Tuesday, September 3, 2013

పోషకాహార వారోత్సవాలు

మనదేశంలో ఒక వైపు వేల, లక్షల కోట్ల సంపాదనతో కుబేరులు ప్రపంచ ధనవంతుల జాబితాలో చేరిపోతుంటే.. మరోవైపు, అన్నార్థులు అర్థాకలితితో అలమటిస్తున్నారు. దేశంలో 80 శాతం మంది ప్రజలు పోషకాహార
లోపంతో బాధపడుతున్నన్నారని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ సమస్య తీవ్రతను గుర్తించి భారత ప్రభుత్వం సెప్టెంబర్ 1నుంచి 7 వరకు పోషకాహార వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మహిళలు, చిన్నారుల్లో పోషకాహార లేమికి కారణాలు? పోషకాహారలేమితో వచ్చే ఆరోగ్య సమస్యలు? వాటి పరిష్కారాలపై మానవి దృష్టి సారించింది. ఆ వివరాలు..
సమతులాహారం..
మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యానికి పునాది. వాటిలో ప్రొటీన్స్, కార్బొహైట్రేట్స్, విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలన్నీ సమతూకంగా ఉంటేనే అది సమతులాహారం అవుతుంది. మనిషి మానసికంగా, శారీరకంగా ఎదిగేందుకు ఇవి అవసరమవుతాయి. ఈ రకమైన సమతుల ఆహారాన్ని తీసుకోలేని స్థితే పోషకాహార లోపానికి దారితీస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో పోషకాహార లోపం సమస్య ఉంది. కానీ.. ఈ సమస్య తీవ్రత మనదేశంలో అధికంగా ఉంది. ఆ జాబితాలో భారత్ ఐదో స్థానంలో ఉంది.
పౌష్ఠికాహార లోపంతో శిశు మరణాలు..
ఉండాల్సిన బరువు కంటే తక్కువ బరువున్న పిల్లలు 40 శాతం ఇండియాలోనే ఉన్నట్లు సర్వేలు చెప్తున్నాయి. ప్రతి ఏటా మన దేశంలో సగం వరకు శిశు మరణాలు పౌష్టికాహార లోపం వల్లే సంభవిస్తున్నాయని తెలుపుతున్నాయి. పౌష్టికాహారలోపంతో బాధపడేవారిలో ప్రపంచలోని ప్రతి ముగ్గురిలో ఒకరు మనదేశానికి చెందిన వారే అని ఈ సర్వేలు తెలిపాయి.
మహిళల్లో సమస్య అధికం..
మహిళల్లో.. పోషకాహార లోపం సమస్య తీవ్రంగా ఉంది. మొత్తం దేశ మహిళల్లో మూడోవంతు తక్కువ బరువుతో ఉన్నారని సర్వే తెలిపింది. 56 శాతం మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. దీనికి కారణం పేదరికం, నిరక్ష్యరాస్యత, అవినీతి. వీటి మూలంగా ప్రజల ఆహారపు అవసరాలు తీరక మహిళలు తీవ్ర పోషకాహార లేమితో బాధపడుతున్నారు. నిరాక్షరాస్యత ఎక్కువగా ఉన్న కుటుంబాలలో పిల్లల్లో పౌష్టికాహార లోపాలు ఎక్కువగా ఉన్నాయి. నిర్లక్ష్యానికి గుర్తుగా బాలికల్లో పౌష్టికాహార లోపాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవలి కాలంలో మహిళలు ఉద్యోగాలు చేస్తూ, ఆరోగ్యం, ఆహారంపై సరైన శ్రద్ధ చూపకపోవడంతో అనారోగ్యం పాలవుతున్నారు. కేవలం పేద, మధ్య తరగతి వర్గాల్లోని మహిళలే కాదు.. సంపన్న కుటుంబాల్లోని మహిళలు కూడా పోషకాహారలేమితో బాధపడుతున్నారు. అందుకే అందరి అవసరాలు తీర్చేందుకు నిరంతరం శ్రమించే మహిళలే పురుషుల కన్నా ఎక్కువ ఆహారం తీసుకోవాలి.
