
ఉగాది షడ్రుచుల సమ్మేళనం. వసంతం, కోకిల, మామిడికాయలు, వేపపువ్వు... అన్నీ కలిసి ఏకకాలంలో చవిచూసి తరించే అనుభవం. ఇక ఉగాది పచ్చడి రుచి మధురాతిమధురం(సరిగ్గా చేస్తేనే సుమా!) అందరూ ఉగాది పచ్చడిపై తెగ జోకులేస్తారు. కానీ ఉగాదిపచ్చడినుంచి బోలెడన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. తీపి, చేదు, పులుపు, వగరు, ఉప్పు, కారం అన్నీ కలిస్తేనే జీవితమని చెప్పకనే చెప్పే ఉగాదిపచ్చడి విలువ అనన్యసామాన్యం. అవును మరి! జీవితమంటే అంతా వడ్డించిన విస్తరిలా ఉంటుందా? కాదే! మనం కోరుకున్నట్లు, మనకు నచ్చినట్లు ఉంటుందా? లేదే! కనీసం ఎప్పుడేం జరుగుతుందో చెప్పగలమా? మ్చ్..!
ఆ అవకాశమే లేదు. మరుక్షణం ఏం జరుగుతుందో చెప్పలేం. అలాంటిది జీవితమంతా ఏం జరుగుతుందో ఎలా చెప్పగలం? జ్యోతిష్యాలు, పంచాంగాలూ చెబుతాయిగా అంటారా? అవన్నీ చెప్పీ చెప్పక ఊరించే సంగతులు. ఆశా నిరాశల మధ్య ఊగిసలాటలు! అయినా అవన్నీ స్వయంకృషిపై నమ్మకం లేనివారికి కానీ... మనకెందుకూ?! మరి ఉగాదిపచ్చడిలోని షడ్రుచులూ మన జీవితానికి అన్వయించుకుందామా..!అన్నిటికన్నా ఇష్టం తీపి కనుక ముందు తీపి గురించే చెప్పుకుందాం! తీపికి మారుపేరు సంతోషం. జీవితం సంతోషంగా సాగిపోవాలని కోరుకోవడం సహజం. కాకుంటే అందుకు తగ్గ కృషి ఉండాలి. కానీ దానికోసమే పలవరిస్తూ జీవితం రసహీనం చేసుకోకూడదు. ఇదంతా ఎందుకంటే, నేడు చాలామంది అభిప్రాయం సంతోషం అంటే సంపాదన అనే! ఆ వెంపర్లాటలో పడి విలువైనవెన్నింటినో కోల్పోతున్నారు. ఇది కానేకాదు, సంతోషమంటే సంతృప్తి. ఆత్మీయులతో కలిసి మధురక్షణాలు పంచుకోవడం. జీవితాన్ని ప్రశాంతంగా గడపడం. గిరిగీసుకుని కాకుండా నవ్వుతూ, నవ్విస్తూ పదిమందిలో కలిసిపోవడం. ఇతరులకు చేతనైన సాయం చేయడం. దీన్ని మించిన తీపి మరోటి చూపించండి చూద్దాం! చేదు అంటే కష్టాలేగా! కష్టాలు వస్తాయి! రాకుండా ఎక్కడికి పోతాయి? జీవితమంటేనే గెలుపు ఓటముల సంగమం. కష్టాలు వచ్చాయని డీలాపడితే లాభంలేదు! అయినా అవి ఏటెల్లకాలం మనల్ని అంటిపెట్టుకుని ఉండవుగా! ఎదుర్కొని పోరాడితే ఇట్టే పలాయనం చిత్తగిస్తాయిగా! అయినా అలాంటప్పుడేగా మనకు జీవితం విలువ తెలిసేది! సవాళ్లను ఎదుర్కొని విజయం సాధిస్తేనే కదా మనోధైర్యం మరింత పెరిగేది! మానసికస్థైర్యం మరికాస్త బలపడేది!
