Friday, April 22, 2011

వేసవి చిరాకు మాయం

వేసవి ఎండలతోనే చిర్రెత్తుకొస్తుందంటే ఈ కాలంలో చాలామందికి చెమటపొక్కులు మరింత చిరాకు కలిగిస్తాయి. శరీరంపై అక్కడక్కడా పొటమరించే చెమటపొక్కులతో సమస్య అంతా ఇంతా కాదు. దీనికోసం రెండుమూడుసార్లు స్నానంచేసినా... చెమటకాయల పౌడర్ల ప్రకటనలు చూసి డబ్బా అంతా కుమ్మరించినా బాధతీరదు. ముఖ్యంగా ముఖ్యం, వీపు, చేతులు చెమటపొక్కులతో కుదురుగా ఉండనీయవు. వీటిని ఆట్టే భరించకుండా ఇంటివైద్యంతో ఎలా నయం చేసుకోవచ్చో చూద్దాం.


* ఓట్‌మీల్‌కు చెమటపొక్కులనుండి ఉపశమనం కలిగించగల శక్తి ఉంది. అర కప్పు ఓట్‌మీల్‌ను పొడిలా చేసి నీటితో ముద్దలా చేసి చెమటపొక్కులు ఉన్న ప్రాంతంలో రాయాలి. ఆరిన తరువాత స్నానంచేయాలి. ఇలా వారానికోసారి రాయొచ్చు.
* చెమటపొక్కులు ఎర్రగా ఉండి మంట పుడుతుంటే... రెండు స్పూనుల సెనగపిండిలో నీటిని కలిపాలి. ఆ మిశ్రమాన్ని చెమటపొక్కులున్నచోట పూతలా రాయాలి. ఆరాక కడిగేస్తే ఉపశమనం లభిస్తుంది. ఈ పూతలు చల్లగా ఉండటంతోపాటూ బాధనుండి విముక్తి కలుగుతుంది.
* చల్లని నీటిలో మెత్తని వస్త్రంను ముంచి చెమటపొక్కులపై కాసేపు ఉంచాలి. అలాగే ఒక మెత్తని వస్త్రానికి ఐసుముక్క చుట్టి మృదువుగా రాయొచ్చు. దీనివల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది. పొక్కులూ క్రమేణా తగ్గుతాయి.
* వేపాకు ముద్దచేసి శరీరానికి మృదువుగా రాయాలి. ఆరాక చల్లనినీటితో కడిగేయాలి. ఇలా చేయడం చెమటపొక్కులకే కాదు, చర్మానికీ మంచిది.
* మిల్తానిమిట్టిలో రెండు స్పూన్ల రోజ్‌వాటర్‌ కలపాలి. శరీరానికి రాసుకుని అరగంట తరువాత స్నానంచేయాలి. ఇలా వారానికోసారి చేయొచ్చు.
* కొత్తిమీర ఆకుల రసానికి, గంధం, రోజ్‌వాటర్‌ కలిపిన మిశ్రమాన్ని కూడా చెమటపొక్కులు ఉన్న చోట రాయొచ్చు.
* కలబంద చర్మ సంబంధిత సమస్యలకు అన్నివిధాలా మంచిదని వింటూనే ఉన్నాం. చెమటపొక్కులకు కూడా కలబంద గుజ్జు రాసి మృదువుగా మర్దనా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇది దురదను నివారిస్తుంది.
* ఎసెన్షియల్‌ గుణాలున్న లావెండర్‌ నూనెను స్నానం చేసే నీటిలో నాలుగైదు చుక్కలు వేసుకుంటే శరీరం చల్లగా ఉంటుంది.
* మొక్కజొన్న పిండితో గంజిలా చేసి, దానికి మొక్కజొన్నపిండిని సమపాళ్లలో తీసుకుని పూతలా రాసుకుని ఆరిపోయాక కడిగేయాలి. ఇలా వారానికి రెండు మూడుసార్లు చేస్తే గుణం కనిపిస్తుంది.
* మెత్తగా పొడిచేసిన కర్పూరంలో కొద్దిగా వేపనూనె కలిపి చెమటపొక్కులున్నచోట రాయాలి. తక్షణం చెమటపొక్కుల వల్ల వచ్చే దురద, మంట తగ్గుతుంది. శరీరం కూడా చల్లగా ఉంటుంది.
ఇవికాక ఈ కాలంలో వేపుడు పదార్థాలకు దూరంగా ఉండాలి. తాజా పళ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. బర్జీలు, పకోడీలు వంటి చిరుతిళ్లు తగ్గించాలి. వేడి వేడి కాఫీ, టీలు పరిమితంగా తీసుకోవాలి. లెమన్‌ టీలు వంటివి అన్నివిధాలా మంచివి. అలాగే చెరుకురసం తాగితే శరీరంలో తేమశాతం పెరుగుతుంది. ద్రవ పదార్థాలకు ప్రాధాన్యతనివ్వాలి. నీరు ఎక్కువగా తాగాలి. శరీరానికి గాలిసోకే తేలికపాటి దుస్తులను ఎంపిక చేసుకోవాలి.ఈ జాగ్రత్తలు చాలు... వేసవి 'చల్లగా' జారుకోవడానికి!

No comments:

Post a Comment