క్రీడాకారిణుల్లో.. ఇటీవలే ప్రపంచ కప్ హాకీలో భారత జూనియర్ మహిళల జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. ఈ జట్టులో ఏడుగురు అమ్మాయిలు పోషకాహార లేమి కారణంగా రక్తహీనతతో బాధపడుతున్నారని మాజీ చీఫ్ కోచ్ మైకెల్ నాబ్స్ వ్యాఖ్యానించారు. పూర్తి ఫిట్ నెస్ తో ఉంటారనుకునే క్రీడాకారిణులు కూడా రక్తహీనతతో బాధపడడం విషాదకరం. ఇలా అనేకమంది పౌష్టికాహార లేమితో బాధపడుతున్నారు.
పథకాలు అనేకం.. లక్ష్యాలు శూన్యం..
పౌష్టికాహార లోపాలను సరిదిద్దడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలుచేస్తున్నాయి. ఐసిడిఎస్, మిడ్ డే మీల్స్, గర్భిణుల, బాలల ఆరోగ్య కార్యక్రమాలను చేపట్టాయి. ప్రభుత్వాలు ఈ పథకాలు అమలు చేస్తున్నా, నిర్దేశించుకున్న లక్ష్యాలకు మాత్రం చేరడం లేదు. స్వాతంత్ర్యం సాధించి ఆరుదశాబ్దాలు దాటినా, ప్రజలకు కనీస ఆహార భద్రతను కల్పించలేని స్థితిలో మన పాలకులున్నారు. ఎన్ని పార్టీలు మారినా, ఎందరు ప్రధానులు మారినా, మెజార్టీ ప్రజల ఆర్థిక స్థితిలో తగిన ప్రగతి సాధ్యపడలేదు. అందుకే 67 సంవత్సరాల స్వతంత్ర పాలనలో ప్రభుత్వం ఆహారభద్రతకోసం చట్టాన్ని చేయాల్సిన అవసరం ఏర్పడింది.
ప్రచార కార్యక్రమాలు...
ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం గత రెండు దశాబ్దాలుగా సెప్టెంబర్ 1 నుండి 7 వరకూ పోషకాహారంపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 1982 నుండి పోషకాహార వారంను మనదేశం జరుపుతోంది. ప్రజల్లో పౌష్టికాహారంపై అవగాహన తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో పోషకాహారంపై అవగాహన తెచ్చే ప్రయత్నం చేస్తోంది.
ఆర్థికాభివృద్ధిపై తీవ్ర ప్రభావం...
పోషకాహార లోపం కేవలం ఆరోగ్యపరమైన సమస్య మాత్రమే కాదు. వ్యక్తి, కుటుంబం, సమాజంపైనా ఇది విస్తృత దుష్ప్రభావాన్ని చూపుతోందని ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొంది. ఈ లోపాలు ఆర్థికాభివృద్ధిని దెబ్బతీసి పేదరికాన్ని పెంచుతాయి. శారీరక శ్రమశక్తిని తగ్గించి సంపాదనా సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. ఫలితంగా ఉత్పాదకత తగ్గిపోతుంది. విద్య, అభివృద్ధిపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. పౌష్టికాహార లోపాలు కేవలం ఆరోగ్య సమస్యలను మాత్రమే సృష్టించవు. వినాశకర సామాజిక, ఆర్థిక పరిణామాలకూ దారితీస్తాయి. అందుకే పౌష్టికాహార సమస్యలకు పరిష్కారం చూపాలి. ప్రభుత్వాలు కేవలం ఆహార భద్రతను కల్పించగానే ఆహార సమస్య, పౌష్టికాహార లేమి సమస్యలకు పరిష్కారాలు దొరకవు. విద్య, వైద్యం, ఉపాధి, సురక్షిత మంచినీరు, అక్షరాస్యత, కొనుగోలు శక్తిని పెంచాలి. అప్పుడే దేశ జనాభాలో సగభాగమైన మహిళల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రేపటి నిర్మాతలైన పిల్లలకు మెరుగైన జీవితాలు లభిస్తాయి.

No comments:

Post a Comment