Monday, February 21, 2011

మాటంటే మాటే'

'ఎప్పటికెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి యన్యుల మనముల్‌ నొప్పింపక, తానొవ్వక, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ...' అన్నాడు శతకకారుడు. దీనిని అక్షరాలా పాటిస్తున్నారు మన పాలక పెద్దలు. పూర్వం మాట తప్పని మనుషులు ఉండేవారట! ఒకసారి మాటిస్తే మరి తిరుగు ఉండేది కాదట! మాట తప్పటం మరణంతో సమానంగా భావించేవారట.. అలాంటి హరిశ్చంద్రుల కాలం హరించుకుపోయి చాన్నాళ్లయింది! ఇవి 'మాటంటే మాటే' అని, మాట మీద నిలబడే రోజులు కావు. ఏ స్థాయి మనుషులైనా, ఏ తీరు వ్యవహారాలైనా- 'రాత'పూర్వకంగా ఉంటేనే చెల్లుబాటు! ఈకాలంలో దేవుడు దిగొచ్చి వరమిచ్చినా- స్టాంపులూ రాతలూ సంతకాలూ సాక్షులూ ఉండి తీరాల్సిందే!
ఇది 'కలం'సాక్షిగా నడుస్తున్న కాలం అయినందున... ఎంతటి నాయకుడు హామీ ఇచ్చినా జనం నమ్మరు! ఎందుకంటే- దీనికి నేపథ్యంగా సవాలక్ష అనుభవాలు ఉన్నాయి. 'ఏరు దాటాక తెప్ప తగలేసే' పాలక పెద్దల హయాంలో - జనం నమ్మకాలు వమ్మయ్యాయి. కాబట్టే- మాటల్లో కాదు, రాతల్లో చూపండి... అని వివిధ తరగతుల కార్మికులూ ఉద్యోగులూ తమ సమస్యలపై పోరాటాలకు దిగుతారు. పాలకుల వాగ్దానాలు ఉత్తర్వుల రూపం దాల్చితే పొల్లు పోకుండా ఉంటాయని గట్టిగా నమ్ముతారు. అయితే- అలాంటి కాలానికి కూడా ఇప్పటి పాలకులు చరమగీతం పాడుతున్నారు. జీవోలకు సైతం ఎగనామం పెట్టేస్తున్నారు.
ఫీీజు రీయింబర్స్‌మెంటు నుంచి వృద్ధాప్య పింఛను దాకా ఉత్తర్వులకు, ఆచరణకు సంబంధం లేకుండా పోతోంది. అక్టోబరు నుంచి 30 కేజీల బియ్యం అన్నారు రెండేళ్ల క్రితం. ఆ తరువాత అతీగతీ లేదు. పేదలకు విద్యుత్‌, 60 ఏళ్లు దాటితే అభయ హస్తం, అందరికీ ఇళ్లూ ఇళ్ల స్థలాలూ.... రాతపూర్వక లక్ష్యాలూ ఉత్తర్వులూ ఘనంగా ఉంటాయి. ఆచరణలో అలాంటి ఆనవాళ్లు కనపడవు. పట్టాలు ఇస్తారు... ఇళ్ల స్థలాలు చూపించరు. ఈ బాధిత వరసలో సామాన్యులే కాదు, దేశప్రతిష్టను పెంచిన క్రీడాకారులూ ఉన్నారు. సమస్య పదిమంది నోళ్లలోనూ నానుతున్నప్పుడు- పాలక పెద్దలు నష్టపరిహారాలూ, ఆర్థిక సహాయాలూ ఘనంగా ప్రకటిస్తారు. తరువాత దిక్కూ దివాణమూ ఉండదు. ఉదారంగా ఇచ్చిన ఉత్తర్వులు చిల్లపెంకులైపోతాయి!
కాంట్రాక్టు ఉద్యోగులూ, కార్మికుల సమస్యపైనా ఇదే తంతు! ఒకసారి ఉద్యమిస్తే- గత్యంతరం లేదన్నట్టు జీతాల పెంపు ప్రకటన చేస్తారు. సమస్యల పరిష్కారంపై రాతపూర్వక సన్నద్ధత వ్యక్తం చేస్తారు. ఆందోళన ముగిసి, నెలలూ సంవత్సరాలూ గడుస్తాయి. ఒప్పందాల అమలు ఊసే ఎత్తరు! దీంతో, కడుపు మండిన కార్మికులు గత్యంతరం లేక ఉత్తర్వుల అమలు కోసం మళ్లీ ఉద్యమించాల్సిన పరిస్థితి!
'అవసరమైనప్పుడు ఏమైనా చెబుతాం... ఏదైనా చేస్తాం... అవసరం లేనప్పుడు ఎలాగైనా ప్రవర్తిస్తాం. ఎంతకైనా తెగిస్తాం...' ఇదీ, మా పద్ధతని పాలకపెద్దలు చెప్పకనే చెబుతున్నారు. 'గుర్తె'రిగి వాత పెడితే తప్ప దారిలోకి రారు! ఆ చికిత్స చేయాల్సింది జనమే... అంటే మనమే..!

No comments:

Post a Comment