ప్రణయ కలహం. ఆ మాట వింటేనే మధురోహలు మదిలో కదలాడతాయి. ఆలుమగల మధ్య చిలిపి తగాదాలు, చిరు అలకలు... వారి బంధం మరింత బిగుసుకోవడానికే. తిరిగి ఒక్కటయ్యాక ఆ జగడం తాలూకు గురుతులు ఆ దంపతులకు ఆహ్లాదాన్ని పంచిపెడతాయి................కొత్తకాపురంలోని ముచ్చట్లూ, మురిపాలూ ప్రీతిపాత్రంగా ఏరుకోవడంలో ఆ జంట బిజీ బిజీ! చెప్పాలంటే, రోజుకు ఇరవైనాలుగు గంటలే ఎందుకున్నాయని వారిద్దరికీ మహా చిరాకొచ్చేసేది కూడా! వారిద్దరి మధ్యా దగ్గరితనం పెరిగింది. ఒకరి అభిప్రాయాలు మరొకరు స్వేచ్ఛగా పంచుకోవడమూ పెరిగింది. అప్పుడప్పుడూ మేమున్నామంటూ వారిద్దరిమధ్యకూ వచ్చేవి ప్రణయ కలహాలు! ఇందులో ఒకరు అలగడం, మరొకరు బతిమలాడటం పరిపాటి! అదే జరుగుతోంది కూడా! ప్రత్యేకంగా కారణంలేని అలకలవి! ఉదాహరణకు సమయానికి వస్తానని రాకపోవడం పవన్ చేసే ఘోర తప్పిదమైతే, ఏదో చెబితే అది కాదని మరోటి చేయడం రమణి నేరం! అయితే, కోరచూపులు, కొంటె బాణాల మధ్య ఒకరోజులోనే అలకలు తోకముడిచేవి. రాను రాను అలా కాలేదు. నేనే ఎందుకు బతిమాలాలి? నేనే ఎందుకు తగ్గాలి? అన్న డైలమాలు పెరిగాయి. ఆ డైలమాలు స్థిరాభిప్రాయాలయ్యాయి. ఫలితం, రోజుల తరబడి ఎడమొహం, పెడమొహం సూత్రం వారిద్దరి మధ్యా దేదీప్యమానంగా వర్థిల్లింది. దానివల్ల ఇద్దరికీ సుఖమూ లేదు, సంతోషమూ లేదు. సరికదా, చిరాకులు, పరాకులు! ఇలా ఎంతకని?!
ఇలా ఎంతకాలమన్న ఆలోచన ఆ భార్యాభర్తలకన్నా ముందు వారి తల్లిదండ్రులకు వచ్చింది. నచ్చచెప్పి చూశారు. అయితే, పంతం, పౌరుషం ముందు వివేకం చిన్నబోయింది. మరేంచేయలేక పెద్దల మనసులు చిన్నబుచ్చుకున్నాయి. మనకంటే ఇతరులైతే, ఎలాంటి మొహమాటాలు లేకుండా మాట్లాడతారనే ఆలోచన వారికి అప్పుడే వచ్చింది. తప్పుల్ని విశ్లేషిస్తూ ఇద్దరి మధ్యా సమన్వయం చెప్పగలవారు 'ఐద్వా లీగల్‌సెల్' అన్న ఐడియా వచ్చింది. వచ్చిందే తడవు వారు 'ఐద్వా లీగల్‌సెల్'కు వచ్చారు. ఇదీ సంగతని చెప్పారు. మా పిల్లల మధ్య చోటుచేసుకున్న మనస్పర్థలు తొలగించమని కోరారు.
సభ్యులు వారిరువురితో విడివిడిగా మాట్లాడారు. ఇంతాబోతే, అక్కడ తల్లక్రిందులైపోయే సమస్యలేమీ లేవు. తెలిసీ తెలియని వయసులో ఇవన్నీ సహజం. ఒకసారి మనసుల మధ్య దూరం తగ్గిందా, వారిని విడదీయడం అసాధ్యం! ఆ దూరం తగ్గించడానికి సభ్యులు పూనుకున్నారు. 'దంపతుల మధ్య చిలిపి తగాదాలు, చిరుకోపాలు, తాపాలు అత్యంత సాధారణమైన విషయం. కానీ అవే పట్టుకు వేలాడితే ఇద్దరి మధ్యా అతి సున్నితమైన అనురాగ దారం పటుక్కుమంటుంది. సందు చూసుకుని పంతం, పట్టుదల, అహం, అభిజాత్యం దూరిపోతాయి. వాటికి తావిచ్చామా, ఇకంతే! బంగారమంటి కాపురం తుప్పుపట్టిపోతుంది. అలాకాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇద్దరిదీ! ఒకరికొకరు ప్రాణం అనుకున్నాక ప్రాణాన్ని నొప్పించి ఎవరన్నా సంతోషంగా ఉండగలరా? ఆలోచించుకోండి!' అన్నారు.
కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే అవి అంతకుముందే వింటుంటాం. పుస్తకాల్లో చదువుతాం. సినిమాల్లో చూసి వుంటాం. కానీ ఏదో ఒక సమయంలోనే, ఎవరో ఒకరు చెబితేనే మనసుకు పడతాయి. 'నిజమే కదా!' అని మదిలో స్ఫురిస్తుంది. ఇప్పుడదే జరిగింది! ఇప్పుడు పవన్, రమణిల మనసుల మధ్య పంతాల పరదాలు కనుమరుగయ్యాయి. ఇప్పుడు వారిద్దరిదీ ఒకటే ప్రాణం! కలహాలు మాయమై ఇపుడంతా కువకువల సంగీతం!
No comments:
Post a Comment