'బాల్యంలో తండ్రి అండ, యవ్వనంలో భర్త అండ, వృద్ధాప్యంలో కొడుకు అండ'... ఆడదానికి జీవితమంతా ఎవరో ఒకరి అండ... అదీ మగవారి అండ ఉండాలి. లేకుంటే లోకంలో మనలేదు.....................
ఈ భావాలు నేటికీ ఉన్నాయి. సూక్తిముక్తావళిగా వల్లింపబడుతున్నాయి. లేకుంటే ఇంత చదివినా, తమకంటూ ఓ గుర్తింపును సాధించినా అతివను తక్కువగానే చూడటమేంటి? కట్నం వేధింపులు, యాసిడ్‌దాడులు, అత్యాచారాలు, వరకట్నచావులు... వీటన్నింటి నడుమ నాతి జనారణ్యంలో మృగాల మధ్య జీవిస్తున్నట్లుగా వణుకుతోంది. అభద్రతాభావంతో అలిసిపోతోంది. ఆమె ధైర్యంగా బతకలేదా? ఈ పరిస్థితి ఎన్నడూ మారదా?వసంత తనలోతానే బాధపడ్తోంది. కంటనీరు చిప్పిల్లితే... అది అత్తగారి కంటపడితే... ఆరోజు ప్రళయం వచ్చినంత పనైపోతుందని ఆమెకు తెలుసు. అత్తగారి శాపనార్థాలు, భర్తచేతి మొట్టికాయలు తట్టుకోలేనని తెలుసు. వారి కంటిచూపుకే శక్తి ఉంటే ఈసరికే మాడి మసైపోయేదాన్నని వసంతకు తెలుసు! అందుకే వసంత లోలోపలే కుమిలి కుమిలి ఏడుస్తోంది. తనకై తాను మాత్రమే ఏడుస్తోంది. అవును! అక్కడ ఆమె బాధను పంచుకునేవారు లేరు. ఓదార్చేవారు అంతకన్నా లేరు.
వసంత అందర్లాంటి అమ్మాయే. నవ్వుతూ తుళ్లుతూ, తల్లిదండ్రుల ప్రేమాప్యాయతలతో, అన్నదమ్ముల అనురాగాలతో పెరిగి పెద్దయ్యింది. ఎంతో చదువుకోవాలని, ఏదో సాధించాలని... వసంత మనసులో ఎన్నడూ ఇదే ఆలోచన! ఆమె ఆశలపై చన్నీళ్లు చిలకరించింది ఓరకంగా ఆమె తల్లిదండ్రులే! 'ఎదిగిన కూతురు గుండెలపై కుంపటి' అని మనసావాచా నమ్మే వారిద్దరూ వసంత పెళ్లిచేయడమే తమ తక్షణ కర్తవ్యమనుకున్నారు. అన్నదమ్ములూ వారితో ఏకీభవించారు. వారి లెక్కలు వారికున్నాయి మరి! 'చదివేకొద్దీ అంతకన్నా ఎక్కువ చదివిన కుర్రాడ్ని వెతకాలి. వెతికామంటే అంతకు తగ్గ కట్నం ఇవ్వాలి. ఇదంతా ఎందుకొచ్చిన గొడవ... ఎంత తొందరగా దీని పెళ్లి చేస్తే అంత తొందరగా బాధ్యతలనుండి విముక్తి పొందొచ్చు'... ఈ భావాలే లాభనష్టాలు బేరీజువేసేది! వసంత పెళ్లి కుదిరింది. అబ్బాయి మధుది ఓ చిరుద్యోగం. వారిది ఉమ్మడికాపురం.
