మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా
సమాజం రోజురోజుకూ మారుతుంది. పాత టెక్నాలజీ స్థానంలో కొత్త టెక్నాలజీ
వచ్చి చేరుతుంది. ఇదే క్రమంలో మీడియా రంగంలోనూ వినూత్న మార్పులు
చోటుచేసుకుంటున్నాయి. పత్రికల స్థానాన్ని డిజిటలైజేషన్, ఆన్‌లైన్,
ఇంటర్నెట్ వంటి కొత్త టెక్నాలజీ ఆక్రమిస్తోంది. దీంతో ప్రింట్ మీడియా
క్రమంగా వెనకపడిపోతుంది. ఇప్పుడు అమెరికాలో ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో
అక్కడ ప్రముఖ పత్రికలు నష్టాలు మూటకట్టుకుంటున్నాయి. ఫలితంగా వాటిని
యజమానులు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది.యువతను ఆకర్షిస్తున్న ఇంటర్నెట్
అమెరికా యువతను ఇంటర్నెట్, డిజిటల్ యుగం ముంచెత్తింది. స్కూల్‌లో పాఠాలు చదవాలన్నా..వార్తలు తెలుసుకోవాలన్నా.. సమాచారం పంపుకోవాలన్నా.. చివరికి ఏదైనా వస్తువు కొనుక్కోవాలన్నా.. అమెరికన్లు ఇంటర్నెట్‌పైనే ఆధారపడుతున్నారు. న్యూస్ ప్రింట్ అవసరం లేకుండానే ప్రజల వద్దకు వార్తలను చేర్చే రోజులొచ్చేశాయి. వార్తా సర్క్యులేషన్ ఆన్‌లైన్‌లోకి మారిపోయింది. న్యూస్ బిజినెస్‌లోని ప్రతి విభాగంలోకి ఇంటర్నెట్ ప్రవేశించింది. వార్తలు అందించడం, ప్రకటనల ద్వారా ఆదాయం సమకూర్చుకోవడం, ఆధునిక పోటీని తట్టుకోవడం, ఖర్చు లేకుండా వార్తలు సేకరించడం.. వంటి పనులన్నీ ఇప్పుడు ఇంటర్నెట్ విజయవంతంగా చేసుకుంటోంది. దీంతో అమెరికాలో పత్రికల మనుగడే ప్రశ్నార్ధకంగా మారింది.
తగ్గుముఖం పట్టిన పత్రికల సర్క్యులేషన్
అమెరికాలో పత్రికల సర్క్యులేషన్ క్రమంగా తగ్గుముఖం పట్టింది. పత్రికలు కొనేవాళ్లు లేక.. వ్యాపార ప్రకటనలు ఇచ్చేవాళ్లు లేక.. ప్రముఖ పత్రికలు నష్టాల పాలవుతున్నాయి. ఫలితంగా అమెరికాలో వారం రోజుల వ్యవధిలో వాషింగ్టన్ పోస్ట్, న్యూస్‌వీక్, బోస్టన్ గ్లోబ్ వంటి మూడు ప్రధాన పత్రికలను యజమానులు అమ్మేశారు. అమెరికా సంస్కృతితో, ప్రజాస్వామ్యంతో విడదీయరాని బంధాన్ని పెనవేసుకున్న వాషింగ్టన్ పోస్ట్ ను అమ్మడం ఆశ్చర్యాన్ని కలిగించింది. న్యూస్‌వీక్ వార పత్రికను రెండేళ్లలో రెండుసార్లు విక్రయించారు.
డిజిటల్‌లోకి మారిన న్యూస్‌వీక్
వార పత్రికగా విజయవంతమైన న్యూస్‌వీక్ ఈ ఏడాది నుంచి డిజిటల్ రూపంలోకి మారింది. భారత్‌లో డిజిటల్ న్యూస్‌వీక్ ధర 247 రూపాయలు ఉంది. ప్రింట్ మీడియాకు చెల్లిస్తున్న ధర కంటే ఇది చాలా ఎక్కువ. అయితే.. డిజిటల్ మ్యాగజైన్ వల్ల అదనపు లాభాలున్నాయి. ప్రింట్ వర్షన్‌లో కవర్‌పై ఫొటోలతో సరిపుచ్చేవారు.. డిజిటల్ మ్యాగజైన్ కవర్ పేజీని వీడియోలో చూడగలం. మొత్తం మీద మల్టీ మీడియాతో వారపత్రిక.. కాస్త కొత్తదనాన్ని సంతరించుకుంది.
భారత్‌లో ప్రింట్ మీడియాకు ప్రమాదం లేదు - నాగేశ్వర్
అయితే.. భారత్‌లో ప్రింట్ మీడియాకు ఇప్పుడప్పుడే కష్టాలు వచ్చే ఛాన్స్ లేదంటున్నారు ఎమ్మెల్సీ నాగేశ్వర్. ఇదే విషయాన్ని ప్రపంచ వార్తా పత్రికల ధోరణులు అనే నివేదికలో వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ సైతం వ్యాఖ్యానించింది. భారతదేశమే కాదు.. చైనా, జపాన్‌లాంటి ఆసియా దేశాల్లో కూడా పత్రికలకు ఢోకాలేదు. కానీ.. యూరోపియన్ పత్రికలు మాత్రం అమెరికా పత్రికల దారి పడుతున్నాయి. మన దేశంలో ఇటర్నెట్ వినియోగం తక్కువగా ఉండటం.. ఇంకా అక్షరాస్యత పెరుగుతూ ఉండటం వల్ల పత్రికలకు ప్రమాదం లేదంటున్నారు నిపుణులు.

No comments:
Post a Comment