అసలే వేసవి. ఆపై ఉక్కపోత. ఇవి చాలవన్నట్టు మంచినీళ్ల కటకట. అన్నిటినీ మించి సర్కారువారి కరెంటు కోత. ఇంట్లో వుండా లేము. కాలు బయట పెట్టా లేము. లోపలుంటే చెమటలు. బయటికెళితే మండుటెండలు. మొరాయించిన పంకా రెక్కలు, మూతి బిడాయించుకున్న నల్లాలు. మంచినీళ్ల కోసం మండుటెండల్లో బారులు. ముష్టి యుద్ధాలు. మాటల బాణాలు. కరెంటు కోతకు, దోమల స్వైర విహారం తోడైతే! అర్ధరాత్రి జాగారాలు, దోమల వేటలు. వేసవి తెచ్చే మామిడి ఎంత మధురం. కరెంటు కోత అంత కఠినం.
'ప్రాణం పోకడ వాన రాకడ చెప్పలేం' అన్నది పాత మాట. కరెంటు పోకడ రాకడ చెప్పలేమన్నది నేటి మాట. కరెంటు ఏ క్షణంలోనైౖనా పోవచ్చు. ఎన్ని గంటల తర్వాతైనా రావచ్చు. దానికి సమయం సందర్భం...నీతి న్యాయం ఏమీ వుండదు. అది మిట్ట మధ్యాహ్నమా...అర్ధరాత్రా అన్న మొహమాటాలేం వుండవు. పసిపిల్లలు, ముసలివాళ్లు అన్న కనికరం అస్సలు వుండదు. చిన్నారులు కాసేపు నిద్రపోతే పనిపూర్తి చేసుకుందామనుకునే తల్లులకు నిరాశే. పగలంతా పనిపాటలు చేసి అలసిసొలసి కంటినిండా నిద్ర పోదామనుకోవడం అత్యాసే!
పరీక్షల సీజన్లో పవర్ కట్టంటే పిల్లకాయలకు ఎంత కష్టం? ప్రాణవాయువు అందనట్టు గిలగిలలాడిపోతారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు ఎలాగో పూర్తయినా డిగ్రీ, పీజీ, పోటీ పరీక్షలు వుండనే వున్నాయి. కరెంటు కోతతో చేలో పైరే కాదు రైతు మొహమూ వాడిపోతోంది. కరెంటు రాదు. పైరుకు నీరందదు. రైతుకు కన్నీరాగదు. ఓల్టేజీ సమస్యలతో మోటార్లు...ఫ్యాన్లు కాలిపోతోంటే...బల్బులు మాడిపోతున్నాయి. పవర్ హాలిడేలు ప్రసాదించే ఉపవాసాలతో కార్మికుల కడుపులు కాలిపోతున్నాయి.
మిక్సీలు, గ్రైండర్లు అలవాటై రోళ్లను మూలన పడేశాం. ఇప్పుడు కరెంటు కోత కారణంగా రుబ్బురోళ్లతో కుస్తీపట్లు. అత్త మీది కోపం దుత్త మీద చూపించినట్టు... కరెంటు మీది కోపం పచ్చడిబండ మీద చూయిస్తే... అది ఊరుకుంటుందా! చప్పున చింది కంట్లో పడుతుందిసుమా జాగ్రత్త.
ఈ ఏడు వానలు మస్తు. రిజర్వాయర్లు ఫుల్లు. అయినా వేసవిలో గుండెజల్లు. కరెంటు ప్రయివేటీకరణతో మనం సాధించిందేమిటంటే...
మిక్సీ పోయి రోలు వచ్చె ఢాం...ఢాం...ఢాం...
ఫ్యాను పోయి విసనకర్ర వచ్చె ఢాం...ఢాం...ఢాం...
బల్బు పోయి బుడ్డి వచ్చె ఢాం..ఢాం..ఢాం...
పని పోయి పస్తులొచ్చె ఢాం...ఢాం... ఢాం...
No comments:
Post a Comment