Friday, August 30, 2013

'మైకం' కాస్త శోకమైంది'...

   
 'అనుకోకుండా ఒక రోజు', 'మంత్ర' వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలలో నటించి విజయం సాధించిన 'ఛార్మి'... ఈ మధ్య కాలంలో హిట్స్ లేక, హీరోల ప్రక్కన ఛాన్స్ లు లేక పూర్తిగా వెనుకపడింది. అడపా దడపా ఇలాంటి సినిమాలతో తెరపైకి వచ్చినా అవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఉన్నంతలో విభిన్నత చూపాలని .. 'ప్రేమ ఒక మైకం' సినిమా చేసింది. ఇందులో 'ఛార్మి' 'వేశ్య'గా నటించింది. కాని ఈ చిత్రం కూడా ఆమెకు నిరాశే మిగిల్చిందని చెప్పవచ్చు.
     ప్రధాన తారాగణం: ఛార్మి, రాహుల్, శరణ్యం, సోనీ చరిష్టా, సతీష్, చంద్రమోహన్, రావు రమేష్, తాగుబోతు రమేష్, కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: చందు, పాటలు: కులశేఖర్‌, శశి, సంగీతం: ఎస్.ఆర్.పోశం, మాటలు: పులగం.సి.నారాయణ, కెమెరా: ప్రవీణ్‌.కె.బంగారి, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: పి.ప్రతాప్, గీతానంద్‌రెడ్డి, సహనిర్మాత: జితిన్ చక్రవర్తి, సమర్పణ: బేబీ హ్యాపీ.
కథ: మ‌ల్లిక( ఛార్మి) ఒక వేశ్య‌. డ‌బ్బు తీసుకోవ‌డం, తనకు నచ్చిన వారికి 'ఆ.. సుఖం' అందించ‌డం ఆమె వృత్తి. అంతే తప్ప మిగతా ఏ విషయాలపై ఆమెకు ఇష్టం ఉండదు. ఎప్పుడూ మందు బాటిల్ చేతిలో పట్టుకొని మత్తులో జోగుతూ.. మైకంలో ఊగిపోతుంటుంది. తాగిన మైకంలోనే కారు డ్రైవింగ్ చేస్తూ.. ల‌లిత్ (రాహుల్‌)ని యాక్సిడెంట్ చేస్తుంది. ఆ ప్రమాదంలో ల‌లిత్ కి రెండుక‌ళ్లూ పోతాయి. అతన్ని త‌న‌ ఇంటికి తీసుకొస్తుంది. ల‌లిత్ ఓ ర‌చ‌యిత‌. అత‌ని భావాలు, క‌విత‌లూ మ‌ల్లిక‌లో మార్పు తీసుకొస్తాయి. జీవితం అంటే ఇది కాదు, ఇంత‌కు మించి ఏదో ఉందనే విషయం అర్థమ‌వుతుంది. ల‌లిత్ డైరీ ద్వారా అత‌నికి ఓ ప్రేమ క‌థ ఉంద‌ని తెలుసుకొంటుంది. అసలు ల‌లిత్ ప్రేమించింది ఎవరిని? అత‌నికి క‌ళ్లొచ్చాయా? మ‌ల్లిక మ‌నిషిలా మార‌డానికి ఏం చేసింది? అనేదే ఈ సినిమా క‌థ‌.
రివ్యూ: సెన్సిబుల్ సినిమాలను అందిస్తాడనే పేరున్న దర్శకుడు 'చందు'. ఈ సారి ఛార్మి గ్లామర్ ను అడ్డుపెట్టుకొని మార్కెట్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేశాడు. సినిమాలో మాటలు, ఛార్మి నటన తప్ప అన్ని విభాగాలు ఫెయిల్ అయ్యాయి. హైటెక్ వేశ్య పాత్రలో ఛార్మి నటన బాగుంది. కానీ రాహుల్, గాయత్రి ల నటన కొంచెం ఇబ్బంది కరంగా ఉంది. ఆర్టిస్ట్ లకు సరిపడా సమయం దొరకలేదనిపించేలా వారి నటన ఉంది. కాని సినిమా రిలీజ్ కి టైమింగ్ కలిసొచ్చింది. ప్రోమోస్ చూసి ఛార్మి క్యారెక్టర్ ని ఎక్కువుగా ఊహించిన వారికి అది కేవలం మార్కెటింగ్ ట్రిక్ అని సినిమా మొదలైన కొద్ది సేపటికే అర్థం అవుతుంది. అప్పటినుండి మొదలైన తలనొప్పి ప్రతి నిమిషానికి పెరుగుతూనే ఉంటుంది. పదినిమిషాలకొకసారి స్ర్కీన్ కలర్ మారుతూ సినిమా అంతా అతుకుల బొంతలా వుంటుంది. టెక్నికల్ పార్ట్ వదిలి కంటెంట్ విషయానికి వస్తే అది కూడా చాలా నీరసంగా వుంటుంది. చివర్లో ప్రేక్షకులను ఏడిపించడం అందరికీ ఇబ్బందిగా మారింది.
ప్లస్ లు, మైనస్ లు: 'నేను రాసే రాతలు కాదు తల రాత బాగుండాలి. మనిషికి కళ్లు లేకుండా, నోరు లేకుండా ఆఖరికి అవయవాలు లేకుండా పుట్టోచ్చు కాని మనసు లేకుండా పుట్టడు.' రాహుల్ పలికే డైలాగ్స్ బాగున్నాయి. ఛార్మికి, రాహుల్ కి మధ్య వచ్చే సన్నివేశాలలో కొన్ని బాగున్నాయి. ప్రథామార్థంలో వచ్చే ‘స్వచ్చమైన ప్రేమ..' అనే పాట పరవాలేదనిపించింది. కాకపోతే అదీ ఆ సమయంలో కరెక్ట్ కాదనిపిస్తోంది. సినిమా అంతా స్లోగా నడుస్తుంటుంది. ఫస్టాఫ్ లో ఓ అరగంట కట్ చేస్తే ప్రేక్షకులకు కాస్త రిలీప్ గా ఉండేది. ఎంటర్ టైన్ మెంట్ కు అవకాశమే లేదు. డైరక్టర్ గా 'చందు' చేసిన కామెడీ సీన్స్ అదిరిపోయాయి. నిర్మాత సురేష్ కొండేటి, సింగర్ శ్రీకృష్ణ కూడా ప్రీ ఇంటర్వెల్ సీన్స్ లో కనపడి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తారు. ఇక ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా చాలా ఫూర్ గా ఉన్నాయి. పరిణితి లేని నటుల పేలవమైన హావభావాలతో నటించారు. దీనితో ఈ సినిమా చూసే ప్రేక్షకుడు ఇబ్బంది పడుతాడు. తాగుబోతు రమేష్ చేసిన నాలుగు సన్నివేశాలు సినిమా చూసే వారికి పెద్ద రిలీఫ్ అని చెప్పవచ్చు. మొత్తానికి టైమింగ్ కలిసొచ్చి ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ప్రేమ ఒక మైకం' మాత్రం ప్రేక్షకులకు నరకం చూపించిదని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకు '10టివి' ఇచ్చే రేటింగ్.. 1/5.

No comments:

Post a Comment