Friday, July 6, 2012

మ్మకమే జీవితం?


భర్తతో జీవితాంతం కలిసి నడవడానికి సిద్ధపడ్డ భార్య అతనే తన లోకమనుకుంటుంది. తానెంతగా ఆరాధిస్తుందో భర్తా తనను అంతే ప్రేమించాలని కోరుకుంటుంది. అతన్ని ఎంత మదినిండా నింపుకుంటుందో,................
అంతే ఇదిగా అతని హృదయంలో తానే కొలువుండాలని భావిస్తుంది. భర్త తనకు మాత్రమే సొంతమనే నమ్మకమే జీవితంగా బతుకుతుంది. ఈ నమ్మకమే ఊపిరిగా బతికే ఇల్లాలు అది తన భ్రమ మాత్రమేనని, తనదనుకున్న చోట మరొకరికీ స్థానముందని తెలిస్తే ఆమె మనసు విరిగిపోతుంది. దీప ఇప్పుడలాంటి స్థితిలోనే ఉంది.

దీప చూడచక్కని అమ్మాయి. చదువులోనూ అంతే ముందుండేది. మధ్య తరగతి కుటుంబం కావడంతో ఆమె తండ్రి కూతురి పెళ్లి గురించే ఆలోచించేవాడు. మరిన్ని చదువులు చదివి ఎన్నో మెట్లు అధిగమించాలని ఆశించే దీప ఆశను పెద్దగా పట్టించుకునేవాడు కాదు. మార్కులు, ర్యాంకులతో ప్రమేయంలేకుండా మామూలు డిగ్రీ చేయమన్నాడు. ఎందుకని ప్రశ్నించిన దీపకు ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ కట్నం ఇవ్వాలనే లెక్కలు చెప్పాడు. అదంతా నావల్ల అయ్యే పనికాదని, మళ్లీ మాట్లాడితే డిగ్రీ కాకుండానే పెళ్లి చేసేస్తానని గీతగీశాడు. మరో ఆలోచనలేకుండా దీప డిగ్రీ చేసింది. చదువు పూర్తయ్యీ పూర్తవగానే దీపకు సంబంధం కుదిర్చాడు ఆమె తండ్రి. దీప అభిప్రాయంతో ప్రమేయంలేకుండానే!
సర్దుకుపోవడంలోనే సుఖం చూసుకోవడం దీపకు చిన్ననాటినుండీ అలవాటైపోయింది. అందుకే, దీప మౌనమే అంగీకారంగా పెళ్లిపీటలపై కూర్చుంది. రాబోయే రోజులు వర్ణరంజితంగా ఉంటాయని, మనోవల్లభునితో కాలం మనోజ్ఞంగా ఉంటుందనీ, తన భవిష్యత్తు ఇక పూలబాటేనని కలలు కంటూ మధుకు భార్యగా మారింది. మధు చిటికెన వేలు పట్టుకుని అత్తవారింట అడుగిడింది. ఊహలకు తగ్గట్లుగానే మధు ప్రవర్తించాడు. దీపను ప్రేమగా చూసుకున్నాడు. దీపకు సరికొత్త లోకాలను చూపించాడు. కొత్తకాపురం తాలూకు మధురిమలు ఆస్వాదించడంలో మధు, దీప కాలాన్ని మర్చిపోయారు. అలాగే దీపకు ఒక బాబు పుట్టాడు. తరువాత దీప మరోసారి గర్భందాల్చింది.
ఆ సమయంలోనే దీప అప్పటిదాకా తెలియని మాటలు, ఏ స్త్రీ వినడానికి ఇష్టపడని మాటలు భర్తనోట వినసాగింది. మధు కొత్తగా ఎవరో అమ్మాయి గురించి మాట్లాడటం మొదలెట్టాడు. మామూలుగా కాదు, వర్ణించడం మొదలెట్టాడు. దీపకు ఆ మాటలు కంపరాన్ని కలిగిస్తాయని తెలిసినా ఆపేవాడు కాదు. పైపెచ్చు, ఆ అమ్మాయి భర్త గురించి అసభ్యంగా మాట్లాడేవాడు. అతను సంసార జీవితానికి పనికిరాడనీ... ఆ అమ్మాయి జీవితంపై విరక్తితో గడిపేదనీ, తనతో పరిచయం అయ్యాక ఎంతో ఉత్సాహంగా ఉంటోందనీ, నేనంటే చచ్చేంత ఇష్టమనీ... ఇలా చెప్పుకుంటూ పోయేవాడు. ఒకరోజు కొత్త షర్టు వేసుకొచ్చి ఆ అమ్మాయి ఎంతో ప్రేమతో చొక్కా కొనిచ్చిందని చెప్పాడు. నేను లేకుంటే ఆమె బతకదని చెప్పుకుంటూ పోయాడు. వేరే అమ్మాయితో సంబంధం ఉండటమే కాకుండా... ఆ అమ్మాయిని తనముందే పొగడటం దీపకు చిరాకు తెప్పించింది. తనకు గుండెల్లో గునపాలు గుచ్చే మాటలు ఎలా వింటుంది. ఏమని స్పందిస్తుంది? అందుకే బాబును తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.
దీప తల్లి తన కూతుర్ని సముదాయించింది. దీపకు ఒక బాబు, మరో బిడ్డ పుట్టబోతున్నారు. కనుక సంసారం చక్కదిద్దుకోవడం అవసరం. మధు బుద్ధి మారితే అన్నీ చక్కబడతాయి. ఇందుకు 'ఐద్వా లీగల్‌సెల్‌'కు వెళ్దామని దీప తల్లి అంది. అనడం కాదు, దీపను తీసుకుని 'ఐద్వా లీగల్‌సెల్‌'కు వచ్చింది. సభ్యులు మధును పిలుస్తూ ఉత్తరం పంపారు. అయినా మధు రాలేదు. కారణమేంటని మధుకు ఫోన్‌చేశారు. అది స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దాంతో సభ్యులు మధు తల్లిదండ్రులకు ఫోన్‌చేశారు. కొడుకు నల్గొండ వెళ్లాడని, వచ్చేవారం తప్పకుండా వస్తామని వాళ్లు చెప్పారు. అప్పుడు సభ్యులు, 'మీ మాటలు విశ్వసిస్తున్నాం. వచ్చేవారం తప్పకుండా రండి' అన్నారు. ఆపైవారం మధును తీసుకుని అతని తల్లిదండ్రులు వచ్చారు. సభ్యులు మధుతో సంయమనంగా మాట్లాడారు. వివాహేతర సంబంధాలు ఎప్పటికైనా ప్రమాదకరమేనని కొన్ని ఉదాహరణలు చెప్పారు. మధులో తప్పు చేస్తున్నాననే ఆలోచన మొదలైంది. సరైన ఆలోచన ఒకసారి మనసులో మొలకెత్తితే, అది మార్పుకే దారితీస్తుందని అనేకసార్లు నిరూపితమైంది. నేడు మధు ప్రవర్తన ఎంతో బాగుంది. ఎంతంటే, దీప జరిగినదంతా మరిచిపోయేంతగా!

No comments:

Post a Comment