Monday, November 7, 2011

ఈ పిశాచికోరలకు తమనూ, తమ కుటుంబాన్నీ సమర్పిస్తున్న మూర్ఖులెందరో!


ఎందరో తాగుబోతుల గాథలు, వారి బారినపడిన భార్యబిడ్డల వెతలు మనం 'ఐద్వా అదాలత్‌' వేదికలో అనేకసార్లు చెప్పుకున్నాం. మనం చెప్పుకున్నదానికి ఎన్నో రెట్లు ఎక్కువగా అక్కడికి భార్యాభర్తలు వస్తుంటారు......................
తమ కాపురాన్ని చక్కదిద్దమని కోరుతుంటారు. పాలకులు ఎన్ని కల్లబొల్లి కబుర్లుచెప్పినా సామాజిక పరిస్థితి అంతకంతకూ దిగజారుతుంది. దేశక్షేమంకన్నా, ప్రజాక్షేమంకన్నా తమ సంక్షేమం ముఖ్యమనుకోవడమే మన దేశంలో మందుప్రవాహానికి అసలైన కారణం. మౌలిక సౌకర్యాలు మరిచిన పాలకులు మందును మాత్రం సందు సందుకీ అందుబాటులో ఉంచుతున్నారు. ఈ పిశాచికోరలకు తమనూ, తమ కుటుంబాన్నీ సమర్పిస్తున్న మూర్ఖులెందరో! నడిరోడ్లపై శవాల్లా పడుకున్న మందుబాబులూ, హత్యలు, అత్యాచారాలు... చెప్పుకుంటే తాగుడువల్ల జరుగుతున్న దారుణాలెన్నో!