కొత్తకాపురం తాలూకు మధుర భావనలేమీ వసంత మనసులో లేవు. పెళ్లిలో మధు, అతని తల్లిదండ్రులు చేసిన అల్లరి, రగడ తప్ప! ఇంకా ఏదో ఇవ్వాలనీ, మర్యాదలు సరిగ్గా లేవనీ... అత్తింటివారు అరవడం, వసంత తల్లిదండ్రులు బతిమలాడుకోవడంతోనే పెళ్లంతా సరిపోయింది. వసంత తల్లిదండ్రులు అప్పటికే పెళ్లికోసం అప్పుచేశారు. ఇప్పుడు లాంఛనాలకు మరోచోట అప్పుచేసి పైకం ముట్టజెప్పారు. ఎలాగోలా పెళ్లి జరిగితే చాలనుకున్నారు. మొత్తానికి పెళ్లయ్యింది. అత్తవారింట వసంతకేమీ ఘనస్వాగతం లభించలేదు. ఏదో ఉద్ధరించామన్న భావన తప్ప! అక్కడి వారికెవరికీ కొత్తకోడలు ఇంట అడుగుపెట్టిందన్న ఆలోచనలేదు. ఎక్కడో పెరిగి ఇక్కడివారి ప్రేమను, అభిమానాన్ని ఆ యువతి ఆశించి అడుగుపెట్టిందనీ లేదు. ఇక మధుకు ఇవన్నీ అనవసరమైన విషయాలు. అవన్నీ అమ్మ చూసుకుంటుంది. అంతే!
చేతులకున్న గోరింటాకు, కాళ్లకున్న పారాణి చెరగకముందే వసంత ఇంటిపనిలో మునిగిపోయింది. తెల్లారింది మొదలు పని, పని, పని!ఆజ్ఞలు జారీచేసేవాళ్లెవరూ వసంత తిన్నదా, లేదా అని చూసేవాళ్లు కాదు. చేసిన పనిలో వంకలు వెతకడం, కొడుకు రాగానే చెప్పడం మధు తల్లి పని! అందులో నిజానిజాలు ఎంతవరకూ అన్నది ఆలోచించకుండా చీవాట్లుపెట్టడం మధు వంతు! వసంతతో ప్రేమగా మాట్లాడటం కానీ, సరదాగా బయటికి తీసుకెళ్లడంగానీ ఏనాడూ మధుకు తెలీదు. కనీసం తనవాళ్లకోసం వసంత ఒళ్లు హూనం చేసుకుంటోందన్న జాలిలేదు. తాను ప్రేమగా పలికే నాలుగు పలుకులకోసం వసంత చకోరంలా ఎదురుచూస్తోందని మధు అనుకోడు. కానీ, పెళ్లానికి చనువిస్తే చంకనెక్కుతుందని మాత్రం అనుకుంటాడు. భార్యను ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలని అనుకుంటాడు. భార్యంటే వంటగదికే పరిమితం చేయాలని, ఆడవాళ్లకు ఏమీ తెలియవని అనుకునే వారిలో మధు ప్రథముడు.
ప్రేమాప్యాయతల సంగతేమో కానీ, ఇపుడు వసంతకు దెబ్బలు అదనంగా దొరుకుతున్నాయి. కారణం, అదనపు కట్నంపై ఆశ! పుట్టింటికి వెళ్లి ఇంకా డబ్బు తీసుకురమ్మనీ, టివి, ఫ్రిజ్జులు తీసుకురమ్మని మధు అడగడం మొదలెటాటడు. వారికంత తాహతులేదని చెప్పడం, బదులుగా దెబ్బలుతినడం... ఇదీ వసంత పరిస్థితి! సిగ్గువిడిచి వసంత పుట్టింటికెళ్లేది. విషయంచెప్పి ఎంతో కొంత తీసుకొచ్చి మధు చేతికిచ్చేది. అలా రెండుమూడుసార్లు అయ్యింది. ఇంకా ఎన్నాళ్లిలా? ఆ సమయంలోనే వసంతకు 'ఐద్వా లీగల్‌సెల్' గురించి తెలిసింది. కానీ, అక్కడకువెళ్లి విషయంచెబితే భర్త చంపేస్తాడని భయపడింది. స్నేహితురాలి సహకారంతో చివరకు ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది. సభ్యులు పరిస్థితి అంతా చక్కబడుతుందని ధైర్యంచెప్పారు. వచ్చేవారం మధును, అతని కుటుంబసభ్యులనూ రమ్మని పిలిచారు.

No comments:
Post a Comment