ఆత్మీయుల మరణం మనసును నలిబిలి చేసేస్తుంది. మదిని కలవరపరుస్తుంది. భవిష్యత్తును అంధకారంగా చేస్తుంది. అలాంటిది జీవితంలో నిలదొక్కుకోని పిల్లలకు తల్లి మరణిస్తే? ఆ ఆవేదన వర్ణనాతీతం. అలాంటి దిక్కుతోచని స్థితిలో ఆ పిల్లలు తండ్రి నీడన సేద తీరదామనుకుంటారు. కానీ అదీ ఎండమావిగా మారితే?! నందిని స్థితి అదే! నందిని ఇంటర్, ఆమె తమ్ముడు పదో తరగతి. రెండేళ్ల క్రితం తల్లి అనుకోకుండా అనారోగ్యం వచ్చి మరణించింది. నందినికి, ఆమె తమ్మునికి ఇది ఊహించని ఉత్పాతం. నందినికి తాను దుఃఖించాలో, తమ్ముడ్ని ఓదార్చాలో అర్థంకాలేదు. తెలియని పెద్దరికం తన భుజాన పడినట్లనిపించింది. బాధను దిగమింగి తమ్ముడ్ని అక్కున చేర్చుకుంది. రోజులు గడిచేకొద్దీ చదువులో పడ్డారు. తండ్రి తీసుకొచ్చే సరుకులతో జాగ్రత్తగా ఇల్లు నడిపేది నందిని. అప్పుడప్పుడు నందినికి అమ్మ ఉన్నప్పుడు చేసిన అల్లరి, గారాబం... చివరికి సమయానికి తిండి దొరికేది కాదు. ఆకలేసి అన్నం వండుకుంటే సావిత్రి గిన్నె తీసి విసిరేసేది. చీటికీ మాటికీ అనరాని మాటలనేది. ఏదో వంకతో ఏడిపించేది. బూతులు తిట్టేది. చివరికి కొట్టేదాకా వచ్చింది. ఇంటెడు చాకిరీ చేసినా ఆమెకు సంతృప్తి ఉండేది కాదు. వీటన్నింటి మధ్యా చదువుకోవడానికి సమయం చిక్కేది కాదు. తండ్రితో చెప్పాలంటే అవకాశం చిక్కేది కాదు. ఆ అవకాశం సావిత్రి ఇచ్చేది కాదు. ఓరోజు తండ్రికి ఇవన్నీ చెప్పుకుని కన్నీరుపెట్టారా పిల్లలు. అతను సావిత్రికి మెల్లగా ఏదో చెప్పబోయినా ఆమె వినిపించుకోలేదు. పైపెచ్చు పరిస్థితి మరింత దిగజారింది. కారణం లేకుండానే సావిత్రి వారిద్దరినీ దుమ్మెత్తిపోస్తోంది. చివరికి, మీ ఇద్దరూ మీ నాన్నకు పుట్టలేదు పొమ్మంది. ఆఖరికి సావిత్రి ఓనాడు నందినికి, ఆమె తండ్రికి సంబంధం అంటకట్టింది.
ఆ మాటలకు నందిని నిశ్చేష్టురాలైంది. మాటరాక స్థాణువులా నిల్చుండిపోయింది. తాను వింటున్న మాటలు నిజమా, కలా అని నివ్వెరపోయింది. నిజంగానే ఆ మాటలు సావిత్రి నోటివెంట వెలువడిన తూటాలేనని నిర్థారించుకున్నాక కృంగిపోయింది. తన బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాలేదు. ఓదార్చే తల్లి నందిని దరిదాపుల్లో లేదు. తండ్రికి చెప్పుకున్నా ఫలితం శూన్యం. ఉన్న ఒక్కగానొక్క తమ్ముడూ చిన్నవాడు. వాడికివన్నీ చెప్పి వాడి మనసులో సుడిగుండాలు చెలరేగడం తను సహించలేదు. తాను, తమ్ముడు జీవితంలో స్థిరపడాలంటే మానసికంగా నిలదొక్కుకోవడం తనకెంతో ముఖ్యం. ఆలోచించుకుంటుంటే నందినికి పిచ్చెక్కిపోతోంది. తన బాధ ఎవరికి చెప్పుకోవాలి. కోల్పోయిన తన మనోధైర్యాన్ని తిరిగి రాబట్టుకోవాలి. ఇందుకు సహకరించుకునేది ఎవరు అని ఆలోచించుకున్న నందిని 'ఐద్వా లీగల్‌సెల్'కు వచ్చింది. ఈ పరిస్థితులనుండి నాకు విముక్తి కావాలని కోరింది.
పసి వయసులోనే నందినికి వచ్చిన కష్టాలకు వారి మనసెంతో నొచ్చుకుంది. నందినికి మెల్లగా నచ్చచెప్పారు. ప్రతికూల పరిస్థితుల్లో ధైర్యం కోల్పోరాదన్నారు. ఆమెలో తిరిగి ధైర్యాన్ని పునరుద్ధరించారు. తండ్రినే కాదు, సావిత్రినిసైతం పిలిచి ఇద్దరితో మాట్లాడదామన్నారు. మీరిద్దరూ వారిపై ఆధారపడి బతకడం కాదు. మిమ్మల్ని చదివించడం, మీ కాళ్లపై మీరు నిలబడేదాకా వెన్నుదన్నుగా నిలబడటం తండ్రి బాధ్యతని వారికి వివరిస్తాం అని భరోసా ఇచ్చారు. కలవరపడిన నందిని మనసు కొంచెం నిలదొక్కుకుంది. తన ఆవేదన తీరే రోజులు రాబోతున్నాయన్న నమ్మకం చిక్కింది. అది చాలు, ఆమె అడుగు ముందుకేయడానికి! ఆటంకాలను ఎదుర్కోవడానికి!
No comments:
Post a Comment