రాము ఇప్పుడదే సందిగ్థంలో ఊగులాడుతున్నాడు. పిలిచిన 'ఐద్వా లీగల్‌సెల్‌' సభ్యులముందు తలదించుకుని ఉన్నాడు. పక్కనున్న భార్యాబిడ్డలవైపు చూడటానికి సందేహిస్తున్నాడు. తల్లిదండ్రులవైపు చూసే సాహసమే చేయడంలేదు. విషయంలోకి వెళ్తే...
రాము ఆటో నడుపుతాడు. ఫర్వాలేదు, ఇక వీడికి పెళ్లి చేయొచ్చు అనుకున్న తల్లిదండ్రులు అతనికి సంబంధాలు వెతికారు. ఒద్దిగ్గా, ముద్దబంతిలా కనిపించిన మమత రాము తల్లిదండ్రులకు బాగా నచ్చేసింది. మమత తల్లిదండ్రులు తమ శక్తిమేరకు కట్నకానుకలిచ్చి కూతురిని అత్తవారింటికి సాగనంపారు.
కాపురం పెట్టిన కొన్నాళ్లకే ఓ రోజు రాము తాగి ఇంటికి చేరాడు. ఏంటని అడిగితే స్నేహితులు బలవంతం చేశారని మమతను మాయచేశాడు. తర్వాత ఏదో ఒక వంకచెప్పి తప్పతాగి ఇంటికి రావడం, మరెప్పుడూ తాగనని మమతపై ఒట్టేయడం ఇదే తంతు! రాముకు తాగుడు అలవాటుందని మమతకు అర్థమైంది. ఇది మంచిదికాదని, ఆరోగ్యానికీ- ఇంటికీ నష్టదాయకమని మమత చెవినిల్లు కట్టుకుని మరీ పోరింది. అయినా రాము పట్టించుకోలేదు. చివరికి మమత అత్తమామలతో చెప్పించింది. అయినా ప్రయోజనం శూన్యం. రాము ఆటో నడపగా వచ్చిన సొమ్ములో సగంపైగా తాగుడుకే ఖర్చుచేసేవాడు. ఫూటుగా తాగి ఏ అర్థరాత్రికో కొంపకు చేరేవాడు. ఇక్కడో భార్య ఉందనీ, అతనికోసం కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తుందని ఆ సమయంలో రాముకు గుర్తుకొచ్చేదే కాదు. ఏడ్చి ఏడ్చి మమత కన్నీళ్లన్నీ ఇగిరిపోయాయి తప్పితే రాములో మార్పురాలేదు. ఈలోగా ఇద్దరు పిల్లలు పుట్టారు.
పిల్లలను చూసైనా రాము తన ప్రవర్తన మార్చుకోలేదు. బాధ్యతలు తెలుసుకొమ్మన్న తల్లిదండ్రుల మాటను లెక్కచేయలేదు. కానీ రోజులలా లేవు. ఇంటద్దె, పిల్లల ఫీజులు, నెలవారీ సరుకులు, వైద్యం... ఇవన్నీ ఎలా సర్దుబాటుచేయాలో మమతకు అర్థంకావడంలేదు. అప్పటికీ మమత ఓ చిరుద్యోగం చూసుకుంది. కానీ పెరిగిన ధరలతో పోల్చితే ఆ సంపాదన ఏ మూలకి? మమత కష్టాన్నీ, కుటుంబంకోసం ఆమె పడుతున్న తాపత్రయాన్నీ రాము తల్లిదండ్రులు అర్థంచేసుకున్నారు. అమాయకురాలైన భార్యను క్షోభపెట్టడం మంచిదికాదని రాముకు నచ్చచెప్పారు. అన్యాయంగా ఒక ఆడపిల్ల ఉసురుపోసుకోవడం క్షేమకరంకాదని కంటనీరుపెట్టారు. అవేమీ రాము తలకెక్కలేదు. కానీ తాగుడు మైకం రాముకు ఎంతగా తలకెక్కిందంటే మమతపై చేయి చేసుకోనారంభించాడు. అడ్డొచ్చిన పిల్లలనుసైతం చితకబాదసాగాడు. క్రమేణా చేయిపోయి మమత శరీరంపై కర్ర, బెల్టులు సృష్టించిన వాతలు తేలసాగాయి. తాగుడు మనిషిని మృగంలా మార్చింది.
ఇక భరించడం మమతవల్ల కాలేదు. ఆఖరికి రాము తల్లిదండ్రులు కూడా ఇక వీడిని మార్చడం మనవల్ల కాదనుకున్నారు. ఆ సమయంలోనే ఇరుగుపొరుగు ద్వారా 'ఐద్వా లీగల్‌సెల్‌' గురించి వారికి తెలిసింది. వెంటనే అక్కడికొచ్చి తమ కొడుకు నిర్వాకాన్ని వివరించారు. తరువాతి వారం మొత్తం కుటుంబమంతా అక్కడుంది. సభ్యులు అన్ని వివరాలూ సేకరించారు. నువ్వేం చెప్పదల్చుకున్నావో చెప్పమన్నారు. 'మగాడ్ని. కష్టపడతాను. ఆమాత్రం తాగకూడదా?' అని రాము ప్రశ్నించాడు. దానికి సభ్యులు, 'బాధ్యతలు, వాటిని విస్మరిస్తే ఫలితాలు, ఒక భర్తగా, తండ్రిగా, కొడుకుగా కర్తవ్యాలు' అన్నీ అర్థమయ్యేలా వివరించారు. మారాలని అనుకుంటే, నలుగురిలో తలెత్తుకు బతకాలని నిర్ణయించుకుంటే సహకరిస్తామన్నారు. తాగుడు మానడానికి కౌన్సిలింగ్‌ ఇప్పిస్తామన్నారు.
అన్నీ రాము విన్నాడు. ఏ సంబంధమూ లేకపోయినా, తానెవ్వరో తెలీకపోయినా ఒక కుటుంబాన్ని కూలిపోకుండా కాపాడాలనే సభ్యుల తపనను అర్థంచేసుకున్నాడు. ఏమీ కానివారే అంతలా తపిస్తోంటే, ఇన్ని ఇబ్బందులకూ కారణమైన తాను మారకుంటే అంతకంటే పాపం మరోటి ఉండదనుకున్నాడు. మీరేం చేస్తారో చేయండి, ఏం చెప్పినా వింటాను, నేను మారడానికి సిద్ధం అని అందరి యెదుటా మాటిచ్చాడు. మమత కళ్లల్లో ఆనందభాష్పాలు. పిల్లల్లో హర్షాతిరేకాలు. రాము తల్లిదండ్రుల ముఖాల్లో వెలుగురేఖలు!

No comments:

Post a Comment