అనురాగం,
అభిమానం మా చెడ్డవి. ఈరెండూ కలబోసుకున్న వ్యక్తితో జీవితాంతం కలిసి
బతకాలనుకోవడం సహజం. ఆ వ్యక్తే సమస్తం.........................
రఘును
కదిలిస్తే కన్నీళ్లే సమాధానాలవుతాయి. 'ఐద్వా లీగల్‌సెల్' ముంగిట
అతనున్నాడు. బయట రోడ్డువైపే ఆత్రంగా చూస్తున్నాడు. అలికిడి వినిపిస్తే
చాలు, అతని కళ్లు మాధవికోసం అన్వేషిస్తున్నాయి. ఆ వచ్చింది మాధవి కాదని
తెలిసిన మరుక్షణం అవే కళ్లు నిర్వేదంగా మారుతున్నాయి. అతని పక్కనే ఉన్న
బాబు, 'అమ్మ ఇంకెప్పుడొస్తుంది నాన్నా' అని ఆరాటంగా ప్రశ్నిస్తున్నాడు. ఆ
బాబుకే కాదు, రఘు తన మనసునూ సర్దిచెప్పుకోలేకపోతున్నాడు.
దీనంతటివెనుకా
జరిగింది ఏమిటంటే... రఘు చూడచక్కని కుర్రాడు. చదువు, ఉద్యోగం అన్నిటా
రాణిస్తున్న యువకుడు. ఇక సంబంధాలు రావడం ఎంతసేపు? బంధుమిత్రులు,
పరిచయస్తులు అందరూ రఘును ఆ దృష్టితోనే చూశారు. అయితే, రఘు తన
తల్లిదండ్రులతో ఒకటే మాట చెప్పాడు. మనది ఉమ్మడికాపురం కనుక వచ్చే అమ్మాయి
మనతో కలిసిపోవాలి. అహంకారం, భేషజాలు అసలే కూడదు. తర్వాత కాదూ కూడదంటే
కుదరదని చెప్పమన్నాడు. అంగీకరించిన మాధవిని మనసారా తన జీవితంలోకి
ఆహ్వానించాడు.
కానీ, వచ్చాక తెలిసింది మాధవి మాటలకూ, చేతలకూ
పొంతనే లేదని! మాధవికి ఉమ్మడికాపురమంటేనే పడదు. దంపతులిద్దరూ ఉంటేనే అది
కాపురమనీ... అప్పుడే మధురానుభూతులన్నీ సొంతం చేసుకోవచ్చనేది ఆమె
గాఢాభిప్రాయం. పెళ్లికి ముందు ఇలాగే ఊహించుకుంది. అయితే, తల్లిదండ్రులు
సర్దిచెప్పడంతో ఈ పెళ్లికి అంగీకరించింది. పెళ్లయితే చేసుకుంది కానీ,
అందరితో కలవలేకపోతోంది. అత్తింటివారు ఎంతగా ప్రయత్నిస్తున్నా మాధవి అందుకు
ఆస్కారమివ్వడంలేదు. తనచుట్టూ ఒక గిరి గీసుకుని అందులోనే ఉంటోంది.
అయినా,
రఘు విసిగిపోలేదు. తన భార్యను సంతోషంగా ఉంచడానికి ఏం చేయాలో అవన్నీ
చేశాడు. సరదాలు, సంతోషాలకు ఏలోటూ రానీయలేదు. భార్య చిరాకులు, పరాకులను
పట్టించుకోలేదు. భార్యను యధాశక్తి ఆనందంగా ఉండేలా చేయడమే తన
కర్తవ్యమనుకున్నాడు. అందుకు అనునిత్యం కృషిచేశాడు. రఘుకు మాధవి అసంతృప్తి
వెనుక కారణమేంటో చూచాయగా అర్థమైంది. భార్య తనను అర్థంచేసుకోవాలనీ... తనకు
సహకరించాలనేది రఘు కోరిక. కానీ, మాధవి అందుకు సిద్ధంగా లేదు. ఇక రఘు తల్లి
కోడల్ని ఎన్నడూ ఓమాట అన్నది లేదు. తన దారిన తను పని చేసుకుపోయేది తప్ప
నువ్వెందుకు చేయవని ఎన్నడూ అనలేదు. ఇక రఘు తల్లి కొడుకుతో ఇలా కలిసి ఉండే
కంటే విడిగా వెళ్లి సంతోషంగా జీవించమంది. అందుకు రఘు ఒప్పుకోలేదు.
ఒక్కగానొక్క కొడుకునయ్యుండీ బాధ్యతలను విస్మరించడమంటే మనిషిగా తన జన్మ
వ్యర్థమన్నాడు.
ఇటు రఘుకు, మాధవికి ఒక బాబు పుట్టాడు. కానీ,
మాధవి తన మంకుపట్టు వీడలేదు. మనుమడి బాగోగులన్నీ రఘు తల్లి చూసేది. అయినా
మాధవి మనసు కరగలేదు. విడికాపురానికి ఒప్పుకోమని భర్తను విసిగించింది. నా
నిర్ణయం మారదన్న రఘుపై మాధవికి పట్టరానంత కోపంవచ్చింది. విడిగా ఇల్లు
తీసుకునేంతవరకూ తిరిగి రానంటూ బిడ్డను వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది.
రఘు
తన అత్తగారింటికి వెళ్లాడు. ఇది పద్ధతికాదని మాధవికి నచ్చచెప్పబోయాడు.
మీరైనా చెప్పమంటూ అత్తగారిని అర్థించాడు. కానీ ఎవరూ రఘు మాటలను
పట్టించుకోలేదు. ఇక ఏమీ చేయలేని రఘు, 'ఐద్వా లీగల్‌సెల్'కు వచ్చాడు. తన
భార్యకు నచ్చచెప్పమని కోరాడు. అతని ఎదురుచూపులు ఫలించి చివరికి మాధవి
వచ్చింది. సభ్యులు మాధవితో మాట్లాడారు. రఘులో, అతని తల్లిదండ్రుల్లో
కనిపించే చెడు లక్షణాలు చెప్పమన్నారు. వారితో నువ్వు పడుతున్న ఇబ్బందులు
చెప్పమన్నారు. పుట్టింటినుండి ఏమేం తీసుకురమ్మని ఆరళ్లు పెడుతున్నారో
వివరింపమన్నారు. మాధవి ఆశ్చర్యపోయింది. తనకెన్నడూ అలాంటి సమస్యలు లేవు.
ఇవికాక అక్కడే ఉన్న ఇతరుల సమస్యలుసైతం మాధవి గమనించింది. ప్రపంచంలో తనదే
పెద్ద సమస్యని మాధవి అభిప్రాయం. అందుకు భిన్నంగా ఇక్కడివారితో పోల్చితే
అసలు తనది సమస్య కానేకాదు.
అంటే, ఇన్నాళ్లూ భ్రమల్లో కూరుకుపోయి
వాస్తవాలను విస్మరించింది. సజావుగా సాగుతున్న జీవితాన్ని నరకప్రాయం
చేసుకుంది అన్న నిజాన్ని మాధవి గ్రహించింది. వాస్తవాలు ఎదురుగా
కనిపిస్తుంటే అంగీకరించడం ఎంతసేపు?! మాధవి ముఖంలో పశ్చాత్తాపం కనిపించింది.
అకారణంగా రఘును మానసికక్షోభకు గురిచేసిన తనను తానే తిట్టుకుంది. ఇకపై
ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు పునరావృతం కావని మనస్ఫూర్తిగా రఘుకు చెప్పింది.
పసివాడిని గుండెలకు హత్తుకుంది. భర్త చేయిపట్టి 'తన' ఇంటివైపు
అడుగులేసింది.
No comments:
Post a Comment