వేలు పట్టుకుని నడిపించిన తండ్రి. లోకం పోకడలు తెలిపి.. మార్గదర్శనం చేసిన వ్యక్తి. గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో తట్టుకోలేకపోయాడా కొడుకు. తండ్రి భౌతికకాయంపై పడి అలాగే ఉండిపోయాడు. అక్కడేవున్న బంధువులకు కొద్దిసేపు ఏమీ అర్ధంకాలేదు.
ఎంతసేపటికీ అతడు లేవకపోవడంతో.. కంగారుపడ్డారు. తేరుకుని ఆస్పత్రికి తీసుకువెళుతుండగా.. మార్గమధ్యలో కన్నుమూశాడు. తండ్రీ కొడుకులు.. తల్లీ బిడ్డల మధ్య సహజ సంబంధాలు లోపించి.. విలువలు పతనమవుతున్న నేటి ఆధునిక సమాజంలో.. మన కుటుంబ వ్యవస్థలోని గొప్పతనాన్ని చాటిచెప్పే ఈ సంఘటన నెల్లిమర్ల మండలం నారాయణపట్నంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. తండ్రికి చితిపెట్టాల్సిన కొడుకు.. అతని వెంటే పాడెపై వెళ్తున్న దృశ్యాన్ని చూసినవారంతా కన్నీరుపెట్టారు.మగ దిక్కును కోల్పోయిన కుటుంబం కన్నీరుమున్నీరుగా రోదిస్తోంది. మొయిద గ్రామ పంచాయతీ పరిధిలోని నారాయణపట్నంకు చెందిన జమ్ము రామునాయుడు (70) శనివారం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడు. తండ్రి చనిపోవడాన్నిచూసి తట్టుకోలేక ఆయన కుమారుడు ఎం.వెంకటరమణ తండ్రి మృతదేహంపై కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడ ఉన్నవారు వెంక టరమణను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు.
దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. మగదిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు వర్ణణాతీతం. జమ్ము రామునాయుడు జూట్‌మిల్లులో పనిచేస్తూ ప దవి విరమణ పొందారు. ఆ కుటుంబ బాధ్యతలను నెట్టుకొస్తున్న పెద్దకొడుకు వెంకటరమణ (35) తండ్రితోపాటు మృతిచెందడంతో కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. పెద్దదిక్కును కోల్పోయామంటూ మృతుల భార్య, పిల్లలు మృతదేహాలపైపడి రోదిస్తుంటే వారిని ఓదార్చడం ఎవరి తరంకాలేదు. వెంకటరమణకు ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు.
కూలిపని చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. తండ్రీ కొడుకులు మృతిచెందడంతో ఆ గ్రామాన్ని విషాధచాయలు అలుముకున్నాయి. అందరిలో మంచి పేరు సంపాదించిన తండ్రీ కొడుకులు ఒకేసారి మృతి చెందడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. వారిద్దరి బంధం అమోఘం తండ్రి రామునాయుడు అంటే వెంకటరమణకు చిన ్నప్పటి నుంచి అమోఘమైన ప్రేమ. తండ్రి అడుగుజాడల్లోనే నడిచేవాడని, తండ్రీ కొడుకులది ఒకే మాట అని వారి బంధువులు తెలిపారు.
వెంకటరమణను చిన్నప్పటి నుంచి కూడా తండ్రి చాలా ముద్దుగా చూసుకునేవాడని, రమణ తల్లి తెలిపింది. జూట్‌మిల్లులో పనిచేస్తున్న తండ్రి కోసం ఎదురుచూసి, ఆయన వచ్చాకే కలిసి భోజనం చేసేవారని చెప్పింది. చిన్నతనంలో వెంకటరమణకు సుస్తీ చేస్తే తండ్రి రామునాయుడు రెండు మూడురోజులు భోజనం చేసేవాడు కాదని, వెంకటరమణ కూడా తన తండ్రి పట్ల అంతే ఆప్యాయంగా ఉండేవాడని తల్లి చెప్పారు. తండ్రీ కొడుకులిద్దరూ స్నేహితులుగా మసలుతూ.. ఒకరి విషయాలు మరొకరు చెప్పుకునేవారని రోదిస్తూ తెలిపింది.
No comments:
Post a Comment