నేటి కాలం అమ్మాయిలు పెళ్లికన్నా ముందు వేరుకాపురం గురించి ఆలోచిస్తారు. అత్తగారి పోరు, ఆడబడుచు ఆరళ్లు... వగైరా వగైరా 'చిరాకులు' వాళ్లకి ఉండకూడదు. పెళ్లయ్యాక భర్త, తాను మాత్రమే 'సంతోషంగా' కాపురం చేయాలి. మధ్యలో వీళ్లంతా ఉంటే... ఎంతైనా కష్టమే! ఇలా ఆలోచించే అమ్మాయిలు భర్తను తనకు అందజేస్తున్నదే అత్తమామలనీ, అప్పటిదాకా ఆ చెల్లెలి ప్రేమాప్యాయతలు పంచుకునే తన భర్త పెరిగాడనీ అనుకోరు. తామిద్దరూ తప్ప మిగతావాళ్లంతా 'పరాయివాళ్ల' కిందే లెక్క! మధ్యలో అటూ ఇటూ సమతూకం పాటించలేక అతగాడికొస్తాయి తిప్పలు! సరిగ్గా అదే జరిగింది రవి విషయంలో! రవి ఆ కుటుంబంలో ఒక్కగానొక్క కొడుకు.
అతను కాక చిన్నారి చెల్లెలు సాహితి కూడా! మధ్య తరగతి కుటుంబమైనా తల్లిదండ్రులు పిల్లల అచ్చటా ముచ్చటా తీర్చడంలో లోటు చేసేవారు కాదు. పిల్లలూ తమ పరిస్థితులను అర్థంచేసుకుని పద్ధతిగా పెరిగారు. పిల్లలు బాగా చదువుకోవాలని, జీవితంలో స్థిరపడాలని ఆ తల్లిదండ్రుల కోరిక. అందుకోసం ఎన్నో అవసరాలను వెనక్కి నెట్టారు. కొడుకును పూర్తి స్థాయిలో ప్రోత్సహించారు. దానికి తగ్గట్లు కష్టపడి ఇంజనీరింగ్ చదివాడు. కూతురూ బాగా చదివేది. రవికి అనుకున్నట్లే మంచి ఉద్యోగం వచ్చింది. సంపాదనను ఖర్చు చేయకుండా బ్యాంకులో వేసుకొమ్మన్నారు అతని తల్లిదండ్రులు. ఓరోజు రవి తల్లికోసం ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ కొని తెచ్చాడు. ఇలాంటి ఖర్చులు చేయొద్దని తండ్రి మందలించాడు. దానికి రవి నొచ్చుకున్నాడు. ఇప్పటిదాకా తనకోసం ఎన్నో అవసరాలను త్యాగంచేసిన తల్లిదండ్రులకు ఇవన్నీ కొనడం బాధ్యతని నచ్చచెప్పాడు.
ఇక రవి పెళ్లి చేయడం మంచిదనుకున్నారు అతని తల్లిదండ్రులు. కొడుక్కు తగ్గట్లు చదువుకున్న అమ్మాయినే చూడాలన్నది వారి అభిప్రాయం. కానీ రవి చదువు విషయంలో పెద్ద పట్టింపు వద్దనీ, పద్ధతైన అమ్మాయి అయితే చాలనీ అన్నాడు. ఉద్యోగం చేయకున్నా, కుటుంబంలో కలిసిపోయే అమ్మాయిని చూడమన్నాడు. అతని అభిప్రాయం రవి తల్లిదండ్రులకూ నచ్చడంతో ఆ ప్రకారమే సంబంధాలు చూశారు. చివరికి రశ్మి వారికి నచ్చింది. అమ్మాయి రూపవతి. ఇంటర్ తరువాత ఆసక్తి లేకపోవడంతో చదువు ఆపేసింది. వారి కుటుంబం పద్ధతులూ నచ్చడంతో వెంటనే పెళ్లి జరిగిపోయింది. వెంటనే రశ్మి అత్తవారింట్లో అడుగుపెట్టింది. ఆ అమ్మాయికి రవి చాలా నచ్చాడు. రవి ఉద్యోగం, ఆదాయం నచ్చాయి. అతను చూపుతున్న ప్రేమా నచ్చింది. ఆఖరికి ఉంటున్న ఇల్లూ నచ్చింది. ఇక నచ్చనిదల్లా ఇంట్లోని జనమే. వీళ్లంతా తమ ఏకాంతానికి భంగం కలిగించేవారుగా, తనపై పెత్తనం చేసేవాళ్లుగా రశ్మికి కనిపించేవారు.
ఇక ప్రతి సాయంత్రం ఏదో ఒక గొడవే. ఇదేంటని ప్రశ్నించడానికి అటు తల్లి తప్పు కనిపించేది కాదు. పరిస్థితిని అర్థంచేసుకున్న రవి తల్లిదండ్రులు రవి వద్దన్నా వేరుకాపురం పెట్టించారు. పోనీ, అప్పుడన్నా రవి ప్రాణం కుదుటపడిందా అంటే లేదు. ఆ ఇంట్లోని సామానంతా నువ్వు కొన్నవే కనుక అవన్నీ తీసుకురమ్మని పోరేది రశ్మి. ఇది రవి జీర్ణించుకోలేకపోయాడు. దాంతో తిన్నగా రవి 'ఐద్వా లీగల్‌సెల్'కు వచ్చి విషయం చెప్పాడు. తనకు రశ్మి ఎంత ముఖ్యమో, తనవారూ అంతే ప్రధానమన్నాడు. ఈ విషయం రశ్మి మనసు నొచ్చుకోకుండా తెలియజేయమన్నాడు.

'ఐద్వా లీగల్‌సెల్' what is this? can please share address and details? My friend is in this kind of trouble.
ReplyDelete