Tuesday, April 12, 2011

బాబు వారసుడు లోకేషా..? జూనియర్ ఎన్టీఆరా..?

మూడు దశాబ్దాల తెలుగుదేశం పార్టీ అనే తెలుగు సముద్రంలో ఇపుడు అల్లకల్లోలం చెలరేగింది. ఫలితంగా పార్టీ నేతలు, శ్రేణుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. దీనికంతటికీ ప్రధాన కారణం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వారసుని ఎంపికే. ప్రస్తుతం 61వ పడిని దాటిన చంద్రబాబు.. తన తర్వాత వారసునిగా తనయుడు నారా లోకేష్‌ను తెరపైకి తెచ్చే ప్రయత్నాలు గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నట్టు వినికిడి. దీన్ని పసిగట్టిన కేంద్ర మంత్రి, కాంగ్రెస్ మహిళా నేత, ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి సోదరుడు ఎన్.హరికృష్ణతో కలిసి ఎత్తుకు పైఎత్తులు వేశారు. ఫలితంగా తెదేపా సముద్రంలో తుఫాను పుట్టింది.

ఆరు పదుల వయస్సులో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ సినిమా రంగాన్ని వీడి తెలుగు ప్రజల ఆత్మగౌరవం పేరుతో తెదేపాను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వెన్నుపోటు రాజకీయల ద్వారా చంద్రబాబు నాయుడు 45 ఏళ్ల వయస్సులోనే ఆ పార్టీ పగ్గాలు చేపట్టారు. పిన్నవయస్సులో తనకు అవకాశం లభించిందని అధికారంలోకి వచ్చిన కొత్తలో పదే పదే చెప్పుకున్నారు.

ఇపుడు చంద్రబాబుకు 61 ఏళ్లు దాటాయి. ఈ వయస్సులో యువనేత జగన్‌ను ఎదురొడ్డి నిలవాలి. ఒకవేళ 2014లో తెదేపా అధికారంలోకి రాకపోతే బాబు 2019 వరకు వేచి చూడాలి. అంటే అప్పటికీ బాబు వయస్సు 70కు చేరుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు తన వారసుని ఎంపికపై అన్వేషణ మొదలెట్టారు. ఆయన కంటిలో తనయుడు లోకేష్ మినహా నందమూరి వంశ హీరోలు కనిపించలేదు.

ఎన్టీఆర్, చంద్రబాబు అనంతరం అంటే మూడోతరం నాయకుని ఎంపికలో చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ జీర్ణించుకోలేక పోయారు. తనలోని అసంతృప్తిని లేఖ ద్వారా బహిరంగ పరిచారు. ఈ లేఖ తెదేపాలో కలకలం సృష్టించింది. చంద్రబాబు సైతం నొచ్చుకున్నారు. ఎంత చేసినా.. ఏం చేయలేదనే నింద పడాల్సి వస్తుందని పార్టీ సీనియర్ల వద్ద వాపోయారు.

ఈ పరిస్థితులను క్యాష్ చేసుకునేందుకు హరికృష్ణ తన తనయుడు జూనియర్ ఎన్టీఆర్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఈ ఎత్తుగడ వెనుక మంత్రి పురంధేశ్వరి అండ పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయశక్తుల పునరేకీకరణ జరిగే అవకాశం ఉందని ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్, పురంధేశ్వరి కీలక పాత్ర పోషించవచ్చన్నది సమాచారం. మొత్తం మీద తెదేపాలో మూడోతరం వారసుని ఎంపికపైనే చెలరేగిన వివాదం ఆ పార్టీలో పెనుతుఫానుగా మారేలా కనిపిస్తోంది

No comments:

Post a Comment