సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలోనైన ఎక్కువగా స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ తో సినిమా తీస్తుంటారు. ఆ సినిమాల్లో స్టోరీ ఎలా ఉందనే విషయంపై పెద్దగా దృష్టి పెట్టరు. కథతో సంబంధం లేకుండా కేవలం స్టార్ ఈమేజ్ తోనే నిర్మిస్తున్న పెద్ద సినిమాలు బడ్జెట్ కు తగ్గ కలెక్షన్లు రాబట్టలేక చతికిలబడుతున్నాయి. టాలీవుడ్ లో దాదాపు ఇలాంటి పరిస్థితే ఉంది. కానీ ఈ ట్రెండ్ ను బాలీవుడ్ మార్చింది. కథకు ప్రాధాన్యమిస్తూ.. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన చిన్న సినిమాలు కలెక్షన్లను రాబట్టడంలో విజయం సాధిస్తున్నాయి. స్టార్ వాల్యూ కంటే కథకే ప్రేక్షకులు ప్రాధాన్యత ఇస్తారని నిరూపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు బాలీవుడ్ లో చిన్న సినిమాల హవా నడుస్తోంది. ఏ విషయంలోనూ తాము తక్కువ కాదని పెద్ద సినిమాలకు గట్టి పోటీ ఇస్తున్నాయి. తక్కువ బడ్జెట్ తో విడుదలై.. భారీ కలెక్షన్లు వసూలు చేసిన చిన్న సినిమాలు ఏంటీ..? అవి ఎంత కలెక్ట్ చేశాయనే విషయం ఈ రోజు మన ట్రెండ్ గురులో తెలుసుకుందాం...
తక్కువ బడ్జెట్ భారీ కలెక్షన్స్..
'ఆషికి-2 '.. హయ్యెస్ట్ కలెక్షన్లతో బాలీవుడ్ సినీజనాన్ని ఆకర్షించిన సినిమా. సూపర్ హిట్ ఫిల్మ్ 'ఆషికి' సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఆషికి-2.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. 'ఆదిత్యారాయ్ కపూర్', 'శ్రద్దా కపూర్' జంటగా నటించిన ఈ సినిమా డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో సూపర్ హిట్ అయ్యింది. కేవలం 'రూ.12కోట్ల'తో నిర్మించిన ఆషికి-2.. రూ.'85.5 కోట్ల కలెక్షన్లు సాధించి టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయ్యింది. నిర్మాణవ్యయం కంటే '7రెట్లు' వసూళ్లు సాధించింది.
దీనితో పాటు డాన్స్ బ్యాక్ డ్రాప్ తో వచ్చి బంపర్ హిట్ కొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ అవి కలెక్షన్ల పరంగా మాత్రం వెనకబడిపోయాయి. వాటన్నింటికి భిన్నంగా కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమా 'ఎబిసిడి'..'ఎనీ బడీ కెన్ డ్యాన్స్' ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈసినిమా.. బడ్జెట్ తో సంబంధం లేకుండా.. పక్కా స్టోరీ, స్క్రీన్ ప్లే ఉంటే చాలా ఏ సినిమా అయినా హిట్ అవుతుందని నిరూపించింది. 'ఇండియన్ మైకెల్ జాక్సన్' ప్రభుదేవా హీరో గా చేసిన 'ఎబిసిడి' ప్రాఫిట్స్ లో బ్రేక్ డ్యాన్స్ చేసింది. చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించలేవు అనే మాటలను బ్రేక్ చేసి బడ్జెట్ కి 4రెట్లు లాభం సాధించింది. రూ.12కోట్ల నిర్మాణ వ్యయంతో నిర్మించిన ఈ సినిమా 'రూ.46కోట్ల కలెక్షన్లు సాధించింది. సుమారు 283శాతం లాభాన్ని సంపాదించింది.
స్టార్ క్యాస్టింగ్ తో సంబంధం లేకుండా కేవలం స్టోరీ బేస్డ్ గా వచ్చి హిట్ అయిన మరో సినిమా 'ఫక్రే'. కేవలం రూ.11కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం 3రెట్ల లాభంతో రూ.36.5 కోట్ల కలెక్షన్లు సాధించగలిగింది. 232లాభ శాతంతో లో బడ్జెట్ తో హై ప్రాఫిట్స్ సాధించి చిన్న సినిమాలకు సక్సెస్ మార్గాన్ని చూపింది. బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన సినిమా 'మర్డర్'. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ఎన్ని సీక్వెల్స్ చేసినా బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ కొడుతూనే ఉంది. రీసెంట్ గా మూడవ సీక్వెల్ తో 'మర్డర్-3'గా వచ్చి కలెక్షన్ల తో నిర్మాతకు కాసులవర్షం కురిపించింది. కేవలం రూ. 7కోట్ల నిర్మాణ వ్యయంతో నిర్మించిన ఈ సినిమా 3రెట్ల లాభంతో 20కోట్ల కలెక్షన్లు రాబట్టింది.
