న్యాయవాది. కొంతకాలం న్యాయశాఖా మంత్రిగా పనిచేసినవాడు. అలాంటి వ్యక్తి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారంటే ఏమనుకోవాలి. ఆక్స్ ఫర్డ్ దాకా వెళ్లి ఆయన నేర్చుకున్న జ్ఞానం ఇదేనా? ఉల్లిగడ్డలు ప్రభుత్వం అమ్మడం లేదంటూ ఎకసక్కాలాడిన కపిల్‌ సిబాల్‌ ఓ విషయాన్ని మరచిపోయారు. వ్యాపారులు, దళారీలు ఉల్లిధరలు కృత్రిమంగా పెంచకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కొద్ది రోజుల క్రితమే కేంద్రం కోరింది. ప్రభుత్వం ఉల్లిగడ్డల వ్యాపారం చేయడం లేదంటూ వంకర మాటలు మాట్లాడిన కపిల్‌సిబల్‌ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల గురించి ఏమంటారో మరి. ఏదైనా సరుకుల ధరలు అనూహ్యంగా పెరిగినప్పుడు తానే స్వయంగా మార్కెట్‌లోకి దిగి, ఆయా సరుకులను నేరుగా రైతుల నుంచి సేకరించి, వినియోగదారులకు సరసమైన ధరకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదే వుంటుంది. ఈ కనీస స్పృహ కూడా లేని కపిల్‌ సిబల్‌ లాంటి వారు కేంద్ర మంత్రి కావడం ఈ దేశ దౌర్భాగ్యం.
శరద్ పవార్  వ్యాఖ్యలు : కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ ఉల్లి ధరలపై ఇష్టమొచ్చినట్లు నోరుజారుతున్నారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యవసాయ మంత్రే నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. ఉల్లి ధరలు పెరగడం వల్ల రైతులకు మేలు జరుగుతోందంటూ మాట్లాడి నాలుగు రోజులు గడవకముందే ఉల్లి ధరలపై మరోసారి నోరు జారారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్టోబర్ వరకు ఉల్లి ధర తగ్గటం అసాధ్యం అంటూ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. దీంతో రెచ్చిపోయిన దళారులు అమాంతంగా ఉల్లి ధరను పెంచేశారు. బ్లాక్ మార్కెట్ కు తరలించి అడ్డగోలు రేట్లకు అమ్ముకుంటున్నారు.
చేతికిరాని పంట
 
మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా ఉల్లిపంట తుడిచిపెట్టుకుపోయింది. కర్నాటక, మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, గుజరాత్‌ రాష్ట్రాలలో ఉల్లిపంట మార్కెట్‌లోకి రాలేదు. దీంతో దళారీలు కృత్రిమ కొరత సృష్టించి, ధరలు మండిస్తున్నారు. మరోవైపు డీజిల్‌, పెట్రోల్‌ ధరలు విపరీతంగా పెరగడంతో రవాణా ఖర్చులు భారీగా పెరిగాయి. ఇంకోవైపు డాలర్‌ ధర పెరగడంతో ఉల్లిని దుబాయ్‌, బంగ్లాదేశ్‌, సింగపూర్‌, మలేసియా లాంటి దేశాలకు భారీగా తరలిస్తున్నారు. వాస్తవిక కారణాలు ఇలా కళ్లెదుటే కనిపిస్తున్నా..ఉల్లి ధరల నియంత్రణ బాధ్యత ప్రభుత్వం చేతిలోనే ఉన్నా.. వ్యాపారులనే అడగండంటూ కపిల్‌సిబల్‌ చేసిన వ్యాఖ్యలు ఆయననో తిక్క మనిషిగా నిలబెడుతున్నాయి.

No comments:

Post a Comment