'టాలీవుడ్'.. తెలుగు చిత్రం పరిశ్రమకు దక్షిణాదిలో దీనికి ప్రత్యేక స్థానం. ఎంతో మంది స్టార్ హీరోలను తీర్చిదిద్దిన ఘనత దీనికే చెందుతుంది. నాటి ఎన్టీఆర్ నుంచి నేటి ఎన్టీఆర్ వరకు దమ్మున్న హీరోలు వచ్చారు..వస్తూనే ఉన్నారు. అయితే వీరిలో ప్రస్తుతం బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ లు టాప్ హీరోలుగా ఉన్నారు. వీరు ఏది చేసినా చిత్ర పరిశ్రమలో సెన్షేషన్ అవుతోంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో వీళ్ళు తీసిందే సినిమా. వీరు పంచ్ లు వేస్తే ప్రేక్షకులకు అదే పెద్ద భాగ్యంగా ఫీలవుతున్నారు. వాళ్ళు డాన్సులు చేస్తే పులకరించిపోతున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలానే 'పాత చింత కాయ పచ్చడి ఫార్ములా' చిత్రాలను ప్రేక్షకులపై రుద్దేస్తున్నా .. అబ్బో మా హీరో సూపర్ అంటూ చూస్తున్నారు. అంతేగానీ సినిమాలో దమ్ముందా.. నటుల్లో టాలెంట్ ఉందా.. ఈ తరం ప్రేక్షకులు వారినే కోరుకుంటున్నారా..కొత్తగా ఇంకేం అవసరం లేదా.. అనేది ఇప్పుడు టాలీవుడ్ తేల్చుకోవాల్సిన అంశాలు.
కొత్తదనం టాలీవుడ్ 'స్టార్ హీరో'లు..
'అవే సినిమాలు.. అవే కథలు.. అదే హీరో .. ఇక మారారా..!' ఈ డైలాగ్ ను ఏకంగా సూపర్ స్టార్ మహేష్ తన సినిమాలో వాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కానీ టాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఎందుకు మార్చడం లేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. వినోదంలో కొత్తదనం కొరవడితే బోర్ కొట్టేస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ పరిస్థితి అదే. అందుకే స్టార్ హీరోల సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి. అయితే దీనిలో వారసత్వంగా వస్తోన్న హీరోలే ఎక్కువగా ఉన్నారు. కొత్తవారికి అవకాశాలు ఇవ్వకపోవడమే ప్రధాన కారణం. దీంతో కొత్త దర్శకులు లేకపోవడం, కొత్త ఆలోచనలు రావడం లేదు. అలాగే కొత్త హీరోలకు అవకాశాలు ఇవ్వకపోవడంతో నటుల్లో కొత్తదనం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని అంశాల్లో ఇదే దోరణి కనిపిస్తోంది. దీంతో ఎంత పెద్ద స్టార్ హీరో నటించినా.. థియేటర్లలో బోల్తా పడుతున్నాయి. అయితే మన టాలీవుడ్ ను ప్రసుత్తం ఏలుతున్న హీరోల గురించి ఓ సారి చూస్తే..
'పవన్' .... ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో మారుమ్రోగుతోంది. ఈ పేరు మీద కోట్లలో వ్యాపారం జరుగుతోంది . చిరంజీవి సోదరుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పవన్ ఇప్పుడు 'పవర్ స్టార్' అయ్యారు. 'గబ్బర్ సింగ్' హిట్ తరువాత టాలీవుడ్ కి 'పవన్ మేనియా' పట్టేసింది. దీంతో ఇప్పుడు అందరి కళ్ళు అతను నటించిన 'అత్తారింటికి దారేది' సినిమా మీదే ఉన్నాయి. ఇదే కోవలోకి మెగా ఫ్యామిలి హీరో 'రామ్ చరణ్' … ఆ ట్యాగ్ లైన్ తగిలించుకుని వచ్చిన 'అల్లు అర్జున్' ఇప్పుడు స్టార్ హీరోలుగా ఉన్నారు.
'మహేష్'.. సూపర్ స్టార్ 'కృష్ణ' వారసుడిగా ఆ కుటుంబం నుంచి వచ్చిన హీరో. ఇప్పుడు టాలీవుడ్ ప్రిన్స్ అయ్యారు. పోకిరి, దూకుడు ...బిజినెస్ మాన్.. సక్సెస్ తరువాత మహేష్ గ్రాఫ్ పూర్తిగా మారి స్టార్ ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు టాలీవుడ్ లో 'ఏ వన్' హీరోగా కొనసాగుతున్నాడు.
ఇక 'నందమూరి' వంశాంకురాలు.. 'బాలకృష్ణ' ...'జూనియర్ ఎన్టీఆర్' కూడా టాలీవుడ్ వేదిక పై 'సింహ' గర్జనలు చేస్తున్నారు. 'అక్కినేని' వారసుడిగా 'నాగార్జున' ఫీల్డ్ లోకి వచ్చాడు. క్లాసు, మాస్ ప్రేక్షకులను ఆకర్షించి టాలీవుడ్ 'మన్మథుడ'య్యాడు. ఇక నాగ్ సినీ వారసుడిగా 'నాగ చైతన్య' ఎంట్రీ ఇచ్చాడు. మాస్ మీద తన నటనను రుద్దాలని ట్రై చేస్తున్నా.. అదీ వర్క్ అవుట్ కావట్లేదు. 'విక్టరీ వెంకటేష్'.. టాలీవుడ్ లో కాస్తంత టేస్ట్ ఉన్న హీరో. ఎక్కువగా తమిళ్ రీమేక్ ల అపైనే ఆధారపడతాడని పేరుంది. ఫీల్డ్ లోకి వచ్చి పాతికేళ్ళు అయినా ఎప్పడూ.. కొత్త ఫార్మట్లో ట్రై చేస్తుంటాడు. వీరితో పాటు మరో స్టార్ హీరోలలో 'మాస్ రాజా రవితేజ' ఒకరు. కష్టపడి హీరో అయిన రవితేజ ఆ తర్వాత ఆ కష్టం వదిలేశాడు. ఒకే మూస నటన … ఒకే స్టైల్, మాటలతో బోర్ కొట్టిస్తున్నాడు.
స్టార్ హీరోల సినిమాలకు హంగులు ఎక్కువ కావాలి. అందుకే బడ్జెట్ ఎక్కువ పెట్టేస్తున్నారు నిర్మాతలు. ఆ డబ్బు తిరిగి రాబట్టు కోవాలని ఎక్కువ థియేటర్ లలో సినిమా రిలీజ్ చేస్తున్నారు. డబ్బింగ్, రీమేక్,ఆడియో, హక్కుల ద్వారా డబ్బు చేసుకుంటున్నారు. ఎన్ని చేసినా.. స్టార్ హీరో లు కథల విషయంలో మాత్రం చేంజ్ ను కోరుకోవడం లేదు. ఇప్పుడా స్టార్ హీరోల సినిమాలు షెడ్డుకి వెళ్ళే టైం - కొత్త ఫార్ములా సినిమాలు రావాల్సిన సమయం వచ్చేసింది.
ట్రెండ్ ను మార్చి సక్సెస్ రూట్ లో మళయాలీ ఇండస్ట్రీ..
ఒకప్పుడు మళయాలీ సినిమా అనగానే ఆ సూపర్ స్టార్ సినిమాలే ఉండేవి. ఓ ముమ్ముటి, ఓ మోహన్ లాల్, ఓ సురేష్ గోపి, ఇక్కడలానే అక్కడ మూసధోరణి కొనసాగేది. ఇక్కడి లానే అక్కడా ఫార్ములా చిత్రాలు భజన బృందాలు ఉండేవి. ఏళ్ల తరబడి ఒకే ఫార్మాట్ లో స్టార్ హీరోల కలరింగ్ తో సినిమాలు తయారయ్యేవి. కానీ ఇప్పుడు అక్కడ ట్రెండ్ మారింది. ఒకప్పుడు సంవత్సరానికి 50-60 సినిమాలు విడుదలయ్యేవి.ఇప్పుడు 120కి పైగా రిలీజ్ అవుతున్నాయి. తమిళ-హిందీ సినిమాల జోరుకి మళయాలీ సినిమాలు కలెక్షన్లు లేక కుదేలయ్యేవి. కానీ ఇప్పుడు కొత్త దర్శకులు, కొత్త ఆలోచనలు, కొత్త నటులు, కొత్త సినిమాలు మళయాలీ ఇండస్ట్రీని పూర్తిగా మార్చేశాయి. సూపర్ స్టార్ సీజన్ కి చెక్ పెట్టి కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టేశాయి. మళయాలీ సినిమాకు హిట్ ఫార్ములా నేర్పించాయి. ఈ కొత్త సినిమాలు కలెక్షన్ల హవా కొనసాగించాయి. మల్టీ ప్లెక్స్ కల్చర్ ని, కొత్త ఆలోచనలని మోసుకొచ్చి ప్రయోగాలు చేస్తున్నాయి. మూసధోరణిలో సాగే సూపర్ స్టార్ ల సినిమాలకు ట్రెండ్ నేర్పించాయి. దీంతో స్టార్ లు కూడా తగ్గి కొత్త వాళ్లతో కలిసి తక్కువ బడ్జెట్ చిత్రాలు చేసే ప్రక్రియ కూడా మొదలైంది. కొత్త సినిమా కథలు మోడ్రన్ సమాజంలోంచి వస్తున్నాయి. ఒక చిన్న సంఘటన ఒక యాక్సిడెంట్, ఒక వార్త వీటి ఆధారంగా సినిమాలు కొత్తగా నిర్మితమవుతున్నాయి. దీనికి ప్రతిరూపమే 'ట్రాఫిక్', 'చప్పాకురీశ్' సినిమాలు. ఈ సినిమాల్లో హీరో సూపర్ మాన్ కాదు. అన్నీ తానే చేయడు, సమాజంలోని వ్యక్తులే పాత్రలుగా కనిపిస్తారు. హీరోల చుట్టూ కథ నడిచే రోజులుపోయి, జీవన శైలిని ప్రతిబింబించే కథలు సినిమాలు వచ్చేశాయి. మారిన కాలం విలువలు అన్నింటినీ ప్రతిబింబిస్తూ మళయాలీ సినిమా కూడా మారిపోయి మంచి రోజులు తెచ్చుకుంది. టాలీవుడ్ కూడా మలయాళీ మంత్రాన్ని పాటిస్తుందని ఆశిద్దాం. కొత్త ఆలోచనలతో కొత్త భావాలతో సినీ నిర్మాణం జరిగి సూపర్ స్టార్ లు, పవర్ స్టార్ లు తగ్గి కొత్తతరం 'ట్రెండ్' తో కూడిన సినిమాలు రావాలని ఆకాంక్షిద్దాం.

No comments:
Post a Comment