Thursday, August 15, 2013

'నేతాజీ' వివరాలు ఇవ్వడం కుదరదు


ఢిల్లీ: 'నేతాజీ సుభాష్ చంద్ర బోస్' ఈ పేరు వింటేనే భారతీయుల గుండెల్లో ఆవేశం ఉప్పొంగిపోతుంది. స్వాతంత్ర్య సమరంలో ఆయనదో ప్రత్యేక పేజీ. బోస్‌కు సంబంధించిన కొన్ని విషయాలు
ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయాయి. ఆయన మరణం కూడా పెద్ద మిస్టరీగానే మిగిలి పోయింది. తాజాగా నేతాజీ కుటుంబానికి సంబంధించిన వివరాలను బహిర్గత పరచటానికి ప్రధాన మంత్రి కార్యాలయం తిరస్కరించింది. ఆయన గురించి రహస్యాలు బహిర్గతం చేస్తే... అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతింటాయని చెప్పుకొస్తోంది. స్వాతంత్ర్య పోరాట సమయంలో బోస్ అనేక దేశాలతో సంబంధాలు కొనసాగించారని తెలిపింది. వాటిని దృష్టిలో పెట్టుకొనే ఆయన వ్యక్తిగత జీవిత వివరాలు అందించలేమని తేల్చిచెప్పింది.

వ్యక్తిగత వివరాలు కోరిన ఘోష్
సుభాష్‌ చంద్ర బోస్ భార్య, కూతురుకు సంబంధించిన వివరాలివ్వాలని సమాచార హక్కు చట్టం కింద చంద్ర చూడ్‌ ఘోష్ అనే సామాజిక కార్యకర్త కోరారు. ఘోష్ నేతాజీ పేరుతో ఓ వెబ్‌సైట్‌ను నడుపుతున్నారు. నేతాజీ తన భార్య ఎమిలీ, కూతురు అనితా బోస్‌లతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల వివరాలు, మరికొన్ని వ్యక్తిగత ఉత్తరాలను ఇవ్వాలని పి.ఎమ్‌.ఓకి అప్పీల్ చేశారు. దీనికి ప్రధాని కార్యాలయం ససేమిరా అంది. ఈ ఉత్తరాలను బయటపెడితే అంతర్జాతీయంగా సమస్యలు తలెత్తుతాయని, ఇతర దేశాలతో సంబంధాలు దెబ్బతింటాయని తేల్చిచెప్పింది. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 8(1)ఎ కింద ఈ ఉత్తరాలను బయటపెట్టటం కుదరదని ప్రధాని కార్యాలయం డైరెక్టర్‌ స్పష్టం చేశారు. చంద్రచూడ్ ఘోష్ నేతాజీ జీవిత చరిత్రలోని కొన్ని కీలక ఘట్టాలపై పుస్తకం రాస్తున్నారు. అందుకు గాను కొన్ని వ్యక్తిగత వివరాలను ఆయన పిఎమ్‌ఓని కోరారు. నేతాజీ మరణం కూడా మిస్టరీగా మారటంతో.. దానిపై కొంత సమాచారాన్ని కోరారు. ఆయన వ్యక్తిగత జీవితానికి చెందిన చాలా ఫైల్స్ ప్రభుత్వం దగ్గర ఉన్నట్టు ఘోష్ తెలిపారు. ప్రధాని కార్యాలయంలో బోస్‌కి సంబంధించి33 రహస్య ఫైల్స్ ఉన్నట్టు సమాచారం. ఈ విషయాన్ని గతంలో ప్రధాని కార్యాలయమే స్పష్టం చేసింది. బ్రిటీష్ వారి గృహ నిర్బంధంలో ఉండగా... 1941లో బోస్ తప్పించుకున్నారు. జపాన్ సహాయంతో ఇండియన్ నేషనల్ ఆర్మీని నెలకొల్పారు. ఎవరికి అంతుపట్టని రీతిలో 1945లో అదృశ్యమయ్యారు. అప్పటి నుంచి ఆయన మరణ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. 

No comments:

Post a Comment