అదే బాటలో 'జాలీ ఎల్.ఎల్. బి', 'షూట్ అవుట్ ఎట్ వాదాలా', 'కై పో చె', ఛష్మే బద్దూర్' వంటి సినిమాలు బాలీవుడ్ లో దూసుకుపోతున్నాయి. వీటిలో జాలీ ఎల్.ఎల్.బి సినిమా రూ. 12కోట్ల బడ్జెట్ తో నిర్మితమై.. 32కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. మరోవైపు 'షూట్ అవుట్ ఎట్ వాదాలా' సినిమా రూ.26కోట్ల వ్యయంతో తెరకెక్కి రెండున్నర రెట్ల లాభంతో రూ.62కోట్లు వసూలు చేసింది. 'జాన్ అబ్రహం', 'అనిల్ కపూర్', 'కంగనారనౌత్' వంటి స్టార్ క్యాస్టింగ్ కి పక్కా స్టోరీ, స్క్రీన్ ప్లే తోడవడంతో బంపర్ హిట్ కొట్టింది ఈ 'షూట్ అవుట్ ఎట్ వాదాలా'. దీనికి తోడు.. రూ.25కోట్ల బడ్జెట్ తో నిర్మించిన 'కై పో చె' సినిమా డబుల్ కలెక్షన్లతో తన సత్తా చాటింది. స్టార్ క్యాస్టింగ్ తో సంబంధం లేకుండా సూపర్ హిట్ అయిన మరో సినిమా 'ఛష్మే బద్దూర్'. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. రూ.20కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కి..రూ. 40కోట్ల కలెక్షన్లు సంపాధించింది.
కేవల మూడు పెద్ద సినిమాలే అదరగొట్టాయి..
'చెన్నయ్ ఎక్స్ ప్రెస్'.. బాలీవుడ్ రికార్డులను తిరగరాసిన సినిమా. కేవలం 3వారాల్లోనే రూ. 220కోట్ల కలెక్షన్లు సాధించి.. వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో ఓ సంచలనంగా నిలిచింది. అప్పటి వరకూ 'త్రీ ఇడియట్స్' పేరిట ఉన్న 202కోట్ల కలెక్షన్ రికార్డ్ ని అదిగమించింది. రూ. 75కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన 'చెన్నయ్ ఎక్స్ ప్రెస్' 3రెట్ల లాభంతో ఇప్పటి వరకు రూ.220కోట్ల కలెక్షన్లు సాధించింది. ఇక మాజీ లవర్స్ 'రణ్ బీర్ కపూర్', 'దీపికా పదుకొనే' మళ్లీ కలిసి చేసిన సినిమా 'యే జవానీ హై దివానీ'. డిఫరెంట్ స్టోరీ లైన్ తో తెరకెక్కిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టింది. 45కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈచిత్రం రూ.190కోట్ల కలెక్షన్లు చేసి బిలియన్ క్లబ్ లో చేరింది. దాదాపుగా బడ్జెట్ కి నాలుగున్నర రెట్లు లాభాన్ని సాధించింది.
వీటితో పాటు రియల్ స్టోరీ తో తెరకెక్కిన సినిమా 'భాగ్ మిల్కా భాగ్'. ఇండియన్ అథ్లెట్ 'మిల్కాసింగ్' లైఫ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. 'ఫర్హాన్ అక్తర్' మెయిన్ రోల్ ప్లే చేసిన ఈసినిమా కలెక్షన్లలో కూడా పరుగులు పెట్టింది. రూ. 50కోట్లతో నిర్మించిన ఈచిత్రం రూ.104కోట్ల వసూళ్లతో బాలీవుడ్ బిలియన్ క్లబ్ లో చేరింది. ఇక రియల్ స్టోరీ రికార్డ్ కలెక్షన్లు సాధించడంతో బాలీవుడ్ దర్శకనిర్మాతలంతా.. నిజజీవిత కథలపై మక్కువ పెంచుకున్నారని బాలీవుడ్ టాక్.
భారీ బడ్జెట్ మూవీస్ లో కేవలం 3సినిమాలు మాత్రమే రికార్డ్ కలెక్షన్లు సాధించాయి. సినిమా హిట్ అవ్వాలంటే నిర్మాణవ్యయంతో సంబంధం లేదు. మంచి స్టోరీ, పక్కా స్క్రీన్ ప్లే ఉంటే 'లో బడ్జెట్' తో నిర్మించిన చిత్రాలైన భారీ హిట్ అవుతాయని ఈ చిన్న సినిమాలు నిరూపించాయి. ఇక ఈ విజయాలను చూసైనా.. మన టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్లు మైండ్ సెట్ మార్చుకుంటారని ఆశిద్దాం..

No comments:
Post a Comment