ఇక పులుపు, అంటే ప్రణయకలహాలు, చిలిపి తగాదాలేగా! ముందు పుల్లగా ఉంటుంది... కానీ కలతవీడి ఆలుమగలు కలిసిపోతే! అనురాగం రెట్టింపవుతుంది. 'దూరమైన కొలదీ పెరుగును అనురాగం' అంటారే అలాగన్నమాట! స్నేహితులైనా అంతే! చిన్న చిన్న మాట పట్టింపులొస్తే చింకి చాటంత చేసేకంటే... చక్కదిద్దుకుంటే మనసుకు హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది.
వగరంటే అసూయా ద్వేషాలండీ బాబూ! ఇతరుల్లో కనిపిస్తే పట్టించుకోకూడదు. మన దరికి అసలు చేరనే కూడదు. వీటి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది! కాకపోతే జీవితంలో ఇలాంటి సంఘటనలూ ఎదురవుతాయి. మనలో నిజాయితీ, నిక్కచ్చితనం ఉన్నప్పుడు ఇలాంటివి ఎదుర్కోవడం పెద్ద బ్రహ్మవిద్యంటారా? విజయోస్తు!
ఉప్పు సంగతి మరిస్తే ఎలా? బిపీకి మారుపేరు కాదూ! పౌరుషం మంచిదే! మనల్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి! మెరుగైన సామర్థ్యంతో అన్నిటా రాణించడానికి! అది రాలేదని అసహనం చూపడం, ఇతరులకు దక్కిందని రెచ్చిపోవడం రెండూ అనర్థదాయకమే! అచ్చం ఉప్పులానే! కూరల్లో ఇది పడనిదే ముద్ద దిగదు. అలాగని ఎక్కువైతే మింగుడుపడదు. సో, సమపాళ్లలో సరితూకం వేసుకుంటే అన్నిటా మనదే పైచేయి! ఏమంటారు?!
కారం అంటే కోపం. మాచెడ్డ గుణం. మన తప్పు లేనప్పుడు కోపం రావడం ఓకే! కానీ ఎదుటివాడంటే వంటికి కారం పూసుకున్నట్లు మంట పుడితే అది చేతులారా చేసుకున్న కీడు. ఏదేమైనా కోపం మన శత్రువు. అదుంటే శారీరక, మానసిక ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవడమే! కనుక, కోపానికి మంగళం పాడేస్తే సరి! బీ కూల్! అసలే హాట్ హాట్ సమ్మర్ కూడాను!
అందుకే ఇవన్నీ సూచించే ఉగాది పండుగకోసం అంతగా ఎదురుచూసేది! ఈ ఉగాది సాక్షిగా జీవిత పాఠాలు నేర్చుకుని దిగ్విజయంగా సాగిపోదాం! జీవితంలో రసరమ్య గీతాలు ఆలపిద్దాం. కోటివీణల సుస్వరాలను మధురంగా పలికిద్దాం. భవిష్యత్తును బంగారుబాట చేసుకుందాం. మరి పదండి, మామిడికాయలు, వేపపూవు సేకరిద్దాం... అహహ... కొనుక్కొద్దాం! అందరికీ ''ఉగాది శుభాకాంక్షలు!''
ఒక జోకు:
ఉగాది ముందు రోజు వేపపువ్వు బండి దగ్గరికెళ్లి, కట్ట ఎంతని అడగ్గానే, ''ఇరవై రూపాయలు'' అన్నాడతను యమా దర్జాగా! ''వామ్మో! కట్టలో నాలుగు పువ్వులు కూడా లేవు. అంత
రేటా?'' అంటూ బోలెడంత ఆశ్చర్యపోతోంటే, ''ఏమ్మా!
ఇంత రేటు చెబుతున్నానని తెగ ఆశ్చర్యపోతున్నావు
గానీ, రేపు ఊరికే ఇస్తానన్నా తీసుకుంటావా?'' అన్నాడు నవ్వుతూ. అవును, అతను చెప్పింది నిజమేగా! మరిక మాట్లాడలేదు. ఇరవై రూపాయలూ ఇచ్చి వేపపూవు కొనడం తప్ప..!
No comments:
Post a Comment