ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సరాది.
ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకునే సందడి నిన్నటినుంచే ప్రారంభమైంది...................................
అంతా బాగుండాలని, సుఖసంతోషాలతో విలసిల్లాలని, ఈ సంవత్సరమంతా కష్టనష్టాల్లేకుండా గడపాలని ప్రతి ఒక్కరం మనసారా కోరుకున్నాం. నిన్నటికీ, ఈరోజుకీ తేడా కేలండరు మారటం తప్ప మరేదీ లేదని మనకు తెలుసు. అయినా సరే... ఏదో ఆశ..! ఒక అలవాటుగా మారిపోయిన తమాషా..!! కుటుంబ సభ్యుల మధ్యా, స్నేహితుల మధ్యా, శ్రేయోభిలాషుల మధ్యా ఇలాంటి ఆశలూ, ఆకాంక్షలూ ఎప్పుడూ ఉంటాయి. చదువూ కొలువూ, ఆర్థికం ఆరోగ్యం, కుటుంబం సమాజం ... ఇలా అన్నింటా రాణించాలనే కోరిక ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఇది సహజం. అవసరం కూడా!మనకు మనం చెప్పుకునే శుభాకాంక్షలు వట్టి మాటలతోనో.. కాకపోతే- గ్రీటింగ్ కార్డుతోనో, పూలగుత్తితోనో ఉంటాయి. మహా అయితే రెండు ఆపిళ్లూ, నాలుగు స్వీట్లతో జత పడి ఉంటాయి!! మన ప్రధానీ, ముఖ్యమంత్రీ మాత్రం అందుకు భిన్నంగా శుభాకాంక్షలు చెప్పదలిచారు. మన్మోహన్ సింగు పెట్రో ధరలు పెంచి స్వాగతం చెబుతుంటే- కిరణ్‌కుమార్ కరెంటు షాకిచ్చి- శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆ వెనకే ఇతరత్రా వడ్డనలూ వాయింపులూ ఉండనే ఉంటాయి. ఈ ఏడాదంతా ఇలాగే ఉంటుందని, ఉండాలని వారి ఆకాంక్ష అన్నమాట!
శుభాకాంక్షలు చెప్పిన వారికి 'సేమ్ టూ యూ' అని తిరిగి చెప్పటం మన కనీస బాధ్యత. ఎలా చెప్పిన వారికి అలాగే చెప్పటం మన సాంప్రదాయం కూడా! గతంలోనూ ఇలాంటి అనుభవాలు మనకు ఉన్నాయి. మర్చిపోతే చరిత్రను అడగొచ్చు. అంత శ్రమెందుకు అనుకుంటే- ఏ 'బాబు'ను అడిగినా చెబుతాడు... 'భారాలు' మోపిన వారికి బదులివ్వడం, 'ఛార్జీలు' పెంచిన వారికి సేమ్ టు యు అని జనం తేలిగ్గా వదిలెయ్యరు కదా. ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడు, కాని వారిచ్చే సందేశం మాత్రం కచ్చితంగా డిఫరెంట్.
No comments:
Post